Vishwak Sen Hails "Love Oh Love" as a Beautiful Rom-Com

 


లవ్ ఓ లవ్ యూనివర్సల్ లాంగ్వేజ్‌లా అనిపించే ఓ అందమైన రొమాంటిక్ కామెడీ చిత్రం" – 'లవ్ ఓ లవ్' ప్రీ-రిలీజ్ వేడుకలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్


లవ్ ఓ లవ్ ప్రీ-రిలీజ్ వేడుక నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. చిత్ర బృందం, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, అభిమానుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుక ఎంతో సందడిగా సాగింది. పావిష్ నారాయణన్, నాగ దుర్గా జంటగా నటించిన ఈ చిత్రానికి మాగేశ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. రొమాన్స్, కామెడీ, భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చిత్ర బృందానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ నిర్మాతలు సి. కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, జి. నాగేశ్వర రెడ్డి గార్లు కూడా హాజరై చిత్ర బృందానికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. లవ్ ఓ లవ్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, చిత్ర యూనిట్‌కు తమ పూర్తి మద్దతు ప్రకటించారు.

అనంతరం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో...

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ, "ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పవిష్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావాలని నన్ను ఆహ్వానించాడు. నేను ప్రస్తుతం ఏ నగరానికి ఏమైంది 2 సినిమా షూటింగ్‌లో ఉన్నాను. ఈరోజు పవిష్ సినిమా ఈవెంట్‌కు వెళ్లాల్సి ఉందని తరుణ్ భాస్కర్‌కు చెప్పగా, ఆయన కూడా రెండు గంటల ముందే షూటింగ్ నుంచి వెళ్లమని ప్రోత్సహించారు. లవ్ ఓ లవ్ గురించి చెప్పాలంటే, ఇది భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే యూనివర్సల్ రొమాంటిక్ కామెడీ చిత్రంలా అనిపిస్తోంది. కథ, కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాలను ఆదరిస్తారు. అది తెలుగు సినిమా అయినా, తమిళ సినిమా అయినా ఎలాంటి తేడా చూపించరు. సూర్య, కార్తీ, ధనుష్, ప్రదీప్ రంగనాథన్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో మనందరికీ తెలుసు. అదే విధంగా పవిష్ కూడా ఆ జాబితాలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ ఓ లవ్ తెలుగు ప్రేక్షకుల ప్రేమను సొంతం చేసుకుని ఘన విజయాన్ని అందుకోవాలని చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు."

నిర్మాత జి. ధనంజేయన్ మాట్లాడుతూ , "విశ్వక్ సర్‌కు నేను పెద్ద అభిమానిని. మా ఆహ్వానాన్ని స్వీకరించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన విశ్వక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వేడుకకు విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా గురించి నేను మాట్లాడటం కంటే సుబ్బారావు గారు మాట్లాడితే బాగుంటుందని భావించాను. ఆయన ఈ సినిమాపై ఎంతో గౌరవంతో వ్యవహరిస్తూ, తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తానని ముందుకు రావడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. నాగ దుర్గా ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన నటి. అలాగే ధనుష్ గారి మేనల్లుడు పావిష్ తన గత చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమై మంచి ఆదరణ పొందాడు. ఈ సందర్భంగా సుబ్బారావు గారికి మరోసారి నా ప్రత్యేక ధన్యవాదాలు. నేడు తమిళ వెర్షన్‌కు సెన్సార్ ప్రక్రియ పూర్తయింది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది" అని అన్నారు.

దర్శకుడు మాగేశ్ రాజేంద్రన్ మాట్లాడుతూ, "ఈ అవకాశం ఇచ్చిన దినేష్ సర్, ధనంజేయన్ సర్‌లకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నాపై నమ్మకం ఉంచి ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం కల్పించిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. జూలై 10న లవ్ ఓ లవ్ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆదరించండి. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు మా చిత్రానికి ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు."

నిర్మాత దినేష్ రాజ్ మాట్లాడుతూ, "ధనంజేయన్ గారితో కలిసి చేస్తున్న నా తొలి చిత్రం లవ్ ఓ లవ్. మా ఈ భాగస్వామ్యంలో మరో ఆరు చిత్రాలను కూడా నిర్మించబోతున్నాం. ఈ ప్రయాణం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. దర్శకుడు మాగేశ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన ఎంతో ప్రతిభావంతమైన దర్శకుడు. సినిమాపై అద్భుతమైన అవగాహన, స్పష్టమైన విజన్ ఆయన సొంతం. ముఖ్యంగా యువతకు దగ్గరయ్యేలా, వారితో అనుబంధం కలిగించే అంశాలతో కథను రూపొందించారు. మంచి సందేశాన్ని అందించే చిత్రాన్ని తెరకెక్కించగలిగామని మేము గర్వంగా భావిస్తున్నాం.

హీరో పవిష్ చాలా అంకితభావం కలిగిన నటుడు. ఈ సినిమా కోసం ఆయన పూర్తిస్థాయిలో కష్టపడి తన వంతు సహకారాన్ని అందించారు. అలాగే హీరోయిన్ నాగ దుర్గా తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే సుపరిచితురాలు. ఆమెను తమిళ ప్రేక్షకులకు పరిచయం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసి మాకు మద్దతు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు."

