
‘‘ఈ ఉగాది నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఆ రోజున నా కెరీర్‌లో తొలిసారిగా నంది అవార్డుని స్వీకరించబోతున్నా. 2009లో వచ్చిన ‘మహాత్మ’ చిత్రంలోని నా నటనకు స్పెషల్ జ్యూరీ వచ్చింది. అలాగే ఈ ఉగాదినాడు నా పుట్టిన రోజు కూడా కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రీకాంత్. బుధవారం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో పత్రికలవారితో ముచ్చటిస్తూ తన 21 ఏళ్ల కెరీర్‌ని విశ్లేషించుకున్నారు శ్రీకాంత్.
ఆ అసంతృప్తి పోయింది
నేను ఓ పక్క సోలోగా చేస్తూనే ఇతర హీరోలతో కూడా కలిసి పనిచేస్తున్నా. చిరంజీవి, మోహన్‌బాబు, నాగార్జున, వెంకటేష్... ఇలా అందరితోనూ చేశా. బాలకృష్ణతో పనిచేయలేదనే అసంతృప్తిని ‘శ్రీరామరాజ్యం’ తీర్చింది. ఆయనతో మళ్లీ కలిసి పనిచేసే అవకాశం వచ్చినా చేస్తాను. నాగార్జున -కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘శిరిడీ సాయి’ చిత్రంలో బాబా భక్తుడైన దాసగుణ మహరాజ్ పాత్ర పోషిస్తున్నాను. అలాగే ఈ తరం హీరోలతో కూడా పనిచేయడానికి నేను సిద్ధమే.
తమిళంలో చేయాలని ఉంది
కెరీర్ తొలినాళ్లలో ఏడాదికి ఏడెనిమిది సినిమాలు చేసేవాణ్ణి. ఆ విధంగా ఈ ఏడాది మొత్తం ఎనిమిది సినిమాలు చేస్తున్నాను. సేవకుడు, అనుచరుడు, దేవరాయ, ఆల్ ది బెస్ట్, శిరిడి సాయి, షాడోతో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాను. ‘షాడో’లో పోలీసాఫీసర్‌గా చేస్తున్నాను. నా కెరీర్‌లోనే ఇది తొలి స్టయిలిష్ కేరెక్టర్ అవుతుంది. తమిళంలో కూడా చేసే ఆలోచన ఉంది. మంచి అవకాశం కోసం చూస్తున్నాం. నా పెద్ద కొడుకు రోషన్ మంచి క్రికెట్ ప్లేయర్. సినిమాల్లోకి రావాలా వద్దా అనేది వాడిష్టం.
Post a Comment