సినిమా సౌథానికి "శంకుస్థాపన"
చేసిన అశోకచక్ర మూవీస్
సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న
ప్రముఖ స్థిరాస్తి వ్యాపారి *బాసెట్టి అశోక్*
హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో "అమీన్ పుర్ అశోక్", "హైవే కింగ్" గా తనకంటూ ప్రత్యేకమైన పేరు గడించుకున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు "బాసెట్టి అశోక్" సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. "అశోక చక్ర మూవీస్" పేరిట నిర్మాణ సంస్థను నెలకొల్పి... ప్రొడక్షన్ నంబర్ 1గా "శంకుస్థాపన" పేరుతో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించేందుకుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. "తారకాసుర-2" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న బహుముఖ ప్రతిభాశాలి విజయ్ భాస్కర్ రెడ్డి పాల్యం "శంకుస్థాపన" చిత్రానికి దర్శకుడు. "పుడమితల్లి" అనే ట్యాగ్ లైన్ తో త్వరలో సెట్స్ కు వెళ్లనున్న "శంకుస్థాపన" చిత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరుగుతున్న మోసాలు, అవకతవకల నేపథ్యంలో రూపొందనుండడం గమనార్హం. స్వతహా రచయిత కూడా అయిన అశోక్ బాసెట్టి కథతోపాటు రచనా సహకారం అందిస్తుండడం విశేషం.
అశోకచక్ర మూవీస్ అధినేత బాసెట్టి అశోక్ మాట్లాడుతూ..."ఈరోజు ఎకరా 100 కోట్లు పలుకుతున్న పుడమితల్లిని పది పదిహేను వేలకు అమ్ముకుని, ఇప్పుడు కుమిలి కుమిలి ఏడుస్తున్న పుడమిపుత్రులు (రైతులు) ఎందరో నాకు తెలుసు. మధ్యవర్తులు సైతం మధ్యంతర సిరితో కోట్లకు పడగలెత్తారు. కానీ రైతుల పరిస్ఠితి అగమ్యగోచరంగా ఉంది. స్థిరాస్తి వ్యాపారంలోని లొసుగులను బహిర్గతం చేస్తూనే... మానవీయ కోణంలో భావోద్వేగాలను సమ్మిళితం చేసి "శంకుస్థాపన" చిత్రాన్ని తీర్చిదిద్దనున్నాం. మా దర్శకుడు విజయ్ భాస్కర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కిస్తాడనే నమ్మకం నాకుంది" అన్నారు.
ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి చేస్తామని దర్శకుడు విజయ్ భాస్కర్ రెడ్డి తెలిపారు!!