.jpg)
.jpg)

''తెలుగులో విఠలాచార్య చిత్రాలంటే ఇష్టం. అలాంటి కోవలోనే సోషియోఫాంటసీతో పౌరాణికాన్ని, గ్రాఫిక్స్‌ను మేళవించి చక్కటి చందమామకథలా దర్శకుడు శ్రీనివాసరెడ్డి 'డమరుకం' చిత్రాన్ని తెరకెక్కించాడు. అవతార్, మమ్మీ, 2012యుగాంతం లాంటి చిత్రాలంటే ఇష్టం. డమరుకం కథ విన్నాక అవన్నీ గుర్తుకువచ్చాయి'' అని అక్కినేని నాగార్జున అన్నారు. ఇటీవలే అమితాబ్ పుట్టినరోజు వేడుకలో పాల్గొని వచ్చానన్నారు. ఆయన పర్‌ఫెక్షన్ అంటే ఎంతో ఇష్టం. ఇప్పటికీ ఓ యాడ్‌చేయాలంటే మూడురోజులు రిహాల్సర్స్ చేశారు. అది చూసి నేనే ఆశ్చర్యపోయానని చెప్పారు. కె. అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్‌ఆర్‌మూవీమేకర్స్ పతాకంపై డా. వెంకట్ నిర్మించారు. త్వరలో విడుదలకానున్న ఈ చిత్రంగురించి గురువారంనాడు నాగార్జున పలు విషయాలను తెలియజేశారు.
వెయ్యేళ్ళనాటి కథ
చిత్ర కథాంశం గురించి వివరిస్తూ... వెయ్యేళ్ళ క్రిందట జన్మించిన అంథకాసురుడు అనే రాక్షసుడు మళ్ళీ ఇప్పటికాలంలో పుడితే... గ్రహగతులన్నీ అనుకూలిన ఓ శుభవేళ అద్భుత దివ్యనక్షత్రాన జన్మించే సౌందర్యరాశిని పెళ్ళాడితే.. సర్వలోకాల్ని ఏలేశక్తులు వస్తాయి. దానికి శివుడు అడ్డు వస్తాడు. ఈ క్రమంలో రాక్షసుడు ఏమిచేస్తాడు. కథానాయకుడు పయనం ఎటువైపు? ఇవన్నీ ఆసక్తికరంగా తెరకెక్కించారు. మన సంస్కృతికి చెందిన పౌరాణికాన్ని చూపిస్తున్నారు. మధ్యలో అఘోరాలు, కమెడియన్ల సందడి, గోదావరి యాసలో నేను పలికే డైలాగ్స్ చిత్రానికి రక్తికట్టిస్తాయి.
ఆయనతో మళ్ళీ సినిమా
శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించిన 'యమలోగ మళ్ళీ మొదలైంది' చూశాక అతనిపై నమ్మకం ఏర్పడింది. పరిమిత బడ్జెట్‌లోనే ఫాంటసీ, కామెడీ చూపించారు. అలాంటి అద్భుతం తీయాలంటే నిర్మాతకు ధైర్యముండాలి. వెంకట్ ధైర్యంతో ముందుకువచ్చి ఖర్చుకు వెనుకాడకుండా సినిమా తీశారు. మళ్ళీ ఆయనతో సినిమా తీయాలనుంది.
సుదీప్ బాగా చేశాడు
మిగతా సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. చిన్న రూమ్‌లో బ్లూమాట్‌లో భారీఫైట్‌ను తీసి.. ఎదురుగా మనిషి కనబడకుండా.. అతను ఉన్న ఫీలింగ్‌తో నటించాలి. 'ఈగ' చిత్రంలో ఈగ కన్పించకపోయినా సుదీప్ ఈగ వెంటే పరుగెడుతూ ఆయన పలికిన హావభావాలు, ఎమోషన్స్ హైలైట్. చాలా బాగా నటించాడు. డమరుకుంలో రాక్షసుడు ఎదురుగా లేకపోయినా.. ఆ మూడ్‌ను క్యారీచేస్తూ నటించాలి. దీనికితోడు గ్రాఫిక్స్ చిత్రానికి హైలైట్. 70 మంది 9నెలలపాటు రాత్రింబవళ్లు శ్రమించారు. ఆరంభంలో పంచగ్రహాల కలయిక అద్భుతంగా సృష్టించారు.
రవిశంకర్ బాగా నటించాడు
అంథకాసురుడి పాత్రను సాయికుమార్ సోదరుడు రవిశంకర్ అద్భుతంగా నటించాడు. కేవలం డబ్బింగ్‌లోనే కాదు. నటనలోనూ గొప్ప ప్రదర్శన ఇచ్చాడు. పాతాళభైరవి, మాయాబజార్‌లోని ఎస్వీ రంగారావును గుర్తుచేస్తాడు. ప్రకాష్‌రాజ్ మానవరూపంలో ఉండే శివుడుగా నటించాడు.
కొత్త చిత్రాలు
కామాక్షి కళామూవీస్ పతాకంపై దశరథ్ దర్శకత్వంలో నటిస్తున్నాను. ఇంకా టైటిల్ పెట్టలేదు. 'లవ్‌స్టోరీ' అనేది టైటిల్‌కాదు. తర్వాత అన్నపూర్ణ బేనర్‌లో వీరభద్రం చౌదరి దర్శకత్వంలో 'భాయ్' నవంబర్‌లో సెట్‌పైకి వెళుతుంది. బెల్లంకొండ సురేష్, దుర్గాఆర్ట్స్ పతాకంపై సినిమా చేస్తున్నా. నేను, నాన్నగారు, చైతన్యతో కలిసి నటించే చిత్రం మార్చిలో ఉంటుంది. దర్శకురాలు బి.జయతో సినిమా చేయడానికి సిద్ధమే. కథ ఇంకా వినాల్సిఉంది..
నంది ఇవ్వాల్సిందే
కంప్యూటర్ గ్రాఫిక్స్ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం ఇకపై నందిని కేటాయించాలి. ఆ స్థాయిలో గ్రాఫిక్స్ తెలుగు తెరపై వెలగడం గర్వంగా ఉంది. 'ఈగ' గ్రాఫిక్స్ అద్భుతం. 'మగధీర'ను మించి ఉన్నాయి. ఆ స్థాయిలో 'డమరుకం' ఉంటుంది. అలాగే ఛోటాకెనాయుడు కెమెరాపనితనం కూడా హైలైట్. అవార్డు రావాల్సిందే..
Post a Comment