బాడీలో 47 బుల్లెట్స్ దిగినా... నేను బ్రతికింది ప్రజల కోసమే!
- 'కొండా' సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో కొండా మురళి.
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. హనుమకొండలోని కొండా క్యాంపు ఆఫీసులో బుధవారం ఉదయం 10.25 గంటలకు ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్‌లో కొండా మురళి కాలేజీ జీవితం నుంచి సురేఖతో ప్రేమలో పడటం, అన్న (మావోయిస్టు)లతో చేతులు కలపడం, రాజకీయాల్లోకి రావడం చూపించారు. 'వాడ్ని సంపుడు నా పని కాదు, బాధ్యత' అని ట్రైలర్ చివర్లో కొండా మురళి పాత్రధారి చేత ఓ డైలాగ్ చెప్పించారు. అది ఎవర్నీ అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సరిగ్గా 30 ఏళ్ల క్రితం జనవరి 26న, 10.25 గంటలకు కొండా మురళిని షూట్ చేసి చంపడానికి ట్రై చేశారని, అందుకని అదే సమయానికి ట్రైలర్ విడుదల చేశామని వర్మ తెలిపారు.
కొండా మురళి మాట్లాడుతూ "నేను ఆర్జీవీకి రెండు ముక్కలు చెబితే... ఆయన వంద మంది దగ్గర ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకుని సినిమా తీశారు. ఆయన రెండు నెలల పదహారు రోజులు వరంగల్‌లో ఉండి షూటింగ్ చేశారు. ఎక్కడా ఉండని ఆయన రెండున్నర నెలల ఇక్కడ ఉన్నారంటే కథ ఎంత నచ్చిందో తెలుస్తోంది. ఇదే జనవరి 26న నా మీద 47 బుల్లెట్లు ఫైరింగ్ చేశారు. అయినా బతికాను. అది కూడా మా కుటుంబం కోసం కాదు, ప్రజల కోసమని తెలియజేస్తున్నాను. సినిమా గురించి చెప్పడం కన్నా చూస్తే బావుంటుంది. త్రిగుణ్ బాగా నటించాడు. సురేఖ కంటే ఇర్రా మోర్ అందంగా ఉన్నారు. బాగా నటించింది" అని అన్నారు.
కొండా సురేఖ మాట్లాడుతూ "ట్రైలర్ చూశాక మేం ఎంత బాధ అనుభవించామనేది గుర్తొచ్చింది. భావోద్వేగానికి లోనయ్యా. ముఖ్యంగా ఫైరింగ్ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు కూడా జనవరి 26. నేను వెళ్లేసరికి మురళిగారు వైట్ లాల్చీ పైజామాలో రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఆయన చుట్టూ జనం నిలబడి ఉన్నారు. నా కూతురు ఎక్కడ ఉందో కనపడలేదు. నన్ను ఆయన దగ్గరకు వెళ్లనివ్వడం లేదు. మరణించాడని అన్నారు. ఆ రోజు ఆయన మరణించి ఉంటే... ఈ రోజు మేం ఎక్కడ ఉండేవాళ్లమో? మా కుటుంబం ఎక్కడ ఉండేదో? అసలు, మా పరిస్థితి ఏంటో? ఆలోచించడానికి కూడా కష్టంగా ఉంది. దేవుడు నాకు ఇచ్చిన పసుపు కుంకుమ బలం కొండా మురళిగారు మన ముందు ఉండటం. మా పుట్టినరోజులు, పెళ్లి రోజు, పండగలకు ఆయన కాళ్లు మొక్కుతా. ఇటీవల తొలిసారి అడిగా... 'కాళ్లు మొక్కినప్పుడు ఏం అనుకుంటారు?' అని. 'నీ తాళిబొట్టు గట్టిది అనుకుంటాను' అని చెప్పారు. మా మనవరాలు శ్రేష్ఠ పటేల్ పెళ్లి వరకూ కొండా దంపతులు ఇలాగే ఉంటారని ఆశిస్తున్నాను. ఆర్జీవీ గారి గురించి బయట విన్నదానికి, చూసిన దానికి అసలు సంబంధం లేదు. ఆయన గురించి బయట చెప్పేవన్నీ అబద్దాలు. ప్రపంచంలో ఆయనకు తెలియనిది ఏదీ లేదు. మురళి గారి పాత్రను త్రిగుణ్ దింపేశాడు. ఇర్రా మోర్ నా పాత్ర గురించి చెప్పింది. మా జీవిత చరిత్రను ఎలా తీయాలనేది మాకు ఐడియా లేదు. కలిసివచ్చే కాలానికి నడిచి వచ్చే కుర్రాడు వస్తాడన్నట్టు దేవుడు మాకు ఆర్జీవీని చూపించారు. మేం పడ్డ కష్టాలు రామాయణం, మహాభారతం కంటే ఎక్కువ. వాటిని తర్వాత ఏదో ఒక రూపంలో ఆర్జీవీగారు బయటకు తీసుకువస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు.
