‘ఉగ్రం’ సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్: హీరో అల్లరి నరేష్
‘నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్ గా నిర్మించారు. మిర్నా మీనన్ కథానాయికగా నటించింది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో ఉగ్రంపై అంచనాలని పెంచాయి. మే 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో హీరో అల్లరి నరేష్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
ఉగ్రం పై చాలా నమ్మకం గా కనిపిస్తున్నారు ?
అవునండీ. చాలా నమ్మకంగా వున్నాను. ఉగ్రం సినిమా చూసిన తర్వాత ప్రతి క్రాఫ్ట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. శ్రీచరణ్ దాదాపు రెండున్నర నెలలు కష్టపడి చాలా కొత్త సౌండ్ చేశాడు. అలాగే బ్రహ్మ కడలి, సిద్ ఎడిటర్. ప్రసాద్, అబ్బూరి రవి గారు ఇలా అందరం కలసి టీం వర్క్ చేశాం. నాంది తర్వాత టీం అందరిపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు అందుకోవడం కోసం పదింతలు కసిగా పని చేశాం.
నాంది, ఉగ్రం లాంటి పేర్లు మీ మీద ఊహించుకోవడం కొంచెం కష్టం కదా.. ?
ఇరవై ఏళ్ళుగా అల్లరల్లరి చేయడంతో అది అలా పెట్టేశారు. అయితే దాని నుంచి బయటికి రావాలి, ఎప్పుడూ అదే చేస్తుంటే చూసే వారికి, చేసే నాకూ బోర్ కొడుతుంది. మహేష్ బాబు గారితో చేసిన మహర్షి ఓ కొత్త నమ్మకాన్ని ఇచ్చింది. అంత సింపతీ పాత్రలో నన్ను యాక్సెప్ట్ చేసే సరికి ధైర్యం వచ్చింది. దీని తర్వాత కాన్సెప్ట్స్ తో ప్రయాణం చేస్తున్నాను.
నాంది, మారేడు మిల్లి, ఉగ్రం మూడూ సీరియస్ కథలే చేశారు కదా.. అదే జోనర్ లో వెళ్లాలని అనుకుంటున్నారా ?
నాంది కి ముందు రచయితలు నన్ను దృష్టిలో పెట్టుకొని ఒక తరహా కథలు రాసేవారు. మహర్షి తర్వాత ఇలాంటి సినిమాలు కూడా చేయగలను అని కొత్త కథలు రాయడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఉగ్రం తర్వాత మరిన్ని కొత్త కథలు రాస్తారనే నమ్మకం వుంది.
కామెడీ పాత్రలు చాలా సునాయాసంగా చేశారు కదా.. ఇలాంటి యాక్షన్ రోల్ చేయడం సవాల్ గా అనిపించిందా ?
కామెడీ చేయడం చాలా కష్టం. కామెడీ చేసేవారు ఏదైనా చేయగలుగుతారు. రంగమార్తాండ లో బ్రహ్మనందం గారు, విడుదల లో సూరి లని అందరూ వెల్ కమ్ చేశారు. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఉగ్రం విషయానికి వస్తే దర్శకుడు విజయ్ నా ప్లస్సుల కంటే మైనస్సులు ముందుగా చెప్పేశాడు. పోలీస్ పాత్రకు నా ఎత్తు పొడుగు ఓకే. అయితే నా కంటే ఎత్తు తక్కువ వున్న వాళ్ళతో చేసినప్పుడు నేను ఒంగి మాట్లాడతానని, వరుసగా కామెడీ సినిమాలు చేయడం వలన బాడీ లాంగ్వేజ్ తెలియకుండానే అటు వైపు వెళుతుందని, పాత నరేష్ కనిపిస్తే ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయిపోతారని,.. వీటన్నిటిని అధిగమించాలని ముందే వివరంగా చెప్పాడు. చాలా జాగ్రత్తలు తీసుకొని, కంట్రోల్ చేసి ఉగ్రం చేశాను.
