‘అనిమల్’ సినిమా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ - దిల్ రాజు
రణ్‌భీర్ కపూర్, రష్మిక హీరో హీరోయిన్లుగా సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనిమల్’. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబడుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.
‘‘2023 మాకెంతో కలిసొచ్చింది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించటం ఎంతో హ్యాపీగా ఉంది. ఈ ఏడాది ఇంకా హాయ్ నాన్నను కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. ‘అనిమల్’ సినిమా విషయానికి వస్తే సినిమా బాగా కనెక్ట్ కావటంతో తొలి రోజున మూవీ రికార్డ్ కలెక్షన్స్‌ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ తొలి రోజు పదిహేను కోట్ల మేరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈరోజు, రేపు కూడా ఫ్లో ఎక్కువగా ఉంటుంది. దీంతో ఫస్ట్ వీకెండ్‌లో ముప్పై ఐదు నుంచి యాబై కోట్ల రూపాయల వరకు గ్రాస్ మార్క్‌ను ‘అనిమల్’ సినిమా అందుకుంటుందని అంచనా వేస్తున్నాం. ఈ సక్సెస్‌ను టీమ్ ఎంతో ఎంజాయ్ చేస్తుంది. సినిమా గ్లోబల్ అయ్యిందనటానికి ఇదొక ఎగ్జాంపుల్. మన హీరోలైన ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో మంచి విజయాలను సాధించాయి. ఇప్పుడు అక్కడి హీరోలు సినిమాలను కూడా మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యేలా సినిమాలు చేస్తే సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనటానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు సినిమాలను చూడటానికి ఏమాత్రం ఆలోచించరని ప్రూవ్ అయ్యింది. ఇది సందీప్ వంగా మేకింగ్ స్టైల్. అనిమల్ తరహా చిత్రాలను నేను కూడా నిర్మిస్తాను. అయితే నేను సినిమాలు చేస్తే బొమ్మరిల్లు స్టైల్లో ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు కాబట్టి. నేను అనిమల్ వంటి సినిమాలు చేయాలంటే ముందుగానే డైరెక్టర్ ఇలాగే తీస్తాడని స్టేట్‌మెంట్ ఇచ్చి మరీ నిర్మిస్తాను.
ఇక వచ్చే ఏడాది మా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నాలుగు సినిమాలు చేస్తున్నాం. అలాగే దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మూడు సినిమాలు చేస్తున్నాం. మొత్తంగా ఏడు సినిమాలను సరైన సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి ప్లాన్ చేసుకుంటున్నాం. గేమ్ చేంజర్ సినిమా ఇప్పటికే ఎనబై శాతానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రాజమౌళి, శంకర్, సుకుమార్, సందీప్ వంగా వంటి వారిని టైమ్ అడగకూడదు. శంకర్‌గారు ఆయన ప్లానింగ్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. సినిమా చిత్రీకరణ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. అంతా పూర్తయిన తర్వాత ఆయన పోస్ట్ ప్రొడక్షన్ సమయం చెప్పే దాన్ని బట్టి రిలీజ్ డేట్ చెబుదాం’’ అన్నారు.
దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో చేయబోయే మూడు సినిమాలకు ముగ్గరు యంగ్ డైరెక్టర్స్ పరిచయం కాబోతున్నారు. అందులో ఆకాశం దాటి వస్తావా ఓ మూవీ, మరో సినిమాను సుహాస్‌తో చేయబోతున్నాం. మరో సినిమాను ఆశిష్‌తో నిర్మిస్తాం’’ అన్నారు.