Home » » Nippulanti Manishi 100th Show in Tenali -Ntr Sathabdhi Event

Nippulanti Manishi 100th Show in Tenali -Ntr Sathabdhi Event

 ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్రోత్సవంలో భాగంగా బుధవారం తెనాలి: పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్ లో 100వ ప్రదర్శనగా ప్రదర్శింపబడుతున్న సినిమా "నిప్పులాంటిమనిషి". 



ఈ సినిమాకి ఎన్టీఆర్ సినీ జీవితంలో కానీ, తెలుగు చలనచిత్ర చరిత్రలో గాని, భారతదేశంలోని సినిమా హీరోలందరి జీవనయాత్రలో గాని ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత గల సినిమాగా  విశిష్ట స్థానం ఉంది.


ఇది ఎన్టీఆర్ చలనచిత్ర జీవిత రజతోత్సవ చిత్రం! అంటే ఆయన సినిమా రంగ ప్రవేశం చేసిన తరువాత విడుదలైన మొదటి సినిమా "మన దేశం" నుండి హీరోగా 25 సంవత్సరాల కాలం పూర్తి చేసుకుంటున్న సమయంలో వచ్చిన ప్రత్యేకమైన సినిమా! 


సలీం జావేద్ లు రచించిన ప్రకాష్ మెహ్రా బాలీవుడ్ సినిమా "జంజీర్" కు రీమేక్. హిందీలో 30 ఏళ్ల వయసులో అమితాబ్ బచ్చన్ ధరించిన యాంగ్రీ యంగ్ మాన్ పాత్రను 52 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ ధరించి, మెప్పించి సక్సెస్ సాధించడం విశేషం! అపూర్వం! అదే అమితాబ్ బచ్చన్ కు 52 ఏళ్ల వయసు వచ్చేనాటికి ఆయన కెరీర్లో ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తిచేసి గ్యాప్ తీసుకుని "బడేమియా చోటేమియా" లాంటి సినిమాలలో అప్పటి యంగ్ హీరో ల ప్రక్కన వయసు మీరిన పాత్రలు ధరిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఉన్నారు.


ఈ సినిమా తెలుగులో తీస్తున్న సమయానికి దేశంలో 50 ఏళ్ల వయసు దాటిన హీరోలంతా రిటైర్మెంట్ లేదా ప్రొఫెషన్ చేంజ్ లాంటి కార్యక్రమాలలో ఉన్నారు. దిలీప్ కుమార్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చి సినిమాలు మానేసి ఉన్నారు. రాజ్ కపూర్ సినిమాలలో నటించడం మానేసి దర్శకత్వం వైపు పూర్తిగా ఫిక్స్ అయ్యారు. ఎంజీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికై తర్వాత అన్నాడీఎంకే అని సొంతగా పార్టీ పెట్టి రాజకీయాలలో కొనసాగుతూ, సినిమా కెరీర్ ని సెకండ్ ప్రిఫరెన్స్ గా కొనసాగిస్తున్నారు. శివాజీ గణేషన్ వంటి వారు 50 కి సమీపించక ముందే కొత్త హీరోల జోరుతో నెమ్మదించి ఉన్నారు. ఇక మన అక్కినేని హార్ట్ ఆపరేషన్ తో విశ్రాంతిలో ఉండడంతో, ఆయన సినిమాలు మానేస్తున్నారని పుకార్లు షికారు చేస్తూ ఉన్నాయి. ఆ సమయంలో ఏ ప్రెస్ మీట్ లో అయినా ఎన్టీఆర్ కి విలేకరుల నుండి హీరోగా రిటైర్మెంట్ ఎప్పుడు అనే ప్రశ్నలే ఎదురవుతూ వస్తున్న సమయం అది. ఇక్కడ కూడా యంగ్ హీరోలు విజృంభిస్తున్న సమయం. ఆ సమయంలో వచ్చి 50 ల వయసు తర్వాత కూడా హీరోలుగా జైత్రయాత్ర సాగించవచ్చని, జనం ఆదరిస్తారని దేశానికి అంతటికి నిరూపించి, చరిత్రపై ఎన్టీఆర్ చేసిన సంతకమే ఈ "నిప్పులాంటిమనిషి".! ఈ సినిమా నే సంజీవని మంత్రంలా పనిచేసి తరువాత కాలంలో 50 ఏళ్లు దాటిన హీరోలు అందరికీ కెరీర్ కొనసాగించే దారి చూపిన ప్రాతఃస్మరణీయ చిత్రం! అలాగే ఎన్టీఆర్ ప్రాతఃస్మరణీయ నటుడిగా నిలిచారు!


అంతేగాక తెలుగులో డ్యూటీ ఓరియెంటెడ్ పోలీస్ స్టోరీ క్యారెక్టర్ సినిమాలకు ఇదే ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది! అప్పట్లో తెలుగులో అందరూ హిందీ రీమేక్ల వెంట పరుగెత్తే పరిస్థితిని కల్పించిన సినిమా కూడా ఇదే!


అన్నింటినీ మించి హీరోకి పాటలు లేకుండా సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఏకైక సోషల్ పిక్చర్ గా తెలుగు సినిమా చరిత్రలో నేటికీ నిలిచి ఉంది! హీరోకి పాటలు లేకుండా సక్సెస్ లు సాధించడం తమిళంలో, హిందీలో తరచుగా జరుగుతుంటుంది గాని.. తెలుగులో అది అనేక సినిమాల ద్వారా  ఒక్క ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యమైