విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైన 'నేషనల్ సీనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్'
- 350 మంది మేటి క్రీడాకారుల భాగస్వామ్యం
- క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్, రూ. 4 కోట్ల నగదు ప్రోత్సాహకాలు: శాప్ చైర్మన్ రవి నాయుడు
సిరిపురం, జనవరి 27
నగరంలోని ఆఫీసర్స్ క్లబ్ వేదికగా 19వ ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ అసోసియేషన్, అద్వర్యంలో ఆల్ ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఛాంపియన్షిప్ పోటీలు మంగళవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవి నాయుడు ఈ పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి సుమారు 350 మంది సీనియర్ క్రీడాకారులు పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ, విశాఖపట్నంలో జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలు జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. "టెన్నిస్ అనేది శారీరక దృఢత్వంతో పాటు అపారమైన ఏకాగ్రత అవసరమైన క్రీడ. సాధారణంగా ఆటగాళ్లు 4 నుండి 5 గంటల పాటు నిరంతరాయంగా కోర్టులో శ్రమించాల్సి ఉంటుంది. క్రీడాకారులు కేవలం పోటీల కోసమే కాకుండా, జీవితాంతం ఆరోగ్యంగా ఉండటానికి నిత్యం క్రీడల్లో పాలుపంచుకోవాలి" అని ఆయన పిలుపునిచ్చారు. రవి నాయుడు గారు శాప్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో క్రీడల కళ మళ్ళీ కనిపిస్తోందని, రాబోయే మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను క్రీడల హబ్‌గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.
శాప్ చైర్మన్ రవి నాయుడు తన ప్రసంగంలో కూటమి ప్రభుత్వం క్రీడా రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. క్రీడాకారుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం సమాంతర రిజర్వేషన్‌ను కచ్చితంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. వివిధ క్రీడల్లో రాణిస్తున్న ప్రతిభావంతులైన క్రీడాకారులకు సుమారు 4 కోట్ల రూపాయల మేర నగదు ప్రోత్సాహకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం భీమిలిలో క్రీడల అభివృద్ధి కోసం కేటాయించిన భూములను గత ప్రభుత్వం హెలిప్యాడ్ కోసం దారి మళ్ళించటం దురదృష్టకరమని, ప్రస్తుత ప్రభుత్వం ఆ స్థలాన్ని తిరిగి క్రీడాకారులకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ఎన్. సాంబశివరావు, ఈ పోటిల డైరెక్టర్ కే. సతీష్, ఆఫీసర్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సంతారం, సీఎమ్మార్ గ్రూప్ అధినేత మావూరి వెంకట రమణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ డీఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. 35 నుండి 75 ఏళ్ల వయస్సు గల సీనియర్ క్రీడాకారుల కోసం సింగిల్స్ మరియు డబుల్స్ విభాగాల్లో జనవరి 30 వరకు ఈ పోటీలు కొనసాగనున్నాయి. టోర్నమెంట్ విజేతలకు రూ. 4 లక్షల ప్రైజ్ మనీతో పాటు ర్యాంకింగ్ పాయింట్లు లభించనున్నాయి.


Post a Comment