‘అందెల రవమిది’ – నృత్య కధనానికి కొత్త రూపం
భారతీయ నృత్య కళల పట్ల అగాధమైన ప్రేమతో శిక్షకురాలిగా, నర్తకిగా ముందుకు సాగిన ఇంద్రాణి దావులూరి, ఇప్పుడు దర్శకురాలిగా, కథానాయికగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆమె స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘అందెల రవమిది’ అక్టోబర్ 11న విడుదలై ప్రేక్షకుల మనసులను తాకుతోంది. భారతీయ నృత్య సంప్రదాయాల సౌందర్యాన్ని ఆవిష్కరించే ఈ చిత్రాన్ని ఇంద్రాణి స్వయంగా నిర్మించటం విశేషం.
కథలోకి వెళ్తే
భారతీయ నృత్యరూపాలలో తన ప్రతిభను ప్రపంచానికి చాటాలని కలగంటూ ఎదిగే పావని (ఇంద్రాణి దావులూరి) జీవితంలో అచానక మలుపు తిరుగుతుంది. రమేశ్ (విక్రమ్ కొల్లూరు)తో వివాహం అయ్యాక అమెరికాలో స్థిరపడుతుంది. కానీ కళ పట్ల పావనికి ఉన్న మక్కువను గుర్తించిన రమేశ్ ఆమెను ప్రోత్సహిస్తాడు. అమెరికాలోనే డాన్స్ స్కూల్ ప్రారంభించి తన కలను నెరవేర్చాలని ప్రయత్నించే పావని జీవితంలో మరో సంక్షోభం ఎదురవుతుంది ఆపరేషన్ కారణంగా ఆమెకు సంతానం కలగదని తెలిసే సన్నివేశం భావోద్వేగంగా ఉంటుంది. తరువాత జరిగే పరిణామాలు, రమేశ్ నిర్ణయాలు, భరద్వాజ్ ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానమే చిత్ర మిగతా భాగం.
విశ్లేషణ
కళల పట్ల కృషి, త్యాగం, కుటుంబ విలువలను ప్రతిబింబించే కథతో ‘అందెల రవమిది’ నేటి వాణిజ్య ధోరణులకు భిన్నంగా ఉంటుంది. శంకరాభరణం, స్వాతి కిరణం వంటి క్లాసిక్ చిత్రాల స్ఫూర్తి ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. AI, సోషల్ మీడియాలో మునిగిపోయిన ఈ తరం మధ్య ఇలాంటి కంటెంట్ రూపొందించడం ఇంద్రాణి ధైర్యం చెప్పాలి. కథ నెమ్మదిగా ప్రారంభమైనా, స్క్రీన్‌ప్లే క్రమంగా ఆసక్తిని పెంచుతుంది. లక్ష్యం సాధనలో ఎదురయ్యే అడ్డంకులను చూపించిన తీరు బాగుంది.
నటన
ఇంద్రాణి దావులూరి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఆమె హావభావాలు, భావోద్వేగ సన్నివేశాల్లోని సహజత్వం ఆకట్టుకుంటాయి. విక్రమ్ కొల్లూరు భర్త పాత్రలో బాగానే నెరవేర్చాడు. తనికెళ్ళ భరణి, నిర్మల, జయలలిత, ఆదిత్య మీనన్ వంటి నటులు తమ తమ పాత్రల్లో సరైన మెరుగులు చేర్చారు.
టెక్నికల్ విభాగం
వేణు నక్షత్రం రాసిన కథలో భావోద్వేగం, సాంప్రదాయం రెండూ సమతౌల్యంగా ఉన్నాయి. కార్తీక్ కొడకండ్ల సంగీతం కథతో మిళితమై మమేకం అవుతుంది. రఘు కుల్ మోకిరాల రాసిన సంభాషణలు, సాహిత్యం మనసుకు హత్తుకుంటాయి. అమెరికా లొకేషన్లను సినిమాటోగ్రఫీ అందంగా చూపించింది. నిర్మాణ విలువలు మెరుగ్గా ఉన్నాయి.
మొత్తానికి
‘అందెల రవమిది’ నృత్య కళకు అంకితమైన హృదయపూర్వక చిత్రం. వాణిజ్య హంగులు లేకపోయినా, భావం, సందేశం, కృషి మెచ్చుకోదగినవి. ఇంద్రాణి దావులూరి ప్రయత్నం తప్పక ప్రశంసించాలి.
రేటింగ్: 3/5 – నృత్యానికి నమస్కారం చేసిన సృజనాత్మక ప్రయత్నం.
Post a Comment