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ "కొండా దంపతులు విప్లవకారులు. నేను వాళ్లలా కాదు. నాకు విప్లవకారుడు అయ్యేంత ధైర్యం లేదు. అందుకని, ఎవరైతే రిస్కులు తీసుకుని ఉంటారో? వాళ్ల దగ్గరకు వెళ్లి 'కథ ఇస్తారా? సినిమా తీస్తా' అని తీసేస్తా. ప్రత్యేక పరిస్థితుల్లో కొంత మంది వ్యక్తులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల నుంచి వాళ్ల జీవితాలు రకరకాల మలుపులు తిరిగి... ఓ ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఆ ప్రత్యేకత వల్ల వందల, వేల మందిపై ఏదో విధంగా ప్రభావం పడుతుంది. మురళి, సురేఖ, సుష్మిత జీవిత అనుభవాలు 'కొండా' సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపిస్తాయి. త్రిగుణ్ మంచి యాక్టర్ అని నా ఫీలింగ్. కానీ, రొమాంటిక్ మూవీస్ వంటివి చేశాడు. ఇంటెన్స్ రోల్స్ చేస్తే బాగా చేస్తారని ఎప్పటి నుంచో నాకు నమ్మకం ఉంది. మురళి పాత్రలో బాగా చేశాడు. ఇదొక వయలెంట్ క్రైమ్ డ్రామా అయినా సరే... ఇందులో స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉంది. సురేఖ పాత్రలో ఇర్రా మోర్ కూడా బాగా నటించింది. కొండా ఫ్యామిలీ యూనిక్ ఫ్యామిలీ. మురళి చెప్పిన విషయాలను రెండు గంటల సినిమాగా తీయడం చాలా కష్టం. అందులో కొన్ని విషయాలు తీసుకుని సినిమా చేశా. ఆయన జీవితం మీద ఐదారు సినిమాలు తీయవచ్చు. 'కొండా 2'లో మురళి, సురేఖ దంపతుల కుమార్తె సుష్మిత పాత్ర ఉంటుంది. 'కొండా' సినిమాలో ఓ టైమ్ పీరియడ్, గెటప్ తీసుకోవడం వల్ల ఆమె పాత్ర లేదు. మురళి అన్న చేసిన రిస్క్ వల్ల... నా కెరీర్‌లో డిఫరెంట్, గుడ్ సినిమా తీశానని నమ్మకం ఉంది. ప్రేక్షకులు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను" అని చెప్పారు.
