‘స్కై లాబ్’ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను : నేచురల్ స్టార్ నాని
వెర్సటైల్ యాక్టర్స్ సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన తారాగణంగా డా.రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం ‘స్కైలాబ్’. నిత్యామీనన్ సహ నిర్మాత. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. డిసెంబర్ 4న మూవీ విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో...
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ ‘‘సాధారణంగా సినిమా రిలీజ్ దగ్గర పడుతుందంటే టీమ్ సభ్యుల్లో తెలియని ఓ టెన్షన్ ఉంటుంది. కానీ ఈరోజు స్కై లాబ్ టీమ్‌లో ఆ టెన్షన్ కనపడటం లేదు. అందరి ముఖాలు వెలిగిపోతున్నాయి. కొన్ని సినిమాలకు అలా కుదురుతాయి. వైబ్ చెప్పేస్తుంది, సినిమా కొట్టేస్తున్నాం. ఈ సినిమాకు సంబంధించి ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకం. పాజిటివ్ నెస్, ప్రేమ, సినిమా విజువల్స్ అన్నీ చూస్తుంటే సినిమా చాలా పెద్ద సక్సెస్ అయిపోతుందనే నమ్మకం ఉంది. స్కై లాబ్ గురించి నేను కూడా చిన్నప్పుడు కథ కథలుగా విన్నాను. అందరూ చాలా భయపడ్డారు. అలాంటి ఐడియాతో సినిమా చేయడమనేది చాలా ఎగ్జయిటింగ్ అనే చెప్పాలి. నిజానికి నేను డైరెక్టర్ విశ్వక్‌తో మాట్లాడినప్పుడు నాకు తెలిసిందేంటంటే, ఈ కథను ముందు నాకే చెబుతామని అనుకుంటే కుదరలేదని. చాలా మిస్ అయ్యానని బాధేసింది. అయితే నిత్యా, పృథ్వీ నిర్మాతలు, మంచి టీమ్ చేతిలో పడిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలా మొదలైంది సినిమా వచ్చి దాదాపు పదేళ్లు అయ్యింది. ఆ సినిమా షూటింగ్ సమయాల్లో చిన్న పిల్లల్లా ఉండేవాళ్లం. స్కూల్లో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్‌లా ఆ సినిమాను ఎంజాయ్ చేశాం. మణిరత్నం వంటి డైరెక్టర్స్‌కే నిత్యా మీనన్ ఫేవరేట్ యాక్టర్. ఆమె ఏ లాంగ్వేజ్‌లో సినిమా చేసినా మంచి నటి అనే పేరు తెచ్చుకుంది. అంత మంచి యాక్టర్ ఈ సినిమాతో తన ప్రొడక్షన్ జర్నీ స్టార్ట్ చేసిందంటే, గర్వంగా ఫీల్ అవుతుందంటే ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించవచ్చు. రామానాయుడుగారిలా, సురేష్‌బాబుగారిలా, దిల్‌రాజుగారిలా వందల సినిమాలు తను ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక సత్యదేవ్ గురించి చెప్పాలంటే.. తను స్టార్ అవబోతున్న యాక్టర్‌లా అనిపిస్తాడు. తను ఎంచుకుంటున్న సినిమాలు, పెర్ఫామెన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాంటి వాళ్లు మంచి స్థాయికి చేరుకుంటే మనకెంతో సంతోషంగా ఉంటుంది. తనలాంటి డిఫరెంట్ మూవీస్ చేసే హీరోలు మనకు కావాలి. తనకు ఆల్ ది వెరీ బెస్ట్. రాహుల్ రామకృష్ణ టెరిఫిక్ యాక్టర్. తనకు అభినందనలు. డైరెక్టర్ విశ్వక్‌కి ఆల్ ది బెస్ట్. స్కై లాబ్ సక్సెస్‌కి స్కై లిమిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిసెంబర్ 4న స్కైలాబ్ బాక్సాఫీస్ మీద పడబోతుందని నాకు తెలుసు. సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
సత్యదేవ్ మాట్లాడుతూ ‘‘స్కై లాబ్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. నాని అన్న వచ్చాడంటే సినిమా హిట్. తను మా తిమ్మరుసు సినిమాకు వచ్చాడు. నాకు మంచి హిట్ వచ్చింది. ఇది కూడా అలాగే అవుతుందని భావిస్తున్నాను. డైరెక్టర్ విశ్వక్, నిర్మాత పృథ్వీ సినిమా చూసి చాలా గుండె ధైర్యంతో ఉన్నారు. మంచి టీమ్ వర్క్ చేసింది. విశ్వం, చంద్రిక సినిమాలోని బండ లింగపల్లిని అద్బుతంగా రీ క్రియేట్ చేశారు. ప్రశాంత్ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చాడు. నిర్మాత పృథ్వీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. విశ్వక్ ఖండేరావు సినిమా మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాడు. నిత్యా మీనన్ గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆమె ఈ సినిమాతో నిర్మాతగా మారినందుకు ఆమె ఎంత సంతోషంగా ఉందో నాకు తెలుసు. డిసెంబర్ 4న విడుదలవుతున్న స్కై లాబ్ చూసి ఇది మా తెలుగు సినిమా అని అందరూ గొప్పగా చెప్పుకుంటారు’’ అన్నారు.
