శ్రీ కె.రాఘవేంద్ర రావు గారికి,
నమస్సులు
తెలుగు సినిమాకు కమర్షియల్ సొబగులు అద్దిన శతాధిక చిత్రాల దర్శకుడిగా సినీ చరిత్రలో మీకంటూ ప్రత్యేక స్థానం ఉంది. అగ్రశ్రేణి తారల నుంచి నవతరం నటుల వరకూ అన్ని తరాలవారితోనూ హావభావాలు పలికించి వెండి తెరపై మెరిసేలా చేసిన దర్శకేంద్రులు మీరు.
కెమెరా వెనక నుంచే ‘స్టార్ట్... కెమెరా... యాక్షన్...’ అనే మీరు ఇప్పుడు కెమెరా ముందుకు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ‘పెళ్లి సందడి’ చిత్రంతో దర్శకులు రాఘవేంద్ర రావు గారు నటులు రాఘవేంద్ర రావు గారు కావడం ఈ సినీ ప్రయాణంలో ఓ కొత్త మైలురాయి. దర్శకుడిగా నాలుగున్నర దశాబ్దాల అనుభవం మీ నటనలో కచ్చితంగా ప్రతిఫలిస్తుంది. మీ దర్శకత్వంలో సినిమాలు చేయాలని నటులు ఎలా ఉవ్విళ్లూరారో... ఇకపై తమ దర్శకత్వంలో మీరు నటించాలని దర్శకులు ఉత్సాహం చూపుతారు.
ఈ ప్రస్థానంలోనూ మీదైన ముద్రను వేయగలరు. కెప్టెన్ ఆఫ్ ద షిప్ గా ఘన విజయాలను సొంతం చేసుకున్న మీరు నటుడిగానూ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
విష్ యూ ఆల్ ద బెస్ట్