Home » » Singeetham Srinivasa Rao Dikkatra Parvathi Gets Rare Honor

Singeetham Srinivasa Rao Dikkatra Parvathi Gets Rare Honor

 సింగీతం శ్రీ‌నివాస‌రావు తీసిన 'దిక్క‌ట్ర పార్వ‌తి'కి అరుదైన గౌర‌వం...


*జనవరి 1న చెన్నై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో సినిమా ప్రత్యేక ప్రదర్శన*



భారతీయ చిత్ర పరిశ్రమకు కొత్తదనం పరిచయం చేసిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఆయన ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. అందులో తమిళ సినిమా 'దిక్కట్ర పార్వతి' ఒకటి. గ్రేట్ రాజాజీ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రమిది. 1974లో విడుదలైంది. దీనికి ఫిల్మ్ ఫైనాన్స్ కార్పోరేషన్ స్పాన్సర్ చేయడం విశేషం. ఇప్పుడీ సినిమా ఓ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. చెన్నైలో జరుగుతున్న ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో జనవరి 1వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు 'దిక్కట్ర పార్వతి'ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.


'దిక్కట్ర పార్వతి'కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రాజాజీ జన్మస్థానమైన తోరపల్లెలో చిత్రాన్ని తెరకెక్కించారు. హై కోర్టు అనుమతి తీసుకుని హోసూర్‌లోని కోర్టులో సినిమాలో కోర్టు రూమ్ సీన్స్ చిత్రీకరించారు. ఆ సన్నివేశాల్లో రియల్ లాయర్లు నటించారు. కణ్ణదాసన్ రాసిన ఓ పాటతో పాటు రాజాజీ రాసిన మరో పాటను వాణీ జయరామ్ ఆలపించారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్జీ రామ‌చంద్ర‌న్‌ ఆదేశాల మేరకు... మద్యపాన నిషేధం కొరకు 16 ఎంఎం కాపీలు సిద్ధం చేయించడానికి ప్రభుత్వ అధికారులు సినిమా నెగెటివ్ తీసుకున్నారు. తమిళంలో తొలి నియో రియలిస్టిక్ సినిమా కూడా ఇదే. 


చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో సినిమా ప్ర‌ద‌ర్శించ‌నున్న నేప‌థ్యంలో అప్పటి సంగతులను సింగీతం శ్రీనివాసరావు గుర్తు చేసుకున్నారు. "ఈ సినిమా కోసం రాజాజీ గారిని వ్యక్తిగతంగా కలిసి ఆయన అనుమతి తీసుకోవడం మరువలేని అనుభూతి. సినిమా విడుదలైన కొన్నాళ్ల తర్వాత నెగెటివ్ డ్యామేజ్ అయ్యిందనే విషయం తెలిసి షాక్ అయ్యాను. అదృష్టవశాత్తూ... మంచి ప్రింట్ ఒకటి పుణెలోని నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ దగ్గర లభించింది. భారతీయ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఐదు వందల క్లాసిక్ సినిమాలను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది. అందులో 'దిక్కట్ర పార్వతి' ఒకటి. ఈ రోజు సినిమా డిజిటల్ కాపీ నా దగ్గర ఉండటం చాలా సంతోషంగా ఉంది. సినిమా విడుదలైనప్పుడు అప్పటి ప్రేక్షకులు ఎంత ఫ్రెష్‌గా ఫీల్‌ ఫీలయ్యారో... ఇప్పటి ప్రేక్షకులు కూడా అంతే ఫ్రెష్‌గా ఫీల్‌ అవుతారని ఆశిస్తున్నాను" అని సింగీతం శ్రీనివాసరావు తెలిపారు.


లక్ష్మి, వై.జి. మహేంద్ర తదితరులు నటించిన ఈ సినిమాకు నేషనల్ అవార్డు లభించింది. ఈ చిత్రానికి వీణా విద్వాన్ చిట్టిబాబు సంగీతం అందించారు. రవి వర్మ, కారైకుడి నారాయణ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.


Share this article :