నాగశౌర్య కెరీర్ లో ‘కృష్ణ వ్రింద విహారి' బెస్ట్ మూవీ అవుతుంది : నిర్మాత ఉషా మూల్పూరి ఇంటర్వ్యూ
యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఉషా మూల్పూరి ప్రకటించారు. ఈ సందర్భంగా విలేఖరు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
‘కృష్ణ వ్రింద విహారి' ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది ? కథలో మీకు కనెక్ట్ అయిన అంశం ?
నాగశౌర్య మొదట కథ విన్నారు. కథ చాలా బావుంది. పాండమిక్ లోనే స్టార్ట్ చేశాం. ‘కృష్ణ వ్రింద విహారి' కమర్షియల్ ఎంటర్ టైమెంట్ ఫ్యామిలీ మూవీ. ఈ కథకి ఒక తల్లిగా కనెక్ట్ అయ్యాను. అలాగే పిల్లల ప్రేమ, మా పెద్దబ్బాయి సాఫ్ట్ వేర్, ఇలా అన్ని ఎలిమెంట్స్ కి కనెక్ట్ అయ్యాం.
'అంటే సుందరానికీ' కూడా ఇదే బ్రాహ్మిన్ క్యారెక్టరైజేషన్ వచ్చింది కదా.. దానితో ఏదైనా పోలిక వుందా?
లేదండీ. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. దర్శకుడు అనీష్ ఆ సినిమా చూశారు. దానికి దీనికి ఎక్కడ పోలిక లేదు.
‘కృష్ణ వ్రింద విహారి' లో హీరో పాత్ర ఎలా వుంటుంది ?
ఒక పల్లెటూరి కుర్రాడిగా, బ్రాహ్మిన్ కుర్రాడిగా, సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా, కొడుకుగా, ప్రేమికుడిగా, భర్తగా, స్నేహితుడిగా ఇలా భిన్నమైన కోణాల్లో శౌర్యని చూస్తారు. శౌర్య కెరీర్ లో ‘కృష్ణ వ్రింద విహారి' ఒక బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నాను. మొదట అనుకున్న విడుదల తేది పాండమిక్ కారణంగా అన్నీ సినిమాల్లానే ముందువెనుక అయ్యింది. అయితే మంచి సినిమా.. మంచి డేట్ చూసి రావాలని భావించాం. మంచి డేట్ కోసం ఎదురుచూశాం. సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం.
బ్రాహ్మిన్ పాత్ర అంటే ప్రిపరేషన్ అవసరం కదా.. ఈ చిత్రం కోసం శౌర్య ఎలా ప్రీపేర్ అయ్యారు ?
బ్రాహ్మిన్ పాత్ర కోసం రెండు నెలలు ట్రైనింగ్ తీసుకున్నారు. ఇందుకోసం దర్శకుడు ఒక ట్రైనర్ ని ఏర్పాటు చేశారు. డబ్బింగ్ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారు.
200 మంది డ్యాన్సర్స్ తో చేసిన ఏముందిరా పాట కు చాలా మంచి స్పందన వచ్చింది. ఆ పాట గురించి చెప్పండి ?
దర్శకుడు ఆ సందర్భానికి అలాంటి గ్రాండ్ సాంగ్ వుంటే బావుంటుందని అనుకున్నారు. మంచి మ్యూజిక్ వచ్చింది. అలాగే లిరిక్స్ కూడా అద్భుతంగా కుదిరాయి. విజయ్ మాస్టర్ చక్కని కొరియోగ్రఫీ చేశారు. డీవోపీ సాయిశ్రీరామ్ కూడా చాలా అందంగా ఆ పాటని చిత్రీకరీంచారు. ఇప్పటికే ఆ పాటకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ అయిన తర్వాత మరింత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. 95 శాతం సినిమా పూర్తయింది. ఇప్పటివరకూ వచ్చిన అవుట్ పుట్ పై ఒక నిర్మాతగా చాలా ఆనందంగా వున్నాను.
శౌర్య ఫ్యామిలీ మూవీస్ చేసినప్పుడల్లా మంచి విజయాలు వచ్చాయి.. ఈ చిత్రాన్ని సేఫ్ గేమ్ అనుకుంటున్నారా?