హీరో పవిష్ నారాయణన్ మాట్లాడుతూ, "ఈరోజు మా కార్యక్రమానికి విచ్చేసిన విశ్వక్ సర్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒక ఫోన్ కాల్ చేయగానే కేవలం ఐదు నిమిషాల్లోనే స్పందించి ఈ కార్యక్రమానికి వస్తానని చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. విశ్వక్ సర్ నటిస్తున్న ప్రతి సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, సినీ ప్రముఖులకు, అభిమానులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా తెలుగు అంత బాగా రాకపోయినా మీతో తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. నేను ఎప్పుడైనా వేదికపై మాట్లాడినప్పుడు ముందుగా ధనుష్ సర్‌కు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను.

అలాగే ధనంజేయన్ సర్, దినేష్ రాజ్ సర్‌లకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మొదటి సినిమా ఎంత ముఖ్యమో, రెండో సినిమా కూడా అంతే ముఖ్యమని భావించి నాకు ఈ అవకాశం ఇచ్చారు. దర్శకుడు మాగేశ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నా తొలి సినిమాలో ఏమి చూసి నన్ను ఈ పాత్రకు ఎంపిక చేశారో నాకు తెలియదు కానీ, ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా వంతు ప్రయత్నం చేశాను. ఈ సినిమా ద్వారా నటుడిగా ఎంతో నేర్చుకున్నాను. మొదట ఈ సినిమాలో నా సరసన కొత్త హీరోయిన్ నటిస్తుందని చెప్పారు. కానీ నాగ దుర్గ గారి గురించి తెలుసుకున్న తర్వాత, తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకు ఎంతటి గుర్తింపు ఉందో చూసి ఆశ్చర్యపోయాను. ఈరోజు జరిగిన ఇంటర్వ్యూలన్నింటిలోనూ నాగ దుర్గ గారే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ చిత్రంలో నాతో కలిసి నటించిన సీనియర్ నటీనటులు వనిత విజయకుమార్ మేడమ్, కె.ఎస్. రవికుమార్ సర్, సెల్వా సర్‌లతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.జూలై 10న లవ్ ఓ లవ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తప్పకుండా థియేటర్లకు వచ్చి మా సినిమాను చూసి ఆశీర్వదించండి. మీ ప్రేమాభిమానాలే మా బలం. అందరికీ ధన్యవాదాలు."

హీరోయిన్ నాగ దుర్గా మాట్లాడుతూ, "ఈ సినిమాలో అవకాశం రావడం నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన విషయం. ఒక తెలుగు అమ్మాయిగా తమిళ చిత్రంతో పరిచయం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నటిగా నన్ను ఎంపిక చేసిన దర్శకుడు మాగేశ్ రాజేంద్రన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశాన్ని ఇచ్చిన ధనంజేయన్ సర్, దినేష్ రాజ్ సర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తన బిజీ షెడ్యూల్‌లో కూడా సమయం కేటాయించి మా ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వక్ సేన్ సర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన మాకు అందించిన ప్రోత్సాహం ఎంతో విలువైనది. లవ్ ఓ లవ్ సినిమాను తప్పకుండా థియేటర్లలోనే చూడాల్సిన చిత్రం. జూలై 10న విడుదల కానున్న మా సినిమాను అందరూ థియేటర్లకు వచ్చి చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు."

నటి వనిత విజయకుమార్ మాట్లాడుతూ, "మరోసారి హైదరాబాద్‌కు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి సందర్భంలోనూ నాకు అండగా నిలుస్తూ ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

లవ్ ఓ లవ్ చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 10న విడుదల కానున్న మా చిత్రాన్ని తప్పకుండా థియేటర్లలో చూసి ఆదరించండి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల చేస్తున్న తెలుగు నిర్మాతలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను."

నటీనటులు: పవిష్ నారాయణన్, నాగ దుర్గా, సెల్వరాఘవన్, కె.ఎస్. రవికుమార్, వనిత విజయకుమార్, రమ్య, అశ్వత్, సౌందర్య, ఆదిత్య కతిర్ తదితరులు.

సాంకేతిక బృందం:

కథ, దర్శకత్వం: మాగేశ్ రాజేంద్రన్

నిర్మాణ సంస్థలు: జినెమా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్, క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్

నిర్మాతలు: దినేష్ రాజ్, జి. ధనంజేయన్

తెలుగు విడుదల: శ్రీ వైష్ణవి పిక్చర్స్

సమర్పణ: మహేందర్ రావు వంగపల్లి

తెలుగు సంభాషణలు, పాటల సాహిత్యం: భాష్యశ్రీ

సంగీతం: FOXn

ఛాయాగ్రహణం: పి.జి. ముత్తయ్య

ఎడిటింగ్: ఎన్.బి. శ్రీకాంత్

పీఆర్‌ఓ: దినేష్ కె.

Post a Comment

Previous Post Next Post