Home » » Director Gautham Menon Interview about Muthu

Director Gautham Menon Interview about Muthu

 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'లో శింబు కనిపించడు... ముత్తు మాత్రమే కనిపించేలా నటించాడు 

దర్శకుడు గౌతమ్ మీనన్ ఇంటర్వ్యూ



అప్పుడు ఆ లవ్ స్టోరీ పక్కన పెట్టేసి... ముత్తు గ్యాంగ్‌స్ట‌ర్‌ సినిమా స్టార్ట్ చేశా

- దర్శకుడు గౌతమ్ మీనన్ ఇంటర్వ్యూ

   

శింబు కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన సినిమా 'వెందు తనిందదు కాడు'. ఇందులో సిద్దీ ఇధ్నానీ కథానాయిక. తెలుగు ప్రేక్షకుల ముందుకు 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'గా వస్తోంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. తెలుగులో ఈ నెల 17న (శనివారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళంలో 15న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ మీనన్‌తో ఇంటర్వ్యూ...


ప్రశ్న: 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'... సినిమా కథేంటి? మీరు, శింబు ఇంతకు ముందు చేసిన సినిమాలకు చాలా డిఫరెంట్‌గా టీజర్, ట్రైలర్ ఉన్నాయి!

గౌతమ్ మీనన్ : మేం ఇద్దరం ఇంతకు ముందు చేసినవి రొమాంటిక్ ఫిల్మ్స్. ఆ సినిమాలతో కంపేర్ చేస్తే... ఇది చాలా డిఫరెంట్ సినిమా. ఇదొక గ్యాంగ్‌స్ట‌ర్‌ ఫిల్మ్. ముత్తు ఒక చిన్న పల్లెలో జీవించే వ్యక్తి. కొన్ని కారణాల వల్ల అతడు ముంబై వెళతాడు. ముత్తుకు ఇష్టం ఉందా? లేదా? అతడు చీకటి ప్రపంచంలోకి ఎలా వచ్చాడు? ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా. ముత్తు జీవితంలో చీకటి కోణం ఉంది. అలాగే... లవ్, రొమాన్స్, యాక్షన్ కూడా ఉన్నాయి. ఆ ప్రపంచం నుంచి బయట పడటానికి అతడు ఏం చేశాడు? అనేది సినిమాలో చూడాలి. 


ప్రశ్న: ఈ సినిమా చేయడానికి మీకు స్ఫూర్తి ఏమిటి?

గౌతమ్ మీనన్ : శింబుతో ముందు లవ్ స్టోరీ చేయాలనుకున్నా. రెహమాన్ సార్ ఒక సాంగ్ కూడా కంపోజ్ చేశారు. నెల రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందనగా... తమిళంలో పేరున్న రచయిత జయమోహన్‌ను వేరే సినిమా కోసం కలిశా.  ఆయన 15  నిమిషాల షార్ట్ స్టోరీ చెప్పారు. నెక్స్ట్ ఏంటి? అని అడిగా. ఇంతవరకు రాశానని చెప్పారు. పది రోజుల్లో 100 పేజీల స్క్రిప్ట్ ఇచ్చారు. చదువుతుంటే విజువల్స్ నా కళ్ళ ముందు మెదిలాయి. అప్పుడు లవ్ స్టోరీ పక్కన పెట్టేసి ఈ గ్యాంగ్‌స్ట‌ర్‌ సినిమా చేయాలనుకున్నా.


ప్రశ్న: మీరు 55 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారని విన్నాం! ఎలా సాధ్యమైంది?

గౌతమ్ మీనన్ : శింబు, రాధికా శరత్ కుమార్, మలయాళ నటుడు సిద్ధిఖీ కాకుండా మిగతా నటీనటులు అందరూ కొత్తవాళ్ళు. థియేటర్ నేపథ్యం ఉన్నవాళ్ళను మేం సెలెక్ట్ చేశాం. ఆడిషన్స్ చేసి సెలెక్ట్ చేశాం. నేను చూపిస్తున్న ప్రపంచం ఒకటి ఉంటుందని ప్రేక్షకులు నమ్మాలి. అందుకు, కొత్తవాళ్లు అయితే బావుంటుందని అనుకున్నా. సీజనల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు చేయలేరని కాదు. నేను కొత్తవాళ్ళను ఎంపిక చేసుకున్నా. శింబు స్టార్ అయినప్పటికీ, ఆయనకు ఒక ఇమేజ్ ఉన్నప్పటికీ... 20 ఏళ్ళ కుర్రాడిగా కనిపించగలడు. గ్యాంగ్‌స్ట‌ర్‌గా మెప్పించగలడు. స్క్రీన్ మీద కనిపించేది శింబు కాదు, ముత్తు అని ఆడియన్స్ నమ్మాలి. నమ్మేలా అతడు చేయగలడని నాకు తెలుసు. అందుకని, మిగతావాళ్ళతో రిహార్సిల్స్ చేశాం. 

ప్రశ్న: శింబు కూడా రిహార్సిల్స్ చేశారు?

గౌతమ్ మీనన్ : కెమెరా ఆన్ అవ్వడానికి పది సెకన్ల ముందు శింబు క్యారెక్టర్‌లోకి ఈజీగా వెళ్ళిపోతాడు. శింబుతో చేస్తే ఫస్ట్ టేక్‌లో సీన్ ఓకే అవుతుంది. అరుదుగా రెండో టేక్‌కు వెళతాం. అది కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల. శింబు లాంటి యాక్టర్ ఉంటే సినిమా తీయడం ఈజీ. అతను గడ్డం పెంచడం కోసం, క్యారెక్టర్ పరంగా బాడీ  ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌ కోసం మూడు నాలుగు నెలలు వెయిట్ చేశాం. శింబు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో చూస్తారు.   


ప్రశ్న: 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'కు సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇది ముందుగా తీసుకున్న నిర్ణయమా? పబ్లిసిటీ కోసమా?

గౌతమ్ మీనన్ : పబ్లిసిటీ జిమ్మిక్ కాదు. జయమోహన్ గారు కథ చెప్పినప్పుడు ఒక్క సినిమాగా చేయలేమని అనుకున్నాను. ఆయనతో డిస్కస్ చేసినప్పుడు రెండు భాగాలుగా చేయాలనుకున్నా. అలాగని 'బాహుబలి', 'పొన్నియన్ సెల్వన్'తో కంపేర్ చేయడం లేదు. అవి పెద్ద సినిమాలు. గ్రాండియర్ విజువల్స్ ఉన్నాయి. ఈ కథ డిమాండ్ చేయడంతో రెండు భాగాలు చేస్తున్నాం. క్లైమాక్స్ షూటింగ్ చేసినప్పుడు 'మనం అది చేయలేమా?' అని ఒక సీన్ గురించి అడిగాడు. 'పార్ట్ 2లో చేద్దాం' అని చెప్పాను. సినిమా మొత్తం అయ్యాక మా హీరో, నిర్మాత చూసి 'పార్ట్ 2 ప్లానింగ్ స్టార్ట్ చెయ్' అని అడిగారు.  


ప్రశ్న: శింబుతో మీరు ఇంతకు చేసిన సినిమాలను తెలుగులో మరో హీరోతో తీశారు. ఇప్పుడు తమిళ సినిమాను తెలుగులో విడుదల కారణం?

గౌతమ్ మీనన్ : ఓటీటీ వచ్చిన తర్వాత ప్రపంచం, సినిమా పరిశ్రమ చిన్నవి అయిపోయాయి. ఇప్పుడు ప్రేక్షకులు ఇతర భాషల సినిమాలు చూస్తున్నారు. మేం ఎటువంటి సినిమా తీయాలనుకున్నామో... దానిని అన్ని భాషల ప్రేక్షకులకు చూపించాలనుకున్నాను. నిజాయతీగా చెప్పాలంటే... సినిమాకు భాష లేదు. ఈ సినిమాలో కూడా కొన్ని క్యారెక్టర్లు హిందీ మాట్లాడతాయి. ఆ డైలాగులు ప్రేక్షకులకు అర్థం కాకపోయినా అక్కడ భావం తెలుస్తుంది. రీచ్ అవుతుంది.


