దర్శకేంద్రుడితో నా నూరవ చిత్రం
"శ్రీవల్లి కళ్యాణం" అతి త్వరలో!!
-తుమ్మలపల్లి రామసత్యనారాయణ
నిర్మాతగా నా జీవితాశయ నూరవ చిత్రం... దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుతో "శ్రీవల్లి కళ్యాణం" కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. త్వరలో మొదలై... వచ్చే ఏడాది విడుదల కానుంది" అన్నారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. సెప్టెంబర్ 10న జన్మదినం జరుపుకుంటున్న తుమ్మలపల్లి ఈ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
"2004లో "సుమన్-రవళి జంటగా రూపొందిన "ఎస్.పి.సింహా"తో నిర్మాతగా నా కెరీర్ చిన్నగా మొదలై... రామ్ గోపాల్ వర్మ "ఐస్ క్రీమ్ పార్ట్ ఒన్, ఐస్ క్రీమ్ పార్ట్ టు"లతో పుంజుకుంది. సూర్య "ట్రాఫిక్", అజిత్ - తమన్నా "వీరుడొక్కడే, కిచ్చా సుదీప్ - జగపతిబాబు "బచ్చన్", ఉదయనిధి స్టాలిన్ - నయనతార "శీనుగాడి లవ్ స్టోరీ" తదితర అనువాద చిత్రాలు లాభాలతోపాటు ఆత్మసంతృప్తినీ ఇచ్చాయి. ఈ ఏడాది యండమూరి దర్శకత్వంలో సునీల్ - బిగ్ బాస్ కౌశల్ తో నేను నిర్మించిన "అతడు ఆమె ప్రియుడు" విడుదలైంది. జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలో విడుదలైన "జాతీయరహదారి" చిత్రంకి అనేక అవార్డ్స్ వచ్చినవి. యండమూరి కథతో ఆర్జీవీ డైరెక్షన్ లో "తులసి తీర్థం" త్వరలో మొదలు కానుంది. అలాగే నా డ్రీమ్ ప్రాజెక్ట్... దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుతో "శ్రీవల్లి కళ్యాణం" ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి కావస్తున్నాయి. త్వరలోనే సెట్స్ కి వెళ్లనుంది" అని అన్నారు!!