నేను పేదవాడ్ని కాకపోయి ఉంటే ఈ స్థాయికి వచ్చేవాడ్ని కాదు- డా. అక్కినేని


నేను పేదవాడ్ని కాకపోయి ఉంటే ఈ స్థాయికి వచ్చేవాడ్ని కాదు- డా. అక్కినేని
75 ఏళ్లుగా... ‘నాట్ అవుట్ నటుడు’గా నటించడం అంటే అది డా.అక్కినేని నాగేశ్వరరావుకే చెల్లింది. అందుకే యావత్ తెలుగుచిత్ర పరిశ్రమ ఒకచోట చేరి సోమవారం సాయంత్రం హైదరాబాదులోని శిల్పకళావేదికలో అక్కినేనిని భారీఎత్తున సత్కరించింది. ఈ బృహత్కార్యానికి మూలకర్త డా.టి.సుబ్బిరామిరెడ్డి. అలనాటి నాయికలతోపాటు నేటి నాయికలు, ప్రముఖ హీరోలు, చిత్ర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై ఎంతో శోభను కలిగించారు. ఒక్క మాటలో చెప్పాలంటే... ఇది ‘తెలుగుచిత్ర పరిశ్రమ’ తనకుతాను చేసుకుంటున్న సత్కారసభగా సాగింది.

తనకు జరిగిన సన్మానానికి అక్కినేని నాగేశ్వరరావు కృతజ్ఞతలు చెబుతూ ఇలా మాట్లాడారు. ‘‘ఈ 89ఏళ్ల జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను. కేవలం ఐదెకరాల పొలం ఉన్న చిన్న రైతుబిడ్డను నేను. మా కుటుంబంలో చదువుకున్నవాళ్లెవరూ లేరు. చిన్నతనంలో నాటకాలంటూ తిరుగుతుంటే ఆ ఐదెకరాల పొలం ఉంటే వీడికి భరోసాగా ఉంటుందని అమ్మ నాటకాల్లో నన్ను ప్రోత్సహించింది. నేను కనుక కలిగినవాళ్ల ఇంట్లో పుట్టి ఉంటే, డిగ్రీ పూర్తి చూసి, రామాపురంలో క్లర్క్ ఉద్యోగిగా ఈపాటికి రిటైర్ అయ్యేవాడ్ని. కానీ మీ ముందు మాట్లాడే స్థాయికి రాగలిగానంటే దానికి కారణం నేను పేదవాడిని అవ్వడమే.
పవిత్రమైన హృదయం కలిగిన వ్యక్తులందరూ దేవుళ్లే. అలాంటి మీరు అభిమానుల రూపంలో లక్షల్లో ఉన్నారు. 78ఏళ్ల క్రితం ఘంటశాల బలరామయ్యగారికి తెనాలి రైల్వేస్టేషన్‌లో కనిపించకపోతే ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడ్ని కాదు. నా బిడ్డలను, నా మనవళ్లను, మునిమనవళ్లను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు.
ఇదంతా నా ప్రతిభ అని నేను అనుకోవడంలేదు. ఎందరో దర్శకులు, టెక్నీషియన్లు తీర్చిదిద్దిన బొమ్మను. నేను నూరేళ్లు బతకాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ నాకు నటిస్తూ వుండాలనే కోరిక ఉంది. కాబట్టి... నేను నటిస్తూ ఉండాలని కోరుకుంటే ఆనందిస్తాను’’.

డా. అక్కినేని గురించి ఎమరేమన్నారంటే...
కృష్ణ: నా తొలి సినిమా ‘తేనె మనసులు’లో నన్ను హీరోగా ఎంపిక చేసిన కమిటీలో నాగేశ్వరరావుగారు ఉన్నారు. మా అందరికీ మార్గదర్శకుడాయన.

రామానాయుడు: మా సంస్థలో ఎన్నో మర్చిపోలేని చిత్రాలు చేశారు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఒక కారణం నాగేశ్వరరావుగారు.

మోహన్‌బాబు: మేమందరం చరిత్రలో రాసుకోవాల్సిన పండగ ఇది. ఆయనకు ‘భారతరత్న’ రావాలి.

చిరంజీవి: ‘నిఘంటువు’లాంటి వ్యక్తి. ఆయన స్టెప్స్ కోసం ‘దసరా బుల్లోడు’ చాలాసార్లు చూశాను.

వెంకటేష్: ఆయన సంపూర్ణమైన వ్యక్తి.

నాగార్జున: మీ అందరికీ ఆయన గొప్ప నటుడు. కానీ అమ్మకి మంచి భర్త. నాకు, నా తోబుట్టువులకు గొప్ప తండ్రి. అలాగే మా పిల్లలకు మంచి స్నేహితుడు.

అంజలీదేవి: ఆయనతో నాది విడదీయరాని బంధం.

జమున: ఈ వేడుక చూస్తే కళ్లు చెదిరిపోతున్నాయి. ఈ మహానటుడికి జరిగే సన్మానంలో పాలుపంచుకోవడం నా పూర్వజన్మ సుకృతం.

వాణిశ్రీ: నాగేశ్వరరావు మాటలు, పాటలు, నడకలు ఈనాటికీ అందరికీ ఇష్టమే. ఆయనొక ఎయిత్ వండర్.

బి.సరోజాదేవి: ఆయన దగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నాను.

మంజుల: ఇది యావత్ భారత చలనచిత్ర పరిశ్రమ జరుపుకోవాల్సిన వేడుక.

భారతి: నాగేశ్వరరావు హీరోలకు మాత్రమే కాదు.. హీరోయిన్లకూ ఆదర్శమే.

విజయనిర్మల: నేను దర్శకత్వం వహించిన సినిమాలో ఆయన నటించారు. అది నా జీవితంలో మర్చిపోలేని విషయం.

జయసుధ: అంత స్టయిలిష్ యాక్టర్ మరొకరు లేరు.

రాధిక: నాగేశ్వరరావుతో రెండు చిత్రాలు చేశాను. ఆయన్నుంచి ఎన్నో నేర్చుకున్నాను.

టీఎస్సార్: పద్మవిభూషణ్ అందుకున్న ఏకైక సినీ నటుడు అక్కినేని. లతామంగేష్కర్‌కి భారతరత్న వచ్చినట్లుగానే ఈ మహానటుడికి అది రావాలి.

Post a Comment

Previous Post Next Post