తెలుగు సినిమాకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన లివింగ్ లెజండ్ అక్కినేని నాగేశ్వరరావుకి ఈ రోజు ఘన సన్మానం జరిగింది. ఆయన సినిమా రంగానికి వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా టి.సుబ్బరామిరెడ్డి కళా పరిషత్ ఈ వేడుకను హైదరాబాదులోని లలితా కళాతోరణంలో కన్నుల పండువగా నిర్వహించింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో బాటు, సుబ్బరామిరెడ్డి, సి.నారాయణరెడ్డి, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, మోహన్ బాబు, చిరంజీవి, అక్కినేని నాగార్జున, నాటి తరం నటీమణులు వైజయంతీమాల, అంజలీదేవి, జమున, బి.సరోజ, వాణిశ్రీ, విజయనిర్మల, మంజుల, జయసుధ, సుహాసిని, రాధిక, మీనా, నేటి తరం నాయికలు అనుష్క, నయనతార, తమన్నా, సమంతా తదితర మూడు తరాల నటీనటులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఏఎన్నార్ కు తమ శుభాభినందనలు తెలిపారు.
ఆహూతులంతా అక్కినేనితో తమకున్న అనుబంధాన్ని, అక్కినేని ప్రతిభాపాటవాలను కొనియాడారు. ఈ వేడుకకు సౌత్ ఇండియా సినిమా మొత్తం తరలి రావడం ఆనందంగా ఉందనీ, అక్కినేని ఈ వయసులో కూడా ఇంకా నటిస్తున్నారంటే అది మన అదృష్టమని ముఖ్యమంత్రి అన్నారు. మనం మరచిపోలేని చిత్రాలలో అక్కినేని నటించారని రామానాయుడు అన్నారు. తాను అక్కినేనికి వీరాభిమానినని కృష్ణంరాజు పేర్కొన్నారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వంద సెంచురీలు చేసినట్టుగా అక్కినేని కూడా వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవాలనీ, తామంతా అప్పటి వేడుకకు కూడా ఉండాలనీ చిరంజీవి ఆకాంక్షించారు.
అక్కినేనితో తనకున్న సాన్నిహిత్యాన్ని నారాయణ రెడ్డి వివరిస్తూ, ఆయన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. అక్కినేనితో తనకు 46 ఏళ్ల అనుబంధం ఉందనీ, గతంలో తామిద్దరం పక్క పక్క ఇళ్లలోనే ఉన్నామనీ సుబ్బరామిరెడ్డి చెప్పారు. అక్కినేని వ్యక్తిత్వాన్ని మోహన్ బాబు వివరిస్తూ, తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను హాస్యపూరితంగా చెప్పారు. అలనాటి హీరోయిన్లు ఏఎన్నార్ తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ అక్కినేనిపై ప్రశంసల వర్షం కురిపించారు. అభినందనలతో... పూల మాలలతో ఆయనను ముంచెత్తారు. తన జీవితంలోని ఎత్తుపల్లాలను వివరిస్తూ... తనకు జరిగిన సన్మానానికి అక్కినేని వినమ్రంగా, ఆత్మీయంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకకు విచ్చేసిన వారికీ, ఈ వేడుకను తిలకించిన వారికీ జీవితంలో ఇదొక మరపురాని రోజు!
ap7am
Post a Comment