మామూలుగా క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరణకి మన నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. అయితే, ప్రభాస్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రెబల్' సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చిత్రీకరణకి రెండు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారట. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ఈ రోజు మీడియాకు తెలియజేశారు. పదిహేను రోజుల పాటు హైదరాబాదు శివారులోని శంషాబాదులో ఈ షూటింగు చేశామని చెప్పారు. 25 లక్షలతో ఓ భారీ సెట్ వేసి, అందులో 20 అడుగుల కాళీమాత విగ్రహాన్ని ప్రతిష్టించి ఈ షూటింగు చేశామన్నారు. కృష్ణంరాజు, ప్రభాస్, దీక్షా సేథ్, ప్రభ, ముఖేష్ రుషి, సుప్రీత్ లతో బాటు 100 మంది ఫైటర్లు, 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పాల్గొన్నారని నిర్మాతలు తెలిపారు. టెక్నికల్ గా కూడా హై స్టాండర్డ్స్ తో వీటి చిత్రీకరణ చేశామన్నారు. ఈ నెల 16 నుంచి రామోజీ ఫిలిం సిటీలో తదుపరి షెడ్యులు మొదలవుతుందన్నారు. క్లైమాక్స్ దృశ్యాలను కూడా భారీ ఎత్తున చిత్రీకరిస్తామన్నారు. 40 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాతలు భగవాన్, పుల్లారావు తెలిపారు. | ||||
Post a Comment