వైద్యారోగ్య శాఖా మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన దర్శకుడు శేఖర్ కమ్ముల
వరంగల్ కు చెందిన యువకుడు హర్షవర్ధన్ కు అత్యవసర వైద్యం అందించడంలో చొరవ చూపించిన తెలంగాణ వైద్యారోగ్య శాఖా మంత్రి హరీష్ రావుకు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల కృతజ్ఞతలు తెలిపారు. గత మూడేళ్లుగా శేఖర్ కమ్ముల సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయనకు నిత్యం ఎవరో ఒకరి దగ్గర నుంచి అత్యవసర వైద్య చికిత్స కేసులు వస్తున్నాయి.
తాజాగా వరంగల్ కు చెందిన హర్షవర్థన్ అనే యువకుడు క్రాన్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ శేఖర్ కమ్ముల సహయాన్ని కోరారు. శేఖర్ కమ్ముల వెంటనే ఈ యువకుడి పరిస్థితిని మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే స్పందించిన హరీష్ రావు నిమ్స్ లో హర్షవర్ధన్ కు చికిత్స అందించేలా ఆదేశాలు ఇచ్చారు. అడిగిన వెంటనే స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన హరీష్ రావుకు సోషల్ మీడియా ద్వారా దర్శకుడు శేఖర్ కమ్ముల కృతజ్ఞతలు తెలిపారు. హరీష్ రావు గారిని ప్రజల మంత్రి అని పిలిచేందుకు ఇలాంటి ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చని శేఖర్ కమ్ములు తన ట్వీట్ లో పేర్కొన్నారు.