తమ్ముడు పవన్ కల్యాణ్ ని అన్న చిరంజీవి ఈ రోజు ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడారు. హైదరాబాదులోని శిల్ప కళా వేదికలో 'గబ్బర్ సింగ్' ఆడియోను విడుదల చేసిన అనంతరం అశేష అభిమానజనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ చిరంజీవి ప్రసంగించారు. "తమ్ముడు గురించి ఏం చెప్పుకోను... చిన్నప్పటి నుంచీ తను అందరిలోకీ డిఫరెంట్ గా ఉండేవాడు. అదే డిఫరెన్స్ ని ఈవేళ తన సినిమాల్లో కూడా చూపిస్తున్నాడు. తను నిజ జీవితంలో ఎలా ఉంటాడో, ఎలా ఆలోచిస్తాడో తన సినిమాల్లో కూడా అదే చూపిస్తాడు. సమాజానికి ఏదో చెప్పాలన్న తపన కనపడుతుంది. దేశభక్తి వుంటుంది. యువతకు దిశానిర్దేశం చేస్తాడు. చిన్నప్పటి నుంచీ అమ్మాయిల పట్ల ఈవ్ టీజింగ్ చేసే వాళ్లని అసహ్యించుకునేవాడు. అదే తన సినిమాల్లోనూ చూపిస్తున్నాడు. విలన్ తో ఫైట్ చేసేటప్పుడు కూడా అదే కసి కనపడుతుంది తనలో. తన ఒరిజినల్ క్యారెక్టర్నితెరమీద చూపిస్తాడు. నిజాయతీకి మారు పేరు పవన్" అన్నారు చిరంజీవి.
ఇక రచ్చ రచ్చే!
చిరంజీవి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, "ఇటీవల విడుదలైన రచ్చ ఒక రచ్చ అయితే... రేపు గబ్బర్ సింగ్ రచ్చ రచ్చ. పాటలన్నీ విన్నాను. ప్రతి పాటా బాగుంది. ఇప్పుడు విన్న 'కెవ్వు కేక' పాట నిజంగా కెవ్వు కేకే! ఇందాక విన్న 'దేఖో.. దేఖో' పాట చూస్తుంటే నాకు కూడా స్టేజ్ మీదకు వచ్చి డ్యాన్స్ చేయాలనిపించింది. కానీ, బాగుండదని ఆగిపోయాను... అక్కడికీ తట్టుకోలేక కూర్చున్న చోటే కాళ్ళు కదిపాను. రేపు దియేటర్లో ఇదంతా రచ్చ రచ్చే!" అన్నారు.
మీడియాకు చిరు చురకలు!
ఈ సందర్భంగా చిరంజీవి మీడియాకు చురకలంటించారు. "ఇంట్లో ఒక్కోసారి పొరబాటున చరణ్ ని కల్యాణ్ అని పిలుస్తుంటాను. కల్యాణ్ ని చరణ్ అని పిలుస్తుంటాను. కానీ వాళ్ళేమీ అనుకోరు. నవ్వుకుంటూ పలుకుతారు. ముంబయ్ లో వున్న చరణ్ ఫోన్ చేసి, బాబాయ్ కి బెస్ట్ విషెస్ చెప్పమన్నాడు... మీడియా వాళ్లకు చెబుతున్నాను... రేపు దీనిని కాంట్రావర్షీ చేయకండి. రచ్చ ఆడియో వేడుకలో కల్యాణ్ అమెరికాలో ఉన్నాడని చెబితే మీడియా దానిని వక్రీకరించింది. లేని మాట చెప్పడం మా మెగా ఫ్యామిలో లేదు. నిజంగానే రచ్చ ఆడియోకి కల్యాణ్ అమెరికాలో వున్నాడు. కానీ, మీడియా ఇక్కడే ఉన్నాడని రాశారు. కావాలంటే ఇమిగ్రేషన్ చెకప్, టికెట్ చూడండి. రచ్చ ఆడియో విడుదలైన తర్వాతి డేటే వాటి మీద వుంటుంది. ఇలాంటి లేనిపోనివి రాసి క్యారెక్టర్ అసేసినేషణ్ చేయకండి... ఆ స్థాయికి మెగా ఫ్యామిలీ ఎప్పుడూ దిగజారదు" అంటూ చిరంజీవి ఆవేశంగా ప్రసంగించారు.
ఆ తర్వాత మాట్లాడిన పవన్ కల్యాణ్ రెండంటే రెండే ముక్కలు మాట్లాడి అభిమానుల్ని నిరాశపరిచాడనే చెప్పాలి. వినోదాన్ని పంచడం కోసం శాయశక్తులా కృషి చేస్తానని పవన్ అన్నారు. ఈ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ చేసిన పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. శృతి హాసన్, అల్లు అర్జున్, బ్రహ్మానందం, అలీ, హరీష్ శంకర్, ఇంకా పలువురు దర్శకులు, నిర్మాతలు, వేలాదిగా మెగా అభిమానులు ఈ వేడుకలో పాల్గొన్నారు
Post a Comment