.jpg)
.jpg)
“నేను హీరో మెటీరియల్‌ని కాను. ఈ ఫేస్‌తో నేనే నటుణ్ణయ్యానంటే ఎవరైనా నటులు కావచ్చు”… ఈ మాటలు అన్నది ‘వై దిస్ కొలవరి డి’ పాటతో ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన జాతీయ ఉత్తమ నటుడు ధనుష్. ఆ పాట ఉన్న ’3′ సినిమా తెలుగు వెర్షన్ ఆడియో సీడీల విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రుతీహాసన్ జంటగా ధనుష్ నటించిన ఆ సినిమా ఆడియో సీడీలు సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లో విడుదలయ్యాయి. రజనీకాంత్ పెద్ద కుమార్తె, ధనుష్ భార్య ఐశ్వర్య దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఆర్.కె. ప్రొడక్షన్స్, వండర్‌బార్ ఫిలిమ్స్ పతాకాలపై కె. విమలగీత, నట్టి కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకుడు.
మంగళవారం రాత్రి ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు ఆడియో సీడీలను ఆవిష్కరించి, తొలి ప్రతిని హీరోలు రాజశేఖర్, రానా, ధనుష్‌లకు అందజేశారు. అతి తక్కువ కాలంలో ధనుష్ వరల్డ్ ఫేమస్ అయ్యాడనీ, అతనింకా పైకి రావాలనీ రామానాయుడు ఆకాంక్షించారు. ‘కొలవరి డి’ పాట ఇంత పెద్ద హిట్టవుతుందని అనుకోలేదనీ, అదలా జరిగిందనీ, ఈ సినిమాకి సంగీతాన్నివ్వడం గొప్ప అనుభవమనీ అనిరుధ్ తెలిపారు.
‘కొలవరి డి’ పాటతో ’3′ సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయనీ, ఆ అంచనాల్ని సినిమా అందుకుంటుందనే నమ్మకం ఉందనీ శ్రుతీహాసన్ అన్నారు. ’3′ సినిమా పెద్ద హిట్టవుతుందని దేవుడు ఎప్పుడో రాసేశాడని నిర్మాత విమలగీత అన్నారు. హీరో రానా మాట్లాడుతూ “శ్రుతి తండ్రి కమలహాసన్ నాకు దైవసమానుడు. శ్రుతి అంటే నాకు చాలా ఇష్టం. ఇంత ప్రతిభ ఉన్న ధనుష్ ప్రపంచవ్యాప్తంగా పాపులరవడం సంతోషంగా ఉంది.
తమిళంలో కంటే తెలుగులో ’3′ పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నా” అని చెప్పారు. ‘కొలవరి డి’ పాటే ఇంత సంచలనం సృష్టిస్తే, ఇక ’3′ సినిమా ఏం చేస్తుందో చూడాలని హీరో శ్రీహరి అన్నారు. దర్శకురాలు ఐశ్వర్య మాట్లాడుతూ “నేను తన భార్యనని ధనుష్ ఈ సినిమా చేయలేదు. స్క్రిప్టు నచ్చే చేశాడు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తా” అన్నారు.
హీరో ధనుష్ మాట్లాడుతూ “ముందుగా ‘కొలవరి డి’ పాటను మేం ప్లాన్ చేయలేదు. ఆ పాట నాకు తగిలింది కాబట్టి నాకు పేరొచ్చింది. నా స్థానంలో ఎవరున్నా వాళ్లకి పేరొచ్చేది. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ణి. ఆ పాట క్రెడిట్ అంతా అనిరుధ్‌కే దక్కుతుంది. ఈ సినిమాకి సంబంధించి ఐశ్వర్య నాకు భార్యకాదు. మరో డైరెక్టర్ మాత్రమే. నాకు హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు అన్నవి ప్రధానం కాదు. ప్రధానమైంది స్క్రిప్టే. నేను జన్మతః నటుణ్ణి కాను. ఈ స్థాయికి రావడం కోసం ఎంతో కష్టపడ్డా” అని చెప్పారు.
Post a Comment