నిత్యామీనన్ మాట్లాడుతూ ‘‘నేను ఈవెంట్స్‌లో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపించను. నెర్వస్‌గా ఫీల్ అవుతాను. కానీ ఇక్కడ ఉండటం అనేది కాస్త ఎమోషనల్‌గానే ఉంది. విశ్వక్ కథ చెప్పినప్పుడు ఎక్సలెంట్‌గా ఉందనిపించింది. నేను నటిగా నా లైఫ్‌లో చూసిన దర్శకుల్లో తను బెస్ట్ అని ఫీల్ అవుతున్నాను. తనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నిర్మాత పృథ్వీ పిన్నమరాజు వంటి వ్యక్తిని ఎక్కడా కలవలేదు. మంచి సినిమాను మాత్రమే నిర్మించాలని తపించే వ్యక్తి. ఈ టీమ్ నిర్మాతగా నాకు నమ్మకాన్ని పెంచారు. రియల్ ఫుల్ ఎమోషన్, సోల్ ఉన్న మూవీ స్కై లాబ్. నిర్మాతగానే కాదు.. నటిగానూ నాకెంతో తృప్తినిచ్చిన సినిమా ఇది. ప్రశాంత్ విహారి ఇచ్చిన సంగీతం సినిమాను మరో లెవల్‌లో నిలబెట్టింది. సత్య దేవ్, రాహుల్ రామకృష్ణతో నటించేటప్పుడు రియల్ యాక్టర్స్ అనిపించారు. ఈ సినిమా నిర్మాణంలో భాగమైనందుకు గౌరవంగా, అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. రియల్ మూవీగా ఫీల్ కావడంతో నేను ఈ సినిమాలో భాగమైయ్యాను. ఈ మూవీని నా సోల్‌గా ఫీల్ అవుతున్నాను. డిసెంబర్ 4న మా స్కై లాబ్‌ను ప్రపంచం అంతా చూడబోతుంది’’ అన్నారు.
