Home » » Shikaru Pre Release Event Held Grandly

Shikaru Pre Release Event Held Grandly

 ఆహ్లాద‌క‌రంగా జ‌రిగిన సాయిధ‌న్సిక `షికారు` చిత్రం ప్రీ రిలీజ్ వేడుక‌



సాయిధ‌న్సిక‌, తేజ్ కూర‌పాటి, అభిన‌వ్ మేడిశెట్టి, కె.వి. ధీర‌జ్‌, న‌వ‌కాంత్‌, చ‌మ్మ‌క్ చంద్ర ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన చిత్రం `షికారు`  శ్రీ‌స‌త్య‌సాయిబాబాగారి ఆశీస్సుల‌తో నాగేశ్వ‌రి (ప‌ద్మ‌) స‌మ‌ర్ప‌ణ‌లో పి.ఎస్‌.ఆర్‌. కుమార్ (బాబ్జీ, వైజాగ్‌) నిర్మాత‌గా శ్రీ‌సాయి ల‌క్ష్మీ క్రియేష‌న్స్ బేన‌ర్‌మీద హ‌రి కొల‌గాని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది. (యాన్ అన్‌లిమిటెడ్ ఫ‌న్ రైడ్‌) అనేది ట్యాగ్‌లైన్‌. శేఖ‌ర్ చంద్ర సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల‌యి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాయి.


ఈ సినిమా జులై 1న విడుద‌ల‌కాబోతుంది. సినిమాపై న‌మ్మ‌కంతో చిత్ర‌యూనిట్ ముందుగానే సినిమాను నెల్లూరులోని సిరీ థియేట‌ర్‌లో నారాయ‌ణ ఇంజ‌నీరింగ్ కాలేజీ విద్యార్థుల‌కు చూపించారు. అనంత‌రం వారు ఇచ్చిన అమేజింగ్ రెస్పాన్స్ చిత్ర‌యూనిట్‌కు ఎన‌ర్జీ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్‌లో షికారు ప్రీ రిలీజ్ వేడుక నిర్వ‌హించారు.


సాయి ధ‌న్సిక  మాట్లాడుతూ, షికారు సినిమాలో మొద‌టినుంచి పోస్ట‌ర్‌లో అంద‌రిని చూపించారు. ఇందులో క‌నిపిస్తున్న అంద‌రూ స్టార్సే. ఇలా డిజైన్ చేసిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. ఈరోజు ఇంత ఆద‌ర‌ణ పొందేలా వుండ‌డానికి కార‌ణం టెక్నీషియ‌న్స్ కృషి. న‌టీన‌టుల అభినయం. వారంద‌రినీ న‌డిపించిన ద‌ర్శ‌క నిర్మాత‌లు. న‌లుగు కుర్రాళ్ళ బాగా న‌టించారు. ర‌చ‌యిత క‌ర‌ణ్ నా బాడీ లాగ్వేజ్ ఎలా వుండాలో కూడా తెలియ‌జేస్తూ ఎంక‌రేజ్ చేశారు. అదేవిధంగా ప్రస‌న్న‌కుమార్‌, బెక్కెం వేణుగోపాల్‌, డి.ఎస్‌.రావు ఎంత‌గానో పాజిటివ్‌తో మొద‌టి నుంచీ స్పందించారు. మొద‌టి నుంచి షికారు చిత్రంపై బాబ్జీగారు పూర్తి న‌మ్మ‌కంతో వున్నారు. ఇందులో కంటెంట్‌తోపాటు కామెడీ ఎక్కువ‌గా వుంటుంది. అంద‌రూ చూసి ఎంజాయ్ చేయండి అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు హ‌రి మాట్లాడుతూ, నా టీమ్ ఎంతో స‌హ‌క‌రించింది. నెల్లూరులో కాలేజీ స్టూడెంట్స్ స్పందించిన తీరు మేం అనుకున్న‌ట్లుగా వుండ‌డం చాలా ఆనందంగా వుంది. వారి జ‌డ్జిమెంట్ మాకు మ‌రింత ఎన‌ర్జీ ఇచ్చింది.  ఎడిట‌ర్‌, సుభాష్ మాస్ట‌ర్‌. అంద‌రూ స‌హ‌క‌రించారు.  శేఖ‌ర్ చంద్ర ఓపిగ్గా బాణీలు ఇచ్చాడు. భాస్క‌భ‌ట్ల పాట‌లు చాలా బాగా రాశాడు. న‌టీన‌టులు ఎంత‌గానో స‌హ‌క‌రించారు. నిర్మాత బాబ్జీగారు నాకు చాలా ఫ్రీడం ఇచ్చారు. అభి, తేజ‌, ధీర‌జ్‌, న‌వ‌కాంత్ అంద‌రూ బాగా చేశారు. అంద‌రికీ మంచి పేరు వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాన‌ని అన్నారు.