ప్రశ్న: రెహమాన్ సంగీతం గురించి...

గౌతమ్ మీనన్ : ముందు లవ్ స్టోరీ చేయాలనుకున్నాం కదా! దాని కోసం రెహమాన్ పాటలు చేశారని చెప్పాను కదా! ఆ సాంగ్ లిరిక్స్ చేంజ్ చేసి ఈ సినిమాకు యూజ్ చేస్తానని చెప్పాను. అందుకు రెహమాన్ ఒప్పుకోలేదు. ఆయన కొత్త సాంగ్స్ కంపోజ్ చేశారు. కొన్ని సన్నివేశాలు మ్యూజికల్ పొయెట్రీలా ఉంటుంది. 


ప్రశ్న: తెలుగులో 'స్రవంతి' రవికిశోర్ సినిమా విడుదల చేస్తున్నారు. ఆయన గురించి...

గౌతమ్ మీనన్ : కొంతమందితో చేయకపోయినప్పటికీ... వాళ్ళను అభిమానిస్తాం.  చిన్న చిన్న మీటింగ్స్ అయినప్పటికీ... కొంత మందిని  కలిసినప్పుడు హాయిగా అనిపిస్తుంది. 'స్రవంతి' రవికిశోర్ గారు అటువంటి వ్యక్తి. రామ్, నేను ఒక సినిమా కోసం కొన్ని రోజులు షూట్ చేశాం. కానీ, ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. తర్వాత నానితో చేశాం. అయినా సరే రామ్, నేను టచ్ లో ఉన్నామంటే కారణం రవికిశోర్ సార్. ఆయన మా ఇద్దరి మధ్య వారధిలా ఉన్నారు. ఇటీవల నేను, రామ్ మళ్ళీ కలిశాం. ఒక సినిమా గురించి డిస్కస్ చేశాం. రవికిశోర్ గారి నిర్మాణంలో ఉంటుంది. ఆయన 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' సినిమాను తెలుగులో విడుదల చేయడం సంతోషంగా ఉంది.


ప్రశ్న: రామ్, మీ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు ఉండొచ్చు?

గౌతమ్ మీనన్ : ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాలు అయిన వెంటనే ఉంటుంది. బహుశా నెక్స్ట్ ఇయర్ వేసవి తర్వాత ఉండొచ్చు. తెలుగు సినిమా కోసం మా మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయి. రవికిశోర్ గారి కోసం ఈ సినిమా చేస్తున్నాం. ఆయన ఈ సినిమా విడుదల చేస్తున్నారని చెప్పడం లేదు.


ప్రశ్న: 'రాఘవన్ 2' చేయాలనుందని కమల్ హాసన్ ఇటీవల పేర్కొన్నారు. మీరు ఏమంటారు?

గౌతమ్ మీనన్ : ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. తప్పకుండా 'రాఘవన్ 2' సినిమా ఉంటుంది. కమల్ హాసన్ గారితో చేస్తాను. ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది  ఇప్పుడే చెప్పడం కాస్త తొందరపాటు అవుతుంది. జయమోహన్ గారు స్క్రిప్ట్ రాస్తున్నారు. 


ప్రశ్న: 'ఏ మాయ చేసావె', 'ఘర్షణ' సినిమాలకు సీక్వెల్స్ ఉంటాయా?

గౌతమ్ మీనన్ : అక్కినేని నాగ చైతన్య అడిగితే తప్పకుండా 'ఏ మాయ చేసావె 2' చేస్తాను. 'ఘర్షణ 2' వెంకటేష్ గారి చేతుల్లో ఉంది. ఆయన అడిగితే చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.  


ప్రశ్న: చివరగా... విక్రమ్ 'ధ్రువ నక్షత్రం' విడుదల ఎప్పుడు?

గౌతమ్ మీనన్ : బహుశా ఈ ఏడాది ఆఖరున డిసెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అయితే... ఆ సినిమా వర్క్ ఇంకా కొంత బ్యాలన్స్ ఉంది. సో... చూడాలి. త్వరగా విడుదల చేయాలని మేం ఆశిస్తున్నాం.


Share this article :