Home » » Sri Satyasai Avataram Team wishes for Sai Divine Declaration Day

Sri Satyasai Avataram Team wishes for Sai Divine Declaration Day

 సత్యసాయి బాబా అవతరణ దినోత్సవం సందర్భంగా 'శ్రీ సత్య సాయి అవతారం సినిమా యూనిట్ శుభాకాంక్షలు



సత్యసాయి బాబా అవతరణ దినోత్సవం సందర్భంగా 'శ్రీ సత్య సాయి అవతారం సినిమా యూనిట్ శుభాకాంక్షలు తెలియచేసింది.

 సత్య, ధర్మ, శాంతి, అహింసలతో భక్తిని, సేవను అనుసంధానం చేసి... సమస్త మానవాళినీ తరింపచేయడానికి అవతరించిన సమకాలీన అవతారమే భగవాన్ సత్యసాయి. అందుకే ఆయన నడయాడిన ప్రాంతం అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ఇప్పుడు పుణ్యక్షేత్రమైంది.  సత్యసాయి బాబా... తన కరుణ, ప్రేమరసంతోనే... ఎంతోమంది భక్తుల శారీరక, మానసిక సమస్యలను రూపుమాపారు. బాబా బోధనలు అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉంటాయి. మానవులు అరిషడ్వర్గాలను జయించి ఉత్తములుగా ఉండాలని, పరిశుద్ధ హృదయంతో జీవించాలని తమ ఉపన్యాసాల్లో బోధిస్తుండేవారు. సత్యసాయి బాబా వారి బోధనలు సర్వ మత సమైక్యతను ప్రభోధిస్తాయి. సత్యసాయి సంస్థ సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలలో లెక్కకు మిక్కిలి  సత్యసాయి కేంద్రాలున్నాయి. సత్యసాయి బాబాను అనుసరించే వారి సంఖ్య కోట్ల సంఖ్యలోనే ఉంటుంది. సత్యసాయి సామాన్య కుటుంబంలో జన్మించి అందరిలానే విద్యార్థిగా జీవితాన్ని మొదలుపెట్టి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం సృష్టికర్తగా ఎదిగారు. బాబా అసలు పేరు సత్యనారాయణ రాజు. 1926 నవంబర్‌ 23న కార్తీక సోమవారం రోజు బాబా జన్మించారు. అనంతపురం జిల్లాలో నేటి పుట్టపర్తిగా పిలవబడుతున్న పట్టణంలో పెద వెంకట రాజు, ఈశ్వరమ్మ దంపతులకు నాలుగో సంతానం బాబా జన్మించారు. అక్టోబర్ 20, 1940న ఎప్పట్లానే ఆయన పాఠశాలకు బయలుదేరాడు, కానీ నిమిషాల్లో ఇంటికి తిరిగి వచ్చాడు. గుమ్మం మీద నిలబడి, పుస్తకాలు ఉన్న బ్యాగ్‌ని పక్కకు విసిరి, "నేను ఇకపై మీ సత్యని కాను. నేను సాయిని. ఇక నేను మీకు చెందను. నా పని నాకు ఉంది. నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. నేను వెళ్తున్నాను. నేను ఇక ఇక్కడ ఉండలేను." అంటూ తన అవతారాన్ని ప్రకటించారు. ఈ రోజు ఆయన అవతరణ దినోత్సవం సందర్భంగా 'శ్రీ సత్య సాయి అవతారం సినిమా యూనిట్ ఆయన భక్త కోటికి శుభాకాంక్షలు తెలియచేస్తోంది. స్వామి గురించి ఇప్పటి తరానికి, రాబోయే తరానికి కూడా తెలియ జేయాలనే మంచి సంకల్పంతో ‘శ్రీసత్యసాయి అవతారం’ పేరుతో సాయివేదిక్‌ ఫిలింస్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్‌ సారధి స్టూడియోలో ఈ సినిమా షూటింగ్‌ వైభవంగా ప్రారంభమయింది. దర్శకుడు సాయిప్రకాష్‌ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా ఆయన దర్శకత్వంలో వస్తున్న 100వ సినిమా. ఈ చిత్రాన్ని స్వామి భక్తులు ప్రముఖ డాక్టర్‌ దామోదర్‌ నిర్మిస్తున్నారు.


Share this article :