‘ఉస్తాద్’మూవీలో నేను చేసిన మేఘన పాత్ర యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది - హీరోయిన్ కావ్యా కళ్యాణ్ రామ్
టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్’. కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్. వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యార్స్‌పై ఫణిదీప్ దర్శకత్వంలో రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 12న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ కావ్యా కళ్యాణ్ రామ్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు...
ఆగస్ట్ 12న ‘ఉస్తాద్’ సినిమా రిలీజ్ అవుతుంది. భారీ సినిమాలతో పాటు మా సినిమా వస్తుంది. అయితే మా సినిమా కంటెంట్‌పై చాలా నమ్మకంగా ఉన్నాం. చాలా ఇష్టపడి చేసిన సినిమా. మాకు నచ్చిన సినిమా జనాలకు కూడా నచ్చితే బావుంటుందనుకుంటున్న టెన్షన్ అయితే ఉంది.
సూర్య అనే పాత్రలో శ్రీసింహ కనపించబోతున్నారు. హీరో తన బైక్‌ను ఉస్తాద్ అని పిలుచుకుంటుంటాడు. తను టీనేజర్ నుంచి యువకుడిగా ఎదగటం, ఫైలట్‌గా జాబ్ సంపాదించటం అనేది సినిమాలో ప్రధానాంశం. ఇందులో సూర్య ప్రేయసి మేఘన పాత్రలో నేను నటించాను. సూర్యకి చటుక్కున్న కోపం వచ్చేస్తుంటుంది. అలాంటి వ్యక్తిని మెచ్యూర్డ్‌గా ఆలోచించేలా మార్చే అమ్మాయి మేఘనగా ‘ఉస్తాద్’ చిత్రంలో కనిపిస్తాను.
మేఘన పాత్ర విషయానికి వస్తే ఆమె గవర్నమెంట్ జాబ్ చేయాలని తండ్రి కోరుకుంటాడు. ఆయన కోరిక కోసం మేఘన ఇంజనీరింగ్ చదువుతుంది. ఆమెకేమో ఎంబీఏ చేయాలనుంటుంది. దాన్ని కూడా పూర్తి చేస్తుంది. మానసికంగా తను చాలా బలవంతురాలు. తన క్యారెక్టర్ చాలా మంది అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది.
గౌతమ్ మీనన్‌గారు ఇందులో చాలా కీలక పాత్ర పోషించారు. హీరోకి మెంటర్ పాత్ర. మా డైరెక్టర్ ఫణిదీప్‌గారు గౌతమ్ మీనన్‌కి పెద్ద ఫ్యాన్. స్క్రిప్ట్ రాసుకునే సమయం నుంచి గౌతమ్ మీనన్‌గారిని దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ రోల్ డిజైన్ చేసుకున్నారు. ఆయన నెరేషన్‌తోనే ‘ఉస్తాద్’ సినిమా స్టార్ట్ అవుతుంది.. ఆయనతోనే సినిమా ఎండ్ అవుతుంది.
‘ఉస్తాద్’ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. ప్రమోషన్స్ చేసేటప్పుడు చాలా కాలేజీలకు వెళ్లాం. వాళ్ల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది.
తెలుగు హీరోయిన్స్‌కి అవకాశాలు రావటం లేదని ఎందుకు అంటున్నారో అర్థం కావటం లేదు. ఎందుకంటే, సావిత్రి, శ్రీదేవి ఇలా చాలా మంది తెలుగు హీరోయిన్స్ పెద్ద సక్సెస్‌ను సాధించారు. ఇండియా వైడ్ వాళ్ల కంటే సక్సెస్‌ను ఎవరూ చూడలేదు. నా విషయానికి వస్తే నేను తెలుగు అమ్మాయి కావటం నాకు ప్లస్సే అయ్యింది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాను. ఆ మూడు సినిమాల డైరెక్టర్స్ అయితే తెలుగు మాట్లాడే హీరోయిన్‌నే తీసుకోవాలనుకున్నారు. అలా నాకు అవకాశం వచ్చింది. భాష వస్తే చాలు అవకాశం వస్తుందనుకోకూడదు. ఎందుకంటే నటీనటులు ఒక భాషకే పరిమితం కాకూడదు.
రజినీకాంత్‌గారి జైలర్ సినిమా, చిరంజీవిగారి భోళా శంకర్ సినిమాల తర్వాత మా సినిమా వస్తుంది. ఆ ఇద్దరూ లెజెండ్స్ వాళ్ల సినిమాలను చూసే ఆడియెన్స్‌లో సగం మంది అయినా మా సినిమాను చూస్తే మాకు చాలు.
కొన్ని సినిమాలకు ఓకే చెప్పాను. అయితే మేకర్స్ చెప్పకుండా నేను వాటి వివరాలను చెప్పకూడదు. నిర్మాతలే అనౌన్స్ చేస్తారు.