Home » » Telugu Television Producer Association Announced Donation to Telugu States Flood Victims

Telugu Television Producer Association Announced Donation to Telugu States Flood Victims

 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరద బాధతుల సహాయార్థం తమ వంతు ఆర్థిక సహాయం ప్రకటించిన తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్




భారీ వర్షాలు, వరదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టంతో బాధపడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారికి అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సభ్యులు. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు తమ వంతు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో పాత్రికేయ సమావేశం ఏర్పాటుచేశారు.  ఈ కార్యక్రమంలో తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.


నటుడు, నిర్మాత ప్రభాకర్  మాట్లాడుతూ - తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వరదల కారణంగా సర్వస్వం కోల్పోయారు. ఈ వరదలకు సంబంధించిన వార్తలు చూస్తున్నప్పుడు చాలా బాధగా అనిపించింది. వరద బాధితులను ఆదుకునేందుకు మన నాయకులు ఎంతో కష్టపడుతున్నారు. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా వంతు సహాయం చేయాలని అనుకున్నాం.  మా తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు గారితో మాట్లాడి సీరియల్స్ నిర్మించే ప్రతి ప్రొడ్యూసర్ తమకు చేతనైనంత విరాళం ఇవ్వాలని కోరాం. అందరూ సహృదయంతో స్పందించారు. తమకు వీలైనంత సాయం చేశారు. మేము గతంలో కరోనా టైమ్ లో కూడా సహాయ కార్యక్రమాలు చేశాం. ఇకపైనా సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ముందుకొస్తాం. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నాం. అన్నారు.


శ్రీరామ్ మాట్లాడుతూ - వరదలతో మన తెలుగు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వారిని ఆదుకునేందుకు ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు మనం ఆ ప్రయత్నం పెద్ద ఎత్తున చేయగలమా అనే సందేహం కలిగింది. అయితే సహాయం అనేది ఎంత చిన్నదైనా సహాయమే అనిపించింది. ఒక్క కుటుంబాన్ని ఆదుకున్నా ఆదుకున్నట్లే అని మా ప్రెసిడెంట్ ప్రసాద్ రావు గారు అన్నారు. అలా ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కు మెసేజెస్ పంపాం. అందరూ రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు సీరియల్స్ ప్రొడ్యూస్ చేయని నిర్మాతలు కూడా తమ వంతు ఆర్థిక సహాయం ఇచ్చేందుకు ముందుకొచ్చారు.


తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సెక్రటరీ వినోద్ బాల మాట్లాడుతూ - తెలుగు ప్రజలు వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి టైమ్ లో మన అసోసియేషన్ ను ఎలాంటి సాయం చేయాలనే డిస్కషన్ వచ్చినప్పుడు మనం చేసేది సరిపోతుందా అనే సందేహాన్ని కొందరు వెలిబుచ్చారు. అయితే చినుకు చినుకు కలిస్తేనే ప్రవాహం అన్నట్లు మనం ఇచ్చే రూపాయి కూడా ఎవరో ఒకరికి చేరుతుందనే నిర్ణయం తీసుకున్నాం. అసోసియేషన్ లోని సభ్యులంతా స్పందించి ముందుకొచ్చారు. తమ వంతు విరాళం అందించినందుకు సంతోషంగా ఉంది. ఎలాంటి ప్రకృతి విపత్తులు ఎదురైనా మా వంతు అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నాం. మరికొంతమందికి సహాయం చేసేందుకు స్ఫూర్తిగా ఉంటుందనే ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించాం. అన్నారు.


తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు మాట్లాడుతూ - వరదల కారణంగా తెలుగు ప్రజలు కట్టుబట్టలతో ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. వారిని చూస్తే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ స్పందిస్తారు. మా అసోసియేషన్ తరపున మేము కూడా మాకు వీలైనంత ఆర్థిక సాయం చేయాలని భావించాం. 260 మంది ప్రొడ్యూసర్స్ లో 60 మందే ఇప్పుడు యాక్టివ్ గా సీరియల్స్ చేస్తున్నారు. అయినా 5 వేల నుంచి 25 వేల వరకు మీకు తోచినంత విరాళం ఇవ్వాలని మా సభ్యులను కోరాం. వాళ్లంతా స్పందించారు. తోచినంత విరాళం ఇచ్చారు. ఈ డబ్బుకు మరికొంత మా అసోసియేషన్ ఫండ్ నుంచి యాడ్ చేసి 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఎంత కలెక్ట్ అయితే అంత డబ్బు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు డొనేట్ చేస్తాం. ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ తీసుకుని ఆ చెక్ అందిస్తాం. 15 వేల మంది కార్మికులు టీవీ రంగంలో జీవనోపాధి పొందుతున్నారు. వారికి కరోనా టైమ్ లో రెండేళ్లు మా ప్రొడ్యూసర్స్ అంతా కలిసి అండగా నిలబడ్డాం. ఈ వరదల్లో కొందరు రాజకీయ నాయకులు బురద రాజకీయం చేస్తున్నారు. అలాంటివి మానుకోవాలని కోరుతున్నాం. అన్నారు.


Share this article :