క్రిష్ గారి నమ్మకంతో గమ్యం వచ్చింది. సముద్రఖని గారి నమ్మకంతో శంభో శివ శంభో వచ్చింది. ఇప్పుడు విజయ్ నమ్మకంతో నాంది, ఉగ్రం వచ్చాయి. దర్శకుడు నమ్మితే దాని రిజల్ట్ వేరేలా వుంటుంది. ఇంత ఇంటెన్స్ రోల్ చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఈ క్రెడిట్ అంతా విజయ్ కి వెళుతుంది.
మొన్న హీరోలందరూ కలసి చేసిన వీడియో వైరల్ అయ్యింది .. ఎలా అనిపించింది ?
నాకు అది సర్ ప్రైజ్. శేష్, నిఖిల్, విశ్వక్, సందీప్ ఆ వీడియో చేస్తారని నాకు తెలియదు. కార్వాన్ లో చేశారట. అది నాపై వాళ్లకి వున్న ప్రేమ.
ఉగ్రంలో మీ పాత్ర ఎలా వుండబోతుంది ?
ఇందులో మూడు వేరియేషన్స్ లో వుండే పాత్రలో కనిపిస్తాను. ఐదేళ్ళ టైం లిమిట్ లో జరుగుతుంది. ఎస్సై శిక్షణ వుండగా ఒక అమ్మాయిని ప్రేమించడం, తర్వాత పెళ్లి, ఒక కూతురు వుంటుంది. పెళ్లి తర్వాత బరువు పెరుగుతారని నా బరువు కూడా కాస్త పెంచాడు విజయ్( నవ్వుతూ) మొదట సిఐ, తర్వాత ఎస్ఐ, చివర్లో షార్ట్ హెయిర్ వున్న పాత్ర చేయడం జరిగింది.
ఉగ్రం ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. యాంగ్రీ మ్యాన్ పాత్రలో కూడా మిమ్మల్ని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని అర్ధమౌతుంది.. ఎలా అనిపిస్తుంది ?
ప్రేక్షకులు ఎక్కడా ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చేయలేదు. ఒక్క సారి యాక్షన్ లోకి మారినప్పుడు నాకూ ఓ చిన్న భయం వుండేది, కానీ ప్రేక్షకులు పాత్రకే కనెక్ట్ అయ్యారు. నిజాయితీని చూశారు. ఇందులో యాక్షన్ కూడా సహజంగానే చేయడం జరిగింది.
నాంది కి ఇప్పటికీ విజయ్ లో ఎలాంటి మార్పులు గమనించారు ?
విజయ్ చాలా కూల్ అండ్ సెటిల్ గా ఉంటాడు. తనకి తన పనిపై నమ్మకం ఎక్కువ. అలాగే తను టీం వర్క్ ని నమ్ముతాడు. కెమరా వుంది కదా ని ఇష్టం వచ్చిన షాట్ లు తీసి ఎడిటింగ్ రూమ్ లో చూసుకుందాంలే అనుకునే దర్శకుడు కాదు. తనకి ఏం కావాలో చాలా క్లారిటీ గా తెలుసు. తనకి కావాల్సింది మాత్రమే తీస్తాడు. ఉగ్రంలో తను అనుకున్నది డెలివర్ చేశాడు.
హీరోయిన్ మిర్నా ఎంపిక ఎవరి ఛాయిస్ ?
విజయ్ దే. ఇందులో చాలా కష్టమైన ఒక సన్నివేశం వుంది. అందులో కోపం, ఏడుపు, బాధ.. ఇలా అన్నీ కనిపించాలి. ఆ సీన్ ఆడిషన్ ని చాలా చక్కగా చేసింది. ఆ పాత్రకు ఆమె సరిపొతుందని ఎంపిక చేశాం. ఇందులో నా పాత్రతో పాటు ప్రయాణం చేసే పాత్రలో కనిపిస్తుంది మిర్నా.
ఇందులో పాప గా చేసిన ఊహకు చక్కగా చేసిందని విన్నాం ?