సుష్మిత మాట్లాడుతూ "కొండా మురళి, సురేఖ గారు ఎంతో కష్టపడితే ఇంత దూరం వచ్చారు. వాళ్ల కథ అందరికీ తెలియాలనుకున్నాను. ఎలా చెప్పాలనే విషయంలో చాలా తర్జన భర్జన పడ్డాను. ఎందుకంటే... నేను పుట్టిన నాలుగో రోజు మా నాన్న వైస్ సర్పంచ్ అయ్యాడు. అప్పట్నుంచి ఇప్పటికి... 35 ఏళ్లుగా పోరాటం సాగిస్తున్నారు. అంతకు ముందు ఐదేళ్లు రాడికల్ లీడర్ గా ఉన్నారు. నాన్నతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ట్రైలర్‌లో త్రిగుణ్ ఎవరినో కొట్టారు కదా! అక్కడ కొట్టినప్పుడు కూడా నేనే ఉన్నాను. ఎవరినైనా నాన్న కొట్టడానికి వెళ్లినప్పుడు కూడా నన్ను తీసుకువెళ్లేవారు. ఎవరికీ అన్యాయం జారకూడదని చెప్పేవారు. రాజకీయాలు అంటే ఇలాగే చేయాలి, ఇదే పంథాలో ఉండాలని అనుకుని రాజకీయం చేసిన నాయకులు వీళ్లు. మా నాన్న గ్రేట్. నాలుగుసార్లు భార్యను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఓసారి మంత్రిని చేశారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ ప్రొడక్షన్‌లో సినిమా తీశాం. ట్రైలర్ బావుంది" అని చెప్పారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తమ కుటుంబానికి ఏ విధంగా అండగా ఉన్నదీ ఆమె వివరించారు.
హీరో త్రిగుణ్ మాట్లాడుతూ "నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ రోజు ఇలా హీరోగా నిలబడటం నా బిగ్గెస్ట్ సక్సెస్ అని భావిస్తున్నాను. ట్రైలర్ విడుదల రోజున ఎందుకు సక్సెస్ అంటున్నానంటే... కొండా మురళి, సురేఖ గురించి రామ్ గోపాల్ వర్మ తీసిన ఒక యాక్షన్, నక్సలైట్ బ్యాక్‌గ్రౌండ్, తెలంగాణ సినిమాలో హీరో అంటే ఇంతకన్నా పెద్ద మాస్ ఏముంటుంది? నా సినిమాలు చూసి ఉంటారు. ఇప్పటి వరకూ చాలా లవ్ స్టోరీలు చేశా. ఈ సినిమా నాకు కొత్తగా ఉంటుంది. 'నేను కొత్తగా వస్తున్న సంగతి బయట కూడా తెలియాలి. పేరు మార్చుకుందామని అనుకుంటున్నాను' అని వర్మతో చెబితే... 'మార్చుకో' అన్నారు. త్రిగుణ్ పేరు ఫైనలైజ్ చేశాం" అని అన్నారు.
హీరోయిన్ ఇర్రా మోర్ మాట్లాడుతూ "రామ్ గోపాల్ వర్మ కథ చెప్పినప్పుడు నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. జీవితంలో ఎన్నో కష్టాలను దాటుకుని సురేఖ గారు ముందుకు వచ్చారు. ఆమెలా చేయడం మహిళలకు అంత ఈజీ కాదు. మురళి గారితో ప్రేమలో పడటం, కష్టాల్లో ఆయనకు అండగా ఉండటం... గాళ్ ఫ్రెండ్స్ అందరూ అలా చేయరు. ఒకరికి ఒకరు అండగా నిలబడ్డారు. సురేఖ గారు స్ట్రాంగ్ లేడీ. ఆమె పాత్ర చేయాలని అనిపించింది. ఆ పాత్రకు నేను 50 శాతం న్యాయం చేసినా హ్యాపీగా ఫీల్ అవుతా. రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు మాత్రమే ఈ సినిమా తీయగలరు. యాక్టింగ్, పెర్ఫార్మన్స్ పరంగా ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను" అని చెప్పారు.
పృథ్వీరాజ్, పార్వతి అరుణ్, ప్రశాంత్, ఎల్బీ శ్రీరామ్, తులసి, 'జబర్దస్త్' రామ్ ప్రసాద్, అభిలాష్ చౌదరి, శ్రవణ్, అనిల్ కుమార్ రెడ్డి లింగంపల్లి, గిరిధర్ చంద్రమౌళి, రవి, షబీనా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కళా దర్శకత్వం: అంజి, ఆటో జానీ, కూర్పు: మనీష్ ఠాకూర్, పోరాటాలు: శ్రీకాంత్, మాటలు: భరత్, ఛాయాగ్రహణం: మల్హర్ భట్ జోషి, సమర్పణ: శ్రేష్ఠ పటేల్ మూవీస్, నిర్మాణం: ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్, కథ - కథనం - దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ.