Home » » Ram Alladi Received Best Director Award

Ram Alladi Received Best Director Award

 


ఉత్తమ దర్శకుడిగా రామ్ అల్లాడికి 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్' అవార్డు

న్యూయార్క్ బేస్డ్ ఫిల్మ్‌మేకర్, ప్రవాసాంధ్రుడు రామ్ అల్లాడిని మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్'లో ''రా'స్ మెటనోయా"కి గాను ఉత్తమ దర్శకుడు విభాగంలో ఆయన విజేతగా నిలిచారు.


"చేసిల్డ్" డాక్యుమెంటరీతో దర్శకుడిగా మారిన రామ్ అల్లాడి, తొలి ప్రయత్నంలో ప్రేక్షకుల ప్రశంసలతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. దర్శకుడిగా ఆయన తీసిన రెండో చిత్రం "రా'స్ మెటనోయా". నవంబర్ 2020లో విడుదలైంది. జాతిపిత మహాత్మా గాంధీ జీవితంపై ప్రేమతో రామ్ అల్లాడి తీసిన ఈ చిత్రానికి ఇప్పటికే పన్నెండుకు పైగా అవార్డులు వచ్చాయి. యూరోపియన్, న్యూయార్క్ సినిమాటోగ్రఫీ అవార్డులు, లండన్స్ గోల్డ్ మూవీ అవార్డులు వాటిలో ఉన్నాయి. వెనిస్ షార్ట్స్, ది ఆమ్‌స్టర్‌డ్యామ్‌ వరల్డ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో "రా'స్ మెటనోయా" బెస్ట్ బయోగ్రఫికల్ ఫిల్మ్‌గా అవార్డులు అందుకుంది. న్యూయార్క్ నగరంలో ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ స్క్రీన్-ప్లే, కల్ట్ క్రిటిక్ మూవీ అవార్డ్స్‌లో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫిల్మ్ అవార్డులు... వర్జిన్ స్ప్రింగ్ సినీఫెస్ట్‌లో ఎడిటింగ్, స్క్రోర్ (నేపథ్య సంగీతం), ఫిల్మ్ విభాగాల్లో అవార్డులు వచ్చాయి. 'రీల్ హార్ట్  ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ స్క్రీన్ ప్లే' 17వ వార్షిక చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమా ఎంపికైంది. ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్  ఫెస్టివల్'లో రామ్ అల్లాడిని వరించింది. 


ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదా సాహెబ్ ఫాల్కే జయంతి సందర్భంగా ఏప్రిల్ 30న 'దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్' నిర్వహించారు. మన భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 110 దేశాలకు చెందిన ఫిల్మ్ మేకర్స్ తీసిన సినిమాలు అవార్డుల కోసం వివిధ విభాగాల్లో పోటీ పడ్డాయి. ఈ పోటీలో "రా'స్ మెటనోయా"కు గాను ఉత్తమ దర్శకుడిగా రామ్ అల్లాడికి అవార్డు లభించింది. ఈ అవార్డు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 


ప్రస్తుతం సంస్కృత సినిమా 'నభాంసి'కి రామ్ అల్లాడి దర్శకత్వం వహిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చిలో చిత్రీకరణ ప్రారంభించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సంస్కృత సినిమా తీస్తున్న తొలి దర్శకుడు ఆయనే కావడం గమనార్హం. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.


Share this article :