చిత్ర నిర్మాత బాబ్జీ మాట్లాడుతూ, ఈరోజు చాలా ఆనందంగా వుంది. ట్రైల‌ర్ నుంచి పెద్ద హిట్ అని చెబుతున్నా. అలాగే జ‌రుగుతుంది. ఈ సినిమాకు అన్నీ స‌రిగ్గా కుదిరాయి. క‌రోనా టైంలో నేను డిప్రెష‌న్‌లో వున్న‌ప్పుడు లైన్ ప్రొడ్యూస‌ర్‌ శివ‌కుమార్ ఎంతో  ధైర్యం ఇచ్చారు. నెల్లూరులో జ‌రిగిన ప్రీమియ‌ర్ షో  అద్బుతంగా వుంద‌ని టాక్ వ‌చ్చింది. స్టూడెంట్స్ కేరితం మాకు ఆనందాన్నిచ్చాయి.  సాయిధ‌న్సిక సినిమాకు వెన్నెముక‌. సినిమాను న‌డించింది ఆమెనే. అభిన‌యం అద్భుతంగా చేసింది. ఆమెను తెలుగులో ప‌రిచ‌యం చేస్తున్నందుకు గ‌ర్వంగా వుంది. మా సినిమాలో వ‌ల్గారిటీ లేదు. ఈ క‌థ అంద‌రికి తెలిసిన క‌థే. అహ‌ల్య గురించి అంద‌రికీ తెలుసు. షికారు క‌థ కూడా అటువంటి క‌థే. అంద‌రికీ న‌చ్చే సినిమా ఇది అని తెలిపారు.


మాట‌ల ర‌చ‌యిత విశ్వ‌క‌ర‌ణ్  మాట్లాడుతూ, ఐదేళ్లుగా హ‌రి తెలుసు. హ‌రి ద‌గ్గ‌ర పెద్ద క‌థ‌లున్నాయి. తొలిసినిమా రానా వంటి పెద్ద‌న‌టులతో చేద్దామ‌నుకున్నాడు. సాధ్య‌ప‌డ‌క‌పోవ‌డంతో ఆ టైంలో చిన్న సినిమా చేద్దామ‌ని సూచించా. అప్పుడు ఓ క‌థ చెప్పాడు. న‌లుగు కుర్రాళ్ళు, ఓ అమ్మాయికి క‌నెక్ట్ అవుతాడ‌న్నాడు. ఈ క‌థ‌ను త‌న స్వీయానుభ‌వాల్లోంచి తీసుకుని రాశాడు. ఆ క‌థ తీసుకుని బెక్కెం వేణుగారికి చెప్పాను. ఇది నా జీవితంలో జ‌రిగింది  క‌దా అన్నాడు. ఆ త‌ర్వాత బాబ్జీగారిని క‌లిశాం. ఇది ఎప్పుడో నాకు జ‌రిగింది అన్నారు. ఆ త‌ర్వాత న‌టీన‌టుల‌కు క‌లిసి క‌థ చెప్పాం. అంద‌రూ ఇది మా క‌థ అన్నారు. అలా చేసిన ప్ర‌యాణం జులై1న విడుద‌ల వ‌ర‌కు వ‌చ్చింది. ఇందులో ఏదీ త‌ప్పుగా వుండ‌దు. వున్నా ప‌రిష్కారం  వుంటుంది అని తెలిపారు.


న‌టుడు, నిర్మాత డి.ఎస్‌. రావు  మాట్లాడుతూ, సాయి ధ‌న్సిక అభిన‌యం అద్భుతం. జై బాల‌య్య ఫ్యాన్స్ అనేవారు చాలా డీసెంట్‌గా వుండాల‌ని చెప్పే పోలీస్‌గా న‌టించాను. ఈ సినిమాలో అండ‌ర్ క‌రెంట్ డైలాగ్స్ ర‌చ‌యిత చాలా చ‌మ‌త్కారంగా రాశాడు. న‌వ్విస్తూ క‌వ్విస్తూ వుండేలా వుంటాయి. ద‌ర్శ‌కుడు క‌థను డీల్ చేసే విధానం బాగుంది. ఫొటోగ్ర‌ఫీ, సంగీతం చాలా బాగున్నాయి. నిర్మాత‌కు మంచి లాభాలు రావాల‌ని ఆశిస్తున్నాన‌ని అన్నారు.


ప్ర‌స‌న్న‌కుమార్  మాట్లాడుతూ, అంద‌రూ సినిమాను ప్రేమిస్తూ ప్ర‌మోష‌న్ చేయ‌డం అనేది గ‌తంలో జ‌రిగేది. అలా షికారుకు వ‌చ్చారంటేనే స‌క్సెస్ కింద లెక్క‌. ఈ సినిమాకు అలా కుదిరింది. నెల్లూరులో  ప‌బ్లిక్‌గా షో వేసి మంచి రెస్సాన్ తీసుకున్నారు.. సాయిధ‌న్సిక‌లో అందంతోపాటు మంచి క్యారెక్ట‌ర్ వుంది. ఆమెకు మంచి భ‌విష్య‌త్ వుంటుంది అన్నారు.


నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, నెల్లూరు స్టూడెంట్స్‌తోపాటు డిస్ట్రిబ్యూట‌ర్ కూడా సినిమా చూశారు. ఇది మంచి హిట్ సినిమా. ఓపెనింగ్స్ వ‌స్తాయి. హిట్ అవుతుంది అని చెప్పాడు. నిర్మాత‌తోపాటు ద‌ర్శ‌కుడికి కూడా ప్రాధాన్య‌త గ‌ల సినిమా. ఆయ‌న ద‌గ్గ‌ర చాలా పెద్ద క‌థ‌లు వున్నాయి. ద‌ర్శ‌కుడు 8 ఏల్ళ ప్ర‌యాణంలో చిన్న సినిమాతో ముందుకు వ‌చ్చి స‌క్సెస్ ఇవ్వ‌బోతున్నాడ‌ని అన్నారు.


ర‌చ్చ ర‌వి  మాట్లాడుతూ, ప్ర‌మోష‌న్‌లో భాగంగా నెల్లూరు, వైజాగ్ వెళ్ళాను. భాస్క‌ర‌భ‌ట్ల పాట‌లతోపాటు శేఖ‌ర్ చంద్ర సంగీతానికి యూత్ క‌నెక్ట్ అయ్యారు. వారితోపాటు ధ‌న్సిక‌ను అంద‌రూ రిసీవ్ చేసుకున్నారు. పోసాని నుంచి అన్న‌పూర్ణ‌మ్మ వ‌ర‌కు అంద‌రం ఫ‌న్ చేశాం.  నిర్మాత‌గారు లాక్‌డౌన్‌లో కూడా క‌థ‌పై న‌మ్మ‌కంతో క‌ష్ట‌ప‌డి ఈ సినిమా తీశారు.   ధ‌న్సిక తెలుగులో మంచి హీరోయిన్‌గా అవుతుంది అన్నారు.


న‌టుడు ధీర‌జ్  మాట్లాడుతూ, నాకు భ‌యమేస్తే  బాల‌య్య‌ను త‌ల‌చుకుంటాను. నా పాత్ర కూడా సినిమాలో అలా వుంటుంది. నేను ఇంత‌కుముందు షార్ట్ ఫిలింస్ చేశాను. ఇప్పుడు షికారు సినిమా చేశాను. ఇంత‌కంటే మంచి డెబ్యూ ఊహించ‌లేదు. `మేం వ‌య‌స్సుకు వ‌చ్చాం` నాకు న‌చ్చిన ఆల్బ‌మ్‌. దానికి సంగీతం ఇచ్చిన శేఖ‌ర్ చంద్ర ఈ సినిమాకు ప‌నిచేయ‌డం ఆనందంగా వుంది.  ఆర్.ఆర్‌. అద్భుతంగా వుంది. `నేనింతే`లో భాస్క‌ర‌భ‌ట్ల‌ సాంగ్ అంటే ఇష్టం. దాన్ని ప‌దే ప‌దే వినేవాడిని. ఆయ‌న మా సినిమాకు రాయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.


న‌టుడు న‌వ‌కాంత్  మాట్లాడుతూ, మిడిల్ క్లాస్ అబ్బాయి అయిన నేను సినిమా కోసం టికెట్ దొరికితే ఆనంద‌ప‌డేవాడిని. అలాంటి న‌న్ను ఏకంగా హీరో చేశారు. ఇందుకు మాట‌లు రావ‌డంలేదు. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎంతో ఎంక‌రేజ్ చేశారు. మీడియాకూడా ప్రేక్ష‌కుల‌కు రీచ్ అయ్యేలా చేసింది. ఈ సినిమాను చూసి న‌వ్వండి ఆయుష్ పెంచుకోండ‌ని అని తెలిపారు.


కొరియోగ్రాఫ‌ర్ సుభాష్ మాస్ట‌ర్  మాట్లాడుతూ,  హుషారు సినిమాకు కొరియోగ్రాఫ‌ర్ గా చేశాను.  యాదృశ్చికంగా షికారుకు చేశాను. సిద్ద్ శ్రీ‌రామ్ అందులో పాట పాటారు. ఇప్పుడు ఇందులోనూ పాడారు.  హాట్రిక్ అవుతుంద‌నిపిస్తుంది. నెల్లూరు స్టూడెండ్స్ రెస్పాన్స్  చూశాక ఇది స‌క్సెస్‌మీట్‌గా అనిపిస్తుంది.  మీ అంద‌రికీ ఈ సినిమా న‌చ్చుతుందని అన్నారు.


ఇంకా ఈ వేడుక‌లో లైన్ ప్రొడ్ఊస‌ర్ శివ‌కుమార్, ఆదిత్య‌మ్యూజిక్ నిరంజ‌న్‌, మాధ‌వ్‌, `ఆద్య` ద‌ర్శ‌కుడు కృష్ణ మాట్లాడారు.


Share this article :