Prestigious Award to Music Director Koti

 చరిత్ర సృష్టించబోతున్న తెలుగు సంగీత దర్శకుడు కోటి  



తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సంగీత దర్శకుడికి పర దేశ (ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్) పార్లమెంట్ లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం లభించబోతోంది. అది మరెవరికో కాదు,  మూడున్నర దశాబ్దాల పాటు  తెలుగు పాటల ప్రపంచాన్ని ఉర్రూతలూగించి, మన అభిమాన హీరోల సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించి, మన పెదవుల్లో పాటలా, మన గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సాలూరి రాజేశ్వరరావు గారి అబ్బాయి కోటిగా మన అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సాలూరి కోటేశ్వర రావు. ఇది తెలుగు సినిమా పాటకి జరిగే పట్టాభిషేకం, ఆ పాటకి ప్రాణం పోసిన సంగీతానికి కలిగే అరుదైన అవకాశం.

ఆస్ట్రేలియా ఇండియన్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సొసైటీ ఆస్ట్రేలియాలోని పార్లమెంట్లో కోటి తెలుగు సినిమా సంగీతానికి చేసిన సేవలకు గాను గుర్తింపుగా ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందిస్తుంది, అంతే కాకుండా కోటి గారు అక్కడ ఉన్న మన తెలుగు గాయనితో ఒక పాట కూడా పాడించబోతున్నారు, ఆ గాయని మరెవరో కాదు, తన మొదటి పాటతోనే ఆసియా రికార్డు పుస్తకంలో స్థానం దక్కించుకున్న మన తెలుగింటి ఆడపడుచు సుస్మిత రాజేష్. హరుడే వరుడై, హర హర శంభో తర్వాత మరో వినూత్నమైన పాటతో, కొత్త కలయికతో మన ముందుకు వస్తున్నారు సుస్మిత. 

ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని AISECS అడ్వైజర్ రాజేష్ ఉప్పల మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత పెంపొందించడానికి దోహదపడతాయని మరియు 4వేల పాటల మైలురాయిని దాటిన కోటి గారికి ఆస్ట్రేలియాలోని పార్లమెంట్ లో గెస్ట్ ఆఫ్ హానర్ గా పిలవడం తమకెంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. మన తెలుగు తరపున, ముఖ్యంగా తెలుగు చలన చిత్రం తరపున, అందునా తెలుగు సంగీత ప్రియులు తరపున కోటి గారికి శుభాకాంక్షలు తెలుపుదాం.

Post a Comment

Previous Post Next Post