ఐకాన్ స్టార్ అంత కాకపోయినా
అందులో ఎంతోకొంత రేంజ్
రీచ్ కావాలన్నదే నా కోరిక!!
- కత్తి లాంటి కొత్త కుర్రాడు
మణి సాయి తేజ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి అరివీర భయంకర అభిమాని ఆ టీనేజ్ కుర్రాడు. అష్టకష్టాలు పడి "అల వైకుంఠపురంలో" ప్రి రిలీజ్ ఈవెంట్ కి పాస్ లు సంపాదించాడు. ఐకాన్ స్టార్ ని సమీపం నుంచి చూసే క్షణాల కోసం తహతహలాడుతూ.... సభా ప్రాంగణం చేరుకున్నాడు.
కానీ పోలీసు బాసులు సైంధవుల్లా తన "బాస్" సమక్షంలోకి చేరుకునేందుకు ససేమిరా అన్నారు. పాస్ చూపించినా ఫలితం లేకపోయింది. కాళ్ళావేళ్ళా పడినా కనికరించలేదు. ఆల్రెడీ లోపల సీట్స్ ఫిల్ అయిపోవడం అందుకు కారణం. ఆ సినిమాలో నటించిన ఇతర నటీనటులు మాత్రం దర్జాగా లోపలకు వెళ్తున్నారు. అప్పుడే ఫిక్సయిపోయాడు... అప్పటికి ఇంకా మీసాలు కూడా రాని ఆ కుర్రాడు... తాను కూడా *"హీరో"* అయి తీరాలని!!
ఆ కుర్రాడి పేరే
*మణి సాయి తేజ*
మణి సాయి తేజ వజ్ర సంకల్పానికి అతని పేరెంట్స్ ప్రోత్సాహం తోడయ్యింది. దానికి అదృష్టం జటాకలిసింది. నటనలో శిక్షణ తీసుకోవడం మొదలు పెట్టిన "మణితేజ"కు హీరో అవకాశం తలుపు తట్టింది. హీరో అయ్యేందుకు అవసరమైన అన్ని క్వాలిటీస్ అతనిలో పుష్కలంగా ఉండడమే అందుకు కారణం.
"బ్యాట్ లవర్స్" చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన మణి... ఆ చిత్రం అప్పటికి ఇంకా షూటింగ్ జరుపుకుంటుండగానే... "రుదాక్షపురం"లో నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఆర్. కె.గాంధీ దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.
ఇక్కడ మరో ముఖ్య విశేషం
ఏమిటంటే....
మణి సాయి తేజ
ముచ్చటగా మూడో సినిమా
కూడా చేస్తుండడం....!!!
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఆ చిత్రం పేరు "మెకానిక్". ట్రబుల్ షూటర్ అన్నది ట్యాగ్ లైన్. సుప్రసిద్ధ దర్శకులు కృష్ణవంశీ శిష్యుడు మునిశేఖర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా... స్వయం కృషితో... తల్లిదండ్రుల ఆశీస్సులతో... అల్లు అర్జున్ రోల్ మోడల్ గా వడివడిగా అడుగులు వేస్తున్న "మణి సాయి తేజ"... తెలుగు చిత్రసీమ అనే "మణిహారం"లో ఓ "మణిపూస"గా రాణించాలని కోరుకుందాం!!!