Home » » Minister Talasani Srinivas Yadav Birthday Celebrations Held Grandly

Minister Talasani Srinivas Yadav Birthday Celebrations Held Grandly

 తెలుగు చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో భారీగా

సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని జన్మదిన వేడుకలు



తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జన్మదిన (అక్టోబర్‌ 6) వేడుకలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో జరిగిన ఈ వేడుకల్లో చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షులు దిల్‌రాజు, ప్రముఖ నిర్మాతలు దామోదర ప్రసాద్‌, చినబాబు, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌, శ్రీ కళ్యాణ్, నటులు రఘుబాబు, 30 ఇయర్స్‌ పృథ్వి, మాదాల రవి, చిత్రపురి కాలనీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌, దొరై, సురేష్ సినీ జర్నలిస్ట్‌ సంఘం తరపున సురేష్‌ కొండేటి, లక్ష్మీనారాయణ, 24 క్రాఫ్ట్‌కు చెందిన నాయకులు, కార్మికులు వేలాదిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్టేడియం ప్రధాన ద్వారం నుంచి స్టేడియంలోని వేదిక వరకు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. వేదికపైకి చేరుకున్న మంత్రిని భారీ గజమాలతో సత్కరించింది చిత్ర పరిశ్రమ. అనంతరం వివిధ సినీ కార్మిక సంఘాల నుంచి వచ్చిన వ్యక్తులు మంత్రిని శాలువాలతో, పూల మాలలతో, మెమెంటోలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి పలువురు యాదవ సంఘ నాయకులు కూడా మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి రావడం విశేషం.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ కుమారుడు తలసాని సాయి యాదవ్‌ తన తండ్రిపై ఓ రాయించిన ఓ ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. అలాగే ప్రముఖ రూబిక్స్‌ క్యూ కళాకారుడు కళ్లకు గంతలు కట్టుకుని ‘హ్యాపీబర్త్‌డే టు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గారు’ అని రూబిక్స్‌తో లైవ్‌లో చేయడం, అలాగే త్రీడీ టెక్నాలజీతో రూబిక్స్‌ క్యూలను ఉపయోగించి మంత్రి తలసాని, ఆయన కుమారుడు సాయి, మనుమడుల ఫేస్‌లు ఒకే ఫ్రేమ్‌లో వచ్చేలా కళ్లకు గంతలు కట్టుకుని చేసిన ఫీట్‌కు స్టేడియం కరతాళ ధ్వనులతో మారుమోగి పోయింది.

అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ... 

‘‘నా జన్మదిన వేడుకలను ఇంత భారీగా నిర్వహిస్తారని నేను కూడా ఊహించలేదు. ఇందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నన్ను ఆశీర్వదించటానికి ఇన్ని వేల మంది రావడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా. చిత్ర పరిశ్రమకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను ముందు ఉంటాను. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు కూడా చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం పట్ల ఎప్పుడూ చాలా సానుకూలంగా ఉంటారు. ఈ చక్కని ఆత్మీయ వాతావరణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా’’ అన్నారు.


Share this article :