డైరెక్టర్ విశ్వక్ ఖండేరావు మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ కావాలనేది 12 ఏళ్ల కల.. 4 ఏళ్ల కష్టం. అదే నా సినిమా స్కై లాబ్. నా టీమ్ సపోర్ట్ లేకపోతే నేను ఈ సినిమా చేయలేకపోయేవాడిని. సినిమాటోగ్రాఫర్ ఆదిత్యతో కలిసి ఫిల్మ్ స్కూల్‌లో చదువుకున్నాను. అతనితో పాటు కొందరు స్నేహితులతో కలిసి ఈ సినిమా చేశాను. ఈ స్నేహితులు ఉండటం వల్లే నేను ధైర్యంగా అడుగులు ముందుకు వేశాను. రవితేజ గిరిజాల ఎడిటింగ్ విషయంలో ప్రతి కట్‌కు సమాధానం చెప్పగలడు. ఇది సిట్యువేషనల్ కామెడీ మూవీ. నేను ఏదైతే సినిమాలో ఉండాలని అనుకున్నానో, దాన్ని ప్రశాంత్ విహారి తన సంగీతంతో ప్రాణం పోశాడు. అమేజింగ్ వర్క్ అందించాడు. యాక్టర్స్ నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్ సహా అందరూ ముందే ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండేవారు. నిజానికి ఈ కథను నానిగారికి చెప్పాలనుకున్నాను. అయితే ముందు పృథ్వీగారికి చెప్పగానే ఆయన సినిమా చేయడానికి ఓకే చెప్పేశారు. సినిమా అంటే అంత ప్యాషన్ ఉండే వ్యక్తి. అంత మంచి నిర్మాత దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రవల్లిక, నరేశ్‌గారు అందించిన సపోర్ట్ మరచిపోలేను. ఇక రవికిరణ్‌గారు మంచి ఇన్‌పుట్స్ అందించి సినిమాను సాఫీగా సాగిపోవడానికి సపోర్ట్ చేశారు. ఈ సినిమాకు గొప్ప యాక్టర్స్ దొరికారని చెప్పగలను. కథ విన్నప్పటి నుంచి నటిగా, నిర్మాతగా ఆమె అందిస్తున్న సహకారం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి సినిమాను కుదిరితే ఆమెతోనే చేయాలనుకుంటున్నాను. సత్యదేవ్‌గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. డిఫరెంట్ కథలను రాసుకున్నప్పుడు ఆయన్ని కలిసి మాట్లాడవచ్చునని నమ్మకం కలిగించిన యాక్టర్. ఈ సినిమాలో మరో కొత్త సత్య దేవ్‌ను చూస్తారు. ఆయన ఏ రోల్‌ను అయినా చేయగలరు. రాహుల్ సింప్లీ సూపర్బ్. అలాగే భరణిగారు, సుబ్బరాయ శర్మగారు సహా ఇతర నటీనటులతో కలిసి పనిచేయడం మరచిపోలేని ఎక్స్‌పీరియెన్స్’’ అన్నారు.
నిర్మాత పృథ్వీ పిన్నమరాజు మాట్లాడుతూ ‘‘మా ఈవెంట్‌కు వచ్చిన నానిగారికి థాంక్స్. సింక్ సౌండ్‌లో చేసిన సినిమా ఇది. ముందు కాస్త భయపడ్డాను కానీ... క్వాలిటీ పరంగా అమేజింగ్‌గా ఉంటుంది. సౌండ్ డిపార్ట్‌మెంట్ ఎక్సలెంట్ సపోర్ట్ చేశారు. ప్రశాంత్ అండ్ టీమ్ చేసిన సపోర్ట్‌తో మంచి ఔట్‌పుట్ వచ్చింది. సినిమాటోగ్రాఫర్ ఆదిత్య మా సినిమా కోసం చాలా సినిమాలను వదులుకుని అండగా నిలబడ్డాడు. విశ్వక్ సీన్ కనస్ట్రక్షన్ నుంచి ఎంత కష్టపడ్డాడో తెలుసు. మ్యాజికల్‌గా ఉంటుంది. రాహుల్ రామకృష్ణ టాలెంటెడ్ యాక్టర్. నిత్యామీనన్‌గారు సినిమాలోని సెన్సిబిలిటీ పట్టుకుని మాకు సపోర్ట్‌గా నిలిచారు. సత్యగారిని ఇప్పటి వరకు చేసిన రోల్స్‌కు భిన్నమైన రోల్‌లో చూడబోతున్నారు. అందరూ అందించిన సపోర్ట్‌కు థాంక్స్’’ అన్నారు.
చిత్ర సమర్పకుడు డా.రవి కిరణ్ మాట్లాడుతూ ‘‘స్కై లాబ్ అనేది మా టీమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. టైటిల్ విన్నవాళ్లు ముందు దీన్ని సైంటిఫిక్ మూవీ అని, సోషియో ఫాంటసీ సినిమా అనుకున్నారు. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందనే విషయం అందరికీ అర్థమైంది. ట్రైలర్ చూసిన వాళ్లందరూ మాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. మాకు అది మంచి బూస్టింగ్ అయ్యింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే చక్కటి సినిమా మా స్కై లాబ్’’ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వివేక్ ఆత్రేయ, మున్నా, వెంకట్ మహ సహా ఎంటైర్ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
Post a Comment