అలా ఏం అనుకోలేదండీ. నిజం చెప్పాలంటే కమర్షియల్ మూవీ కంటే దీనికి ఎక్కువ బడ్జెట్ అయ్యింది.
మీ అబ్బాయి కదా అని ఖర్చుకి వెనకాడలేదా ?
మీరు ఇంకో హీరోని, కథని ఇస్తే ఇంతకంటే బాగా తీస్తాం(నవ్వుతూ). మా అబ్బాయి ప్రమోషన్స్ కి రాడు. ఇంకో హీరో అయితే నాకు చాలా పాజిటివ్ గా వుండేదని అనుకుంటాను(నవ్వుతూ). మా అబ్బాయితో తీస్తే చాలా సులువుగా వాళ్ళ అబ్బాయి కదా అనేస్తారు. అదే వేరే హీరో అయితే భలే తీశారని అంటారు. నేను కూడా వేరే హీరోలతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.
వేరే హీరోలతో సినిమా ప్లానింగ్స్ ఏమీ లేవా ?
వాస్తవంగా చెప్పాలంటే నేను ఇండస్ట్రీకి ఒక లక్ష్యంతో రాలేదు. అనుకోకుండా రావాల్సివచ్చింది. ఎప్పటికప్పుడు సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళిపోదామా అనే ఆలోచనలోనే వున్నాను కాబట్టి వేరే వారిని అప్రోచ్ అవ్వలేదు. ఈ సినిమా జరిగేటప్పుడు కూడా ఇదే చివరి సినిమా అనుకునే వున్నాను. కానీ మా స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇంకా సినిమాలు చేయాలని కోరారు. అందుకే నిర్ణయం మార్చుకొని వేరే హీరోలతో కూడా సినిమా చేయాలని భావిస్తున్నాను. ఇది నా చివరి చిత్రం కాదు (నవ్వుతూ)
లైనప్ లో కథలు ఉన్నాయా ?
కొన్ని వింటున్నాం. అయితే ఇప్పుడు కొత్త సినిమా ఆలోచన లేదు. నిండు గర్భిణి బిడ్డని కన్న తర్వాతే మరో బిడ్డ గురించి ఆలోచిస్తుంది. ప్రస్తుతం ఆ పరిస్థితిలో వున్నాను. ప్రస్తుతం నా ద్రుష్టి అంతా ఈ చిత్రం విడుదలపైనే వుంది.
హీరోయిన్ షిర్లీ సెటియా గురించి?
టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత వుంది. షిర్లీ సెటియా ఆ కొరతని తీరుస్తుందనే నమ్మకం వుంది. చాలా మంచి నటి. అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేసింది. ఇందులో హీరోయిన్ పేరు వ్రిందా. హీరో పేరు కృష్ణ. అందుకే చిత్రానికి కృష్ణ వ్రిందా విహారి అనే టైటిల్ పెట్టాం.
ఈ సినిమా చేస్తున్నపుడు నిర్మాతగా ఒత్తిడికి లోనయ్యరా ?
ఎలాంటి ఒత్తిడి లేదు. అద్భుతమైన కథ. ఆ కథకు తగ్గట్టు నటీనటులు, సాంకేతిక నిపుణలని ఎంపిక చేసుకున్నాం. ఈ సినిమాపై మాకు చాలా నమ్మకం వుంది. సినిమా చాలా ఫ్రెష్ గా వుంటుంది. శౌర్య అద్భుతంగా చేశాడు. రాధిక, వెన్నెల కిషోర్, బ్రహ్మజీ, రాహుల్ రామకృష్ణ, సత్య అందరి పాత్రలు బావుంటాయి. దర్శకుడు అనీష్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని అద్భుతంగా డీల్ చేశారు. సినిమా అందరికీ నచ్చుతుంది. ఎవరినీ నిరాశ పరచదు. మా బ్యానర్ ఇది చాలా మంచి చిత్రమౌతుంది.
ఆల్ ది బెస్ట్
థాంక్స్