అవునండీ. నేను తనని బుల్లి సావిత్రి అని పిలుస్తాను(నవ్వుతూ). తను చాలా చక్కగా నటించింది.
ఇందులో ఎక్కువ యాక్షన్ సీన్స్ చేయడం ఎలా అనిపించింది ?
ఇది వరకూ యాక్షన్ సీన్స్ చేశాను. అవి కామెడీ గా వుంటాయి. నాకు రోప్ , ఫైట్లు కొత్త కాదు. అయితే ఇందులో ఎమోషన్ కొత్త. ఫైట్లు కోసం రిహార్సల్ చేయడం కలిసొచ్చింది. యాక్షన్ సీన్స్ అన్నీ డూప్ లేకుండా చేశాను.
ప్రేమ, పెళ్లి లాంటి ఎమోషన్స్ థ్రిల్లర్ లో సరిగ్గా మిక్స్ అవ్వవు కదా.. ఉగ్రం విషయంలో ఎలాంటి జాగ్రతలు తీసుకున్నారు ?
ఉగ్రం కథ ముందే చెప్పాం. ఇది మిస్సింగ్ పీపుల్ గురించి. మనకి సమస్య వస్తే పోలీస్ దగ్గరికి వెళ్తాం, అదే పోలీస్ కి సమస్య వస్తే ఏం చేస్తాడు? ఎలా ట్రీట్ చేస్తాడనేది ఇందులో వుంటుంది. ఉగ్రం సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్. కాన్సప్ట్ కమర్షియల్ గా వుంటుంది. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఉగ్రం సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్.
ఉగ్రం మీకు 60వ చిత్రం. ఈ ప్రయాణం ఎలా అనిపిస్తోంది ?
ఇది అద్భుతమైన ప్రయాణం. ఎత్తుపల్లాలు వున్నాయి. గెలుపు ఓటములని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో నేర్చుకున్నాను. 60 సినిమాలు చేయడం అంత సులభం కాదు. ప్రేక్షకుల ఆదరణ వలనే ఇది సాధ్యపడింది. ఈ ప్రయాణంలో బాపు గారు, విశ్వనాథ్ గారు, పెద్ద వంశీ , కృష్ణ వంశీ గారు లాంటి లెజెండరీ దర్శకులతో పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా.
కామెడీ సినిమాల తర్వాత ఉగ్రం లాంటి సినిమాలకు మారడం సేఫ్ జోన్ అనిపించిందా ? రిజల్ట్ లో ఎలాంటి తేడా వుంటుంది?
ఏదీ సేఫ్ జోన్ కాదండీ. అయితే ఒక తేడా వుంది. సుడిగాడు, బెండుఅప్పారావు , కితకితలు ఇవన్నీ పెద్ద హిట్లు. ఇవి చూసినప్పుడు నరేష్ సినిమా బావుంది అంటారు కానీ నరేష్ కామెడీ బాగా చేశాడని అనరు. కానీ గమ్యం, శంభో శివ శంభో, మహర్షి చిత్రాలు చూసినపుడు నరేష్ బాగా నటించాడని చెబుతారు. కామెడీ చేసేవాళ్ళు అంటే ఎక్కడో చిన్న చూపు. అది తెలియకుండా వుంది. ఈ విషయంలో నాకు ఎక్కడో చిన్న గిల్ట్ ఫీలింగ్ వుంది.
ఈవీవీ గారి వారసత్వాన్ని మీరు ఎలా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు ?
ఆయన్ని మించి చేయడం కష్టం. ఆయన పేరు కాపాడుకుంటే చాలు. పరిశ్రమలో వివాదాల జోలికి వెళ్లొద్దు, ఎవరి గురించి చెడుగా మాట్లాడొద్దని ఆయన చెప్పారు. నాన్న గారు చెప్పినట్లు నా పని తప్ప నాకు మరో ఆలోచన లేదు.
ఈవీవీ లో సినిమాలు చేసే ఆలోచన ఉందా ?
