'సర్కారు వారి పాట' పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్ టైనర్.. ఫ్యాన్స్ థియేటర్ లో డ్యాన్స్ వేయడం పక్కా: సర్కారు వారి పాట సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఇంటర్వ్యూ
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ స్వరకల్పనలో ఇప్పటికే విడుదలైన కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్ అన్నీ వర్గాల ఆడియన్స్ ఆకట్టుకొని టాప్ ట్రెండింగ్ వున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా 'సర్కారు వారి పాట' మ్యూజికల్ సెన్సేషన్ తమన్ మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న 'సర్కారు వారి పాట' విశేషాలు...
ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకి పని చేయడంలో లాభ నష్టాలు ఎలా వుంటాయి ?
భారీ అంచనాలు వుండటం ఒక ఇష్యూ. ఆ అంచనాలు అందుకోవడం కోసం ఏదైనా స్పెషల్ స్కూల్ వుంటే బావున్ననిపిస్తుంటుంది. మ్యూజిక్ చేయడమే కాకుండా దాన్ని చక్కగా ప్రమోట్ చేసి జనాల దగ్గరికి తీసుకెళ్ళడం కూడా ఒక భాద్యతగా మారింది. చెవులకి మాత్రమే కాదు మేము కూడా కనిపించాల్సిన తప్పనిసరి పరిస్థితిలోకి వచ్చేశాం. ఒకసారి చేశాం. ఇప్పుడది అలవాటు గా మారిపోయింది.
లిరికల్ వీడియోకి కూడా భారీగా ఖర్చు పెట్టడం మీతోనే మొదలైయింది కదా ?
ఆడియో కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. పాట బాలేకపోతే వారు పెట్టుబడి పెట్టరు. వాళ్లకి కూడా కొన్ని లెక్కలు, టీమ్ వుంటుంది. అందరూ అప్రూవ్ చేయనిదే అంతంత బడ్జెట్లు రావు. పెట్టుబడికి తగిన రాబడి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. 150 మిలియన్ వ్యూస్ సాధించడం అంత తేలిక విషయం కాదు. సినిమాలే కాదు పాటలు కూడా పాన్ ఇండియా అయిపోయాయి. ఒక పాట రీచ్ అవాలంటే.. అది గ్లోబల్ గా ఉందా ? ఎవరు పాడుతున్నారు ? ఇలా చాలా అంశాలు వుంటాయి. ఈ భాద్యతలన్నీ తీసుకోవాల్సివస్తుంది.
ఇది వరకూ పాట స్లోగా హిట్టు అయ్యే పరిస్థితి వుండేది. కానీ ఇప్పుడన్నీ ఇన్స్టెంట్ హిట్స్ వస్తున్నాయి కదా .. ?
ఇది వత్తిడితో కూడుకున్న వ్యవహారమే. మంచి మ్యూజిక్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే , అంచనాలు, వత్తిడి ని భరించగలడా ? అనేది కూడా చూస్తున్నారు. దర్శకుడు, హీరో, ఫ్యాన్స్ .. ఇలా అందరూ మ్యూజిక్ తప్పు ఒప్పులు చెబుతుంటారు. దీంతో పాటు మిగతా భాషల పాటలతో కూడా పోటీ వుంటుంది. అయితే ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీ వుంటే మంచిది. ఈ వత్తిడి కూడా ఓ మంచి పాటని ఇవ్వడానికి అడ్వాంటేజ్ గా వుంటుంది.
మల్టీ ప్రాజెక్ట్స్ చేస్తూ, అంచనాలు అందుకోవడం సాధ్యమా ?
చాలా కష్టం. దిని కోసం బ్రెయిన్ తో పాటు పరిగెత్తాలి.అయితే ఇప్పుడు మంచి విషయం ఏమిటంటే.. డిఫరెంట్ కథలతో సినిమాలు వస్తున్నాయి. దీంతో ఒకేలా కాకుండా డిఫరెంట్ గా అలోచించే అవకాశం వుంది. జోనర్స్ మారడం వలన మ్యూజిక్ కూడా డిఫరెంట్ జోనర్స్ లో వస్తుంది. సర్కారు వారి పాట విషయానికి వస్తే ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా. సినిమా మొత్తం స్పార్క్ తగ్గనే తగ్గదు. సినిమా అంతా షైనింగ్ కనిపిస్తూనే వుంటుంది. సర్కారు వారి పాట పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ .
ట్యూన్ బావుంటే ఆటోమేటిక్ కన్విన్స్ అవుతారా ? లేదా వేరే పద్దతి వుంటుందా ?
మేము ఎన్ని ట్యూన్స్ అయిన చేయడానికి రెడీగా వుంటాం. అయితే అది కథకు సరిపొతుందా లేదా ? అనేది ముఖ్యం. దర్శకుడు ఎంతో కాలం కష్టపడి ఒక కథని రెడీ చేసుకుంటాడు. కథని లిరికల్ గా చెప్పడానికి పాట కావాలి. ఇది చాలా పెద్ద భాద్యత. ఇప్పడు కథలో నుంచి వచ్చే పాటలే ఎక్కువ. సర్కారు వారి పాటలో కళావతి పాట ఇలా కథలో నుంచి వచ్చిందే. చాలా రోజుల తర్వాత ఒక మెలోడి పాటకు థియేటర్ స్టేజ్ ఎక్కి ఆడియన్స్ డ్యాన్స్ చేస్తారు. అంత అద్భుతంగా వుంటుంది కళావతి సాంగ్.
కళావతి పాట ఓకే అవ్వడానికి ఎన్ని వెర్షన్స్ చేశారు ?
ఒకటే వెర్షన్. 2020 లాక్ డౌన్ లో చేసిన పాటది. నేను, దర్శకుడు పరశురాం గారు, గీత రచయిత అనంత శ్రీరామ్ జూమ్ కాల్ మాట్లాడుతూ సినిమాలో హీరోయిన్ పేరుతో అనుకున్న ఫస్ట్ లైను. నాకు సామజవరగమనా , దర్శకుడు పరశురాం కి ఇంకేం ఇంకేం కావాలె లాంటి మేలోడిస్ వున్నాయి. ఖచ్చితంగా ఆడియన్స్ చాలా అంచనాలతో వుంటారు, అన్నిటికంటే ముఖ్యం మహేష్ బాబు గారు చాలా కాలం తర్వాత హీరోయిన్ పాత్రని ఉద్దేశించి పాడుతున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్..ఇది చాలా ప్యూర్ గా డిజైన్ చేయాలనీ ముందే అనుకున్నాం. అలా కళావతి పాటతో కంపోజింగ్ స్టార్ట్ చేశాం. అయితే పాట కంపోజ్ చేసి రెండేళ్ళు దాటిపోయింది. ఈ గ్యాప్ లో పాటకు రోజు ప్రాణం పోస్తూ చివరిగా రిలీజ్ చేశాం. మా కష్టం వృధా కాలేదు. ఫాస్టెస్ట్ గా 150మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసి కళావతి పాట అందరినీ అలరించింది.
ఒక ఆల్బం ఆరు పాటలు వుంటే మొదట ఏం పాట విడుదల చేయాలనే చర్చ ఉంటుందా ?
ఖచ్చితంగా వుంటుంది. మా సినిమానే కాకుండా ఆ సమయానికి బయట సినిమాల్లో ఎలాంటి పాటలు వస్తున్నాయనేది కూడా చూస్తాం. కళావతి పాట విడుదలకి ముందు డీజే టిల్లు, లాలా భీమ్లా నాయక్, బీస్ట్ పాటలు ట్రెండింగ్ లో వున్నాయి. ఈమూడు పాటలు కూడా లౌడ్ మాస్ సాంగ్స్. అలాంటి సమయంలో మెలోడి సాంగ్ అయితే బెస్ట్ అని భావించాం. కళావతి పాట రిలీజ్ చేశాం. అయితే లాక్ డౌన్లో చాలా ఆర్ధిక సమస్యలు ఉన్నపటికీ పాటని నమ్మి లిరికల్ వీడియోకి రూ. 30లక్షలు ఖర్చుపెట్టారు. నేను సిద్ శ్రీరామ్ చెన్నయ్ లో గ్రాండ్ గా త్రీడీ ఇమాజినేషన్ లో పియానో బ్యాక్ డ్రాప్ లో షూట్ చేశాం. ఈ విషయంలో నిర్మాతల గొప్పదనాన్ని అభినందించాలి. మా నిర్మాతలకి సినిమాపై బలమైన ప్యాషన్ వుంది. నిర్మాతలు రాజీపడకుండా ఖర్చు చేయడం వలనే ఈ రోజు పాట ఇంత హిట్ అయ్యింది. సినిమా నుండి రాబోతున్న మరో రెండు మాస్ సాంగ్స్ కూడా అద్భుతంగా వుంటాయి.
ఇలా ప్రతి పాటకి ఖర్చు చేస్తే మీ రేమ్యునిరేషన్ కంటే ఎక్కువ అవుతుందేమో ?
మరీ అంత వెరైటీ స్టెప్స్ తీసుకోము( నవ్వుతూ) ఏ పాటకి చేయాలి ఏ పాటకు చేయకూడదనే తెలుసు.
పాట ఫెబ్రవరిలో విడుదల చేశాం. సినిమా మే లో రిలీజ్. అంటే అప్పుడే హీరో హీరోయిన్ విజువల్స్ బయటికి ఇవ్వలేం కదా.. అలా చేస్తా మళ్ళీ ప్రమోషన్స్ కి కంటెంట్ వుండదు. అందుకే ఇలా స్పెషల్ షూట్ చేయాల్సి వచ్చింది. తర్వాత మహేష్ బాబు గారి డాటర్ సితార తో పెన్నీ సాంగ్ చేశాం. సితార రాక్ స్టార్. సితార వీడియోలు కొన్ని మహేష్ గారి చూపించి .. పెన్నీ సాంగ్ సితారతోనే చేస్తే బావుటుందని రిక్వెస్ట్ చేశా. తర్వాత నమ్రతగారిని కలసి చెప్పా. ఓకే చెప్పారు. మేము పొద్దునుంచి చేస్తే సితార మూడు గంటల్లో సాంగ్ షూటింగ్ ఫినిస్ చేసింది. ఫైనల్ కట్ చూసిన మహేష్ గారు చాలా హ్యాపీ గా ఫీలయ్యారు.
ఇన్స్ట్రుమెంట్స్, సింగర్స్ విషయంలో ఈ సినిమాకి ఎలాంటి కొత్తదాన్ని చూపించారు ?
సర్కారు వారి పాట మ్యూజిక్ కంప్లీట్ అర్బన్ గా వుంటుంది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా ఆలస్యం అవుతుందని ముందే తెలుసు. అయితే ఎప్పుడు వచ్చినా ఫ్రెష్ గా వుండే సౌండ్స్ వుండాలని ముందే ఫిక్స్ అయ్యా. శంకర్ గారి సినిమాలు ఇలా జరుగుతుంటాయి. ట్యూన్ ఎప్పుడు ఓకే అయినా రిలీజ్ అయ్యే వరకూ కొత్తగా ప్రోగ్రమ్ చేస్తూనే వుంటారు. సర్కారు వారి పాటలో మ్యూజిక్ ని ఎప్పటికప్పుడు కొత్తగా ప్రోగ్రామ్ చేస్తూనే వచ్చాం.
దర్శకుడు పరశురాం గారి మ్యూజిక్ టేస్ట్ ఎలా వుంటుంది ?
పరశురాం గారితో ఆంజనేయులు, శ్రీరస్తు శుభమస్తు చేశా. సర్కారువారి పాట మూడో సినిమా ఇది. ఆయనతో పని చేయడం అలవాటే. అయితే పరశురాం గారి గీత గోవిందం ఆడియో పరంగా కూడా పెద్ద హిట్. దాన్ని బ్యాలన్స్ చేయాలి. అన్నిటికంటే మహేష్ బాబు గారి సినిమా అంచనాలు అందుకోవడం పెద్ద ఛాలెంజ్. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ సినిమా కోసం రెండేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా సర్కారువారి పాట ఉండబోతుంది.
ఎంతో కష్టపడి చేసిన సాంగ్ లీక్ అవ్వడంతో ఎలా ఫీలయ్యారు ?
కోపం రాలేదు కానీ చాలా బాధ అనిపించింది. ఇప్పటికే కరోనాతో నిర్మాతలు కుదేలయ్యారు. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీ బాగు కోరుకోవాలి కానీ ఇలాంటి పనులు ఎలా చేస్తారో అర్ధం కాదు. లీకు ఎవరు చేశారో తెలిసింది. కానీ ఏం చేస్తాం.. మా నిర్మాతలు పెద్ద మనసున్న వ్యక్తులు. కెరీర్ నాశనం కాకూడదని వార్నింగ్ ఇచ్చి పంపించేశాం.
ఇప్పుడు అందరు స్టార్లు తమన్ మ్యూజిక్ కావాలని అంటున్నారు . ఇది మీకు గోల్డెన్ పిరియడ్ అనుకోవచ్చా?
గోల్డెన్ పిరియడ్ అని చెప్పను. వాళ్ళు నాపై పెట్టుకున్న తగ్గట్టు కష్టపడి పని చేయాలి. వాళ్ళ ట్రస్ట్ ని రస్ట్ చేయకపోతే చాలు.
మ్యూజిక్ కి కొత్తగా ఏదైనా చేయాలనీ ఉందా ?
ఇండిపెండెంట్ గా మ్యూజిక్ తేవాలి. ఫిల్మ్ మ్యూజిక్ ని ఇంటర్నేషన్ ల్ గా తీసుకెళ్ళాలి. తెలుగు సినిమా నేడు పాన్ వరల్డ్ గా వెళ్ళింది. మ్యూజిక్ విషయంఆలో బాధ్యత ఇంకా పెరిగింది.
అఖండ తర్వాత థమనే నేపధ్య సంగీతం చేయాలనే అభిప్రాయం వచ్చింది ? దీన్ని ఎలా చూస్తారు ?
ఈ క్రెడిట్ బాలయ్య, బోయపాటి గారికే దక్కుతుంది, సినిమాలో మ్యాజిక్ లేకపోతె ఎంత మ్యూజిక్ చేసిన నిలబడదు. అఖండలో ఆ పవర్ వుంది.
తమన్ అన్నీ వందకోట్ల సినిమాలే చేస్తాడని ప్రచారంలో వుంది ?
ఈ ప్రచారంలో నిజం లేదు. మ్యూజిక్ కి స్కోప్ వుండే అన్ని సినిమాలు చేయాలనీ వుంటుంది.
ఈ మధ్య కాలంలో మీరు విన్న యునిక్ వాయిస్ ?
సిద్ శ్రీరామ్. ఇది వరకూ నా దగ్గర చాలా హిట్స్ పాడారు. కళావతి పాటలో సిద్ శ్రీరామ్ మరింత యునిక్ గా అనిపించింది. గాడ్ ఫాదర్ లో ఒక బ్లైండ్ సింగర్ తో పాట పాడించాం. ఆ పాట కూడా అద్భుతంగా ఉండబోతుంది.
సర్కారు వారి పాటలో మీకు సవాల్ గా అనిపించిన పాట ?
టైటిల్ సాంగ్. టైటిల్ సాంగ్ చేయడం చాలా కష్టం. నాకు మహేష్ గారికి దూకుడు . ఆగడు , బిజినెస్ మ్యాన్ సినిమాలు వున్నాయి. సర్కారు వారి టైటిల్ సాంగ్ కి వచ్చేసరికి ఎక్కువ కష్టపడ్డాం. అయితే ఫైనల్ గా అద్భుతమైన పాట వచ్చింది.
కొత్తగా చేస్తున్న సినిమాలు ?
రామ్ చరణ్ శంకర్ గారి సినిమా ఒక పాట బ్యాలెన్స్ వుంది. చిరంజీవి గారి గాడ్ ఫాదర్ కూడా ఒకటే పాట బ్యాలెన్స్, విజయ్ తో చేస్తున్న సినిమాకి మూడు పాటలు, బాలకృష్ణ గారి సినిమా ఒక పాట రికార్డ్ చేశాం.
బాలీవుడ్ వెళ్తున్నారని విన్నాం ?
చర్చలు జరుగుతున్నాయి.
అల్ ది బెస్ట్
థ్యాంక్ యూ