Home » » Star Boy Siddhu Jonnalagadda Tillu Square completes censor formalities with U/A

Star Boy Siddhu Jonnalagadda Tillu Square completes censor formalities with U/A

 స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 'టిల్లు స్క్వేర్' సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి |మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల 



‘డీజే టిల్లు’ చిత్రంతో ‘టిల్లు’గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఈ చిత్రం యువత మరియు సినీ ప్రియుల్లో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. దాంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న "టిల్లు స్క్వేర్" కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రకటనతోనే ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 'రాధిక', 'టికెటే కొనకుండా', 'ఓ మై లిల్లీ' పాటలతో పాటు ఇతర ప్రచార చిత్రాలు విడుదలై సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటేలా చేశాయి.


తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. సినిమా చూసిన తర్వాత సెన్సార్ సభ్యులు, ఆద్యంతం వినోదభరితంగా ఉండే చిత్రాన్ని అందించడానికి చిత్ర బృందం చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని వారు ఎంతగానో ఆస్వాదించారు. ముఖ్యంగా టిల్లు పాత్ర, అతను పలికే సంభాషణలు వారిని ఎంతగానో అలరించాయి.



సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి "యు/ఎ" సర్టిఫికేట్ ఇచ్చింది. 'టిల్లు స్క్వేర్' చిత్రం 'డీజే టిల్లు'ను మించిన విజయాన్ని సాధిస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. "టిల్లు" అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా వినోదభరితంగా ఈ చిత్రాన్ని రూపొందించామని పేర్కొన్నారు.


ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ఆమె తన కెరీర్‌లో తొలిసారిగా "లిల్లీ" అనే బోల్డ్ క్యారెక్టర్‌ను పోషించింది. ఇప్పటికే ఆమె పాత్రకి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అప్పుడే అందరూ "లిల్లీ" పాత్రను "రాధిక" పాత్రతో పోల్చడం ప్రారంభించారు. అయితే ఈ రెండు పాత్రలు భిన్నమైనవని, లిల్లీతో టిల్లు ప్రయాణం కూడా విభిన్నంగా ఉంటుందని, థియేటర్లలో రెట్టింపు వినోదాన్ని మరియు రెట్టింపు మజాని అందిస్తామని మేకర్స్ చెప్పారు.


సిద్ధు జొన్నలగడ్డ ఈ చిత్రానికి కథనం, సంభాషణలు అందించగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందించగా, రామ్ మిరియాల, అచ్చు రాజమణి పాటలు స్వరపరిచారు. భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం అందించారు.


శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరించారు. టిల్లు యొక్క "డబుల్ ధమాకా" ఎంటర్‌టైనర్ టిల్లూ స్క్వేర్ మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.


Share this article :