వుంది. ఆ బ్యానర్ లో నాన్న గారి మార్క్ సినిమాలు చేయాలి. అలాంటి కథలు కోసం ఎదురుచూస్తున్నాను. కథ దొరికితే నేనే నిర్మాణం చేస్తాను.
దర్శకత్వం చేసే ఆలోచన వుంది. కానీ ఇప్పుడు కాదు దానికి చాలా సమయం వుంది. నేను దర్శకత్వం చేస్తే మాత్రం అందులో నటించను.
కామెడీ, యాక్షన్.. ఇందులో ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తారు?
కామెడీ సరదా గా చేసేయొచ్చు. కానీ ఉగ్రం లాంటి పాత్ర చేస్తున్నపుడు మాత్రం అరుపులు కేకలు వుంటాయి. పైగా విజయ్ నరాలు కనిపించాలని చెబుతాడు(నవ్వుతూ). మెంటల్ గా ఫిజికల్ గా బాగా కష్టపడి చేసిన చిత్రం ఉగ్రం.
షైన్ స్క్రీన్ బ్యానర్ గురించి ?
సాహు, అర్చన భార్యభర్తలు. నేను పరిశ్రమలోకి రాకముందే నాకు తెలుసు. వాళ్ళ కాలేజ్ ప్రేమ కథ కూడా తెలుసు(నవ్వుతూ). మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. సుడిగాడు సమయంలో సాహు సినిమా చేద్దామని వచ్చాడు . అప్పుడు చాలా చిన్నోడు. తనకి సినిమా లాభ నష్టాలు గురించి చెప్పి వద్దు అన్నాను. తను ప్రయత్నం ఆపలేదు. ఈ రోజు సక్సెస్ ఫుల్ నిర్మాత కావడం ఆనందంగా వుంది. అలాగే హరీష్ కూడా చాలా మంచి వ్యక్తి. ఎక్కడా రాజీపడకుండా సినిమాని చేశారు. అలాగే ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు.
ఏదైనా సినిమాకి సీక్వెల్ చేయాలని ఉందా ?
సుడిగాడు పార్ట్ 2 తీయొచ్చు, అనిల్ రావిపుడి సుడిగాడు కి పని చేశారు. మొన్న కలసినపుడు పార్ట్ 2 చేద్దామా అన్నారు. నేను రూటు మార్చి ఇటు వస్తే మళ్ళీ అటు తీసుకెల్తారా అని సరదా గా మాట్లాడుకున్నాం. అలాగే నాన్న గారి చివరి రోజుల్లో అలీ బాబా అరడజను దొంగలకి సీక్వెల్ గా అలీ బాబా డజను దొంగలు చేద్దామని అనుకున్నాం.
స్పూఫ్ ల వైపు మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందా ?
లేదండి. ఒకరిని అనుకరించడం నటన కాదు. స్పూఫ్ లు చేసిన రోజుల్లో నన్ను నేను తిట్టుకున్న రోజులు ఉన్నాయి. ఇమిటేట్ చేస్తున్నాను కానీ నేను ఎక్కడ యాక్ట్ చేస్తున్నాననే బాధ వుండేది.
ఉగ్రం 2 ఉంటుందా ?
లేదండీ . కానీ నరేష్ విజయ్ #3 మాత్రం వుంటుంది. దానికి ఒక లుక్ కూడా అనుకున్నాం. వచ్చే ఏడాది అది జరగొచ్చు.
ఈ సినిమా తర్వాత ఒక కామెడీ సినిమా చేస్తున్నాను. కామెడీ వదలడం లేదు. నేను ఆడా వుంటా.. ఈడా వుంటా. (నవ్వుతూ )
కొత్త సినిమా కబుర్లు ?
నేను ఫారియా అబ్దులా కలసి ఒక సినిమా చేస్తున్నాం. సుబ్బు గారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే ‘జెండా’ అనే కథని కొనుక్కున్నాను. నేనే నిర్మాతగా చేస్తాను. ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు.
ఆల్ ది వెరీ బెస్ట్
థాంక్స్