Home » » Legendary Actor Chandra Mohan Lives on

Legendary Actor Chandra Mohan Lives on

 చంద్రమోహన్ ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉంటారు - సంస్మరణ సభలో ప్రముఖులు



  

దివికెగసిన దిగ్గజ కథానాయకుడు, ప్రేక్షకుల హృదయాల్లో ముద్ర వేసుకున్న నటుడు చంద్రమోహన్ సంస్మరణ సభ ఈ రోజు హైదరాబాద్ ఎఫ్ఎన్‌సిసిలో నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు. 13వ తేదీన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చంద్రమోహన్ సంస్మరణ సభకు పలువురు సినిమా, మీడియా ప్రముఖులు హాజరై... ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 


నిర్మాత, కృష్ణ సోదరులు ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ ''ప్రజలు అందరికీ చంద్ర మోహన్ ఎంత గొప్ప నటులో తెలుసు. వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'' అని అన్నారు. 


దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ''కృష్ణ గారు, చంద్రమోహన్ గారు, ఎన్టీఆర్ గారు 24 గంటలు పని చేసిన రోజులు ఉన్నాయి. వాళ్ళకు సినిమాయే ఫ్యామిలీ. అందరూ మనవాళ్ళు అని కలిసిపోయే మనిషి చంద్రమోహన్'' అని అన్నారు.     


చంద్రమోహన్ పెద్ద కుమార్తె మధుర మాట్లాడుతూ ''నాన్నగారు ఎప్పుడూ చెప్పిన విషయం హార్డ్ వర్క్ మన బలం అని! 'ప్రపంచం ఏమన్నా, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా... నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరూ నిన్ను ఆపలేరు' అని చెప్పేవారు. నా జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్ హీరో నాన్నగారు. ఎప్పుడూ మాతో ఉంటారు. నాకు స్ఫూర్తిగా ఉంటారు. నా దృష్టిలో ఆయన ఎప్పుడూ లివింగ్ లెజెండ్. అందరి హృదయాల్లో ఆయన ఉంటారు'' అని అన్నారు. 


చంద్రమోహన్ రెండో కుమార్తె మాధవి మాట్లాడుతూ ''నాన్న కర్మయోగి. ఆయన నిర్మాతల ఆరిస్ట్. ఆయనను మనసులో తలుచుకున్న వ్యక్తులు అందరూ మాతో ఉన్నట్లు మేం భావిస్తాం. మాకు ఎంతో మంది ఫోనులు చేశారు. ఆయన ప్రిన్సిపల్స్ ఫాలో కావడం ముఖ్యం. జీవితంలో ఎలా బతకాలో చాలా నేర్పించారు. ఇక్కడికి వచ్చిన సినిమా కుటుంబ సభ్యులు అందరికీ థాంక్స్'' అని అన్నారు. 


చంద్రమోహన్ మేనల్లుడు, ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ''ఇక్కడికి వచ్చిన అతిథులు అందరికీ మా మావయ్య చంద్రమోహన్ గారు, మా కుటుంబ సభ్యుల తరఫున థాంక్స్. మా అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నా'' అని అన్నారు.   


ఎస్పీ చరణ్ మాట్లాడుతూ ''నాకు ఊహ తెలిసిన తర్వాత తెలిసిన యాక్టర్ అంటే అది చంద్రమోహన్ అంకుల్. ఆయన ఎంత గొప్ప స్టార్ అనేది ఊహ వచ్చే వరకు తెలియలేదు. ఆయన నాకు పెదనాన్న కావడం గర్వకారణం. నాన్నగారు, కె. విశ్వనాథ్ గారు, చంద్రమోహన్ అంకుల్ మన మధ్య లేరనేది బాధాకరం'' అని అన్నారు. 


ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ''నేను, శోభన్ బాబు గారు తరచూ కలుస్తూ ఉండేవాళ్ళం. శోభన్ బాబు గారికి చిత్రసీమలో తక్కువ మంది స్నేహితులు ఉన్నారు. వారిలో చంద్రమోహన్ ఒకరు. ఆయన సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆయనతో విశ్వనాథ్, బాపు గారు అద్భుతమైన సినిమాలు చేశారు. సూపర్ స్టార్ హీరోలకు ఎన్ని హిట్స్ ఉన్నాయో ఆయనకు కూడా అన్ని హిట్స్ ఉన్నాయి. ప్రేక్షకుల హృదయాల్లో ఆయన స్టార్ డమ్ ఎప్పటికీ ఉంటుంది'' అని అన్నారు.  


చంద్రమోహన్ మనవరాలు చిన్మయి మాట్లాడుతూ ''మేం మద్రాసులో ఉండేవాళ్ళం. నాకు ఆరేడేళ్ళు వచ్చేవరకు ఆయన అంత పెద్ద యాక్టర్ అని నాకు తెలియదు. స్కూల్ కి వచ్చి నన్ను పికప్ చేసుకునేవారు. సరదాగా ఆటలు ఆడేవారు. ఇండిపెండెంట్ గా ఉండాలని ఎప్పుడూ చెప్పేవారు. తాతయ్య గారు నేర్పించిన విలువలు ఎప్పుడూ మాతో ఉంటాయి. ఆయన మమ్మల్ని వదిలి వెళ్లారని అనుకోవడం లేదు. మాతో ఉంటారు'' అని భావోద్వేగానికి లోనయ్యారు. 


చంద్రమోహన్ మనవరాలు శ్రీకర మాట్లాడుతూ ''తాతయ్య గారితో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నన్ను, అక్కను ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పేవారు. మాతో పాటు గేమ్స్ ఆడేవారు'' అని అన్నారు. 


చంద్రమోహన్ సంస్మరణ సభలో దర్శకులు రేలంగి నరసింహారావు, మాధవపెద్ది సురేష్, నిర్మాత ప్రసన్నకుమార్, నటులు & మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, కొమ్మినేని వెంకటేశ్వరరావు, ఆచంట గోపీనాథ్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజ సూర్యనారాయణ, నవత అచ్చిబాబు, దర్శకులు ఇంద్రగంటి మోహన కృష్ణ, సతీష్ వేగేశ్న, హరీష్ , పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు, గౌతంరాజు, రమ్యశ్రీ, వంశీ రామరాజు, జ్యోతి వలబోజు, ఆకెళ్ళ రాఘవేంద్ర, జర్నలిస్టులు ప్రభు, నాగేంద్రకుమార్, రెంటాల జయదేవ, ఇందిర పరిమి తదితరులతోపాటు పలువురు చంద్రమోహన్ కుటుంబ సభ్యులు, సినిమా పరిశ్రమలో చంద్రమోహన్ ఆప్తులు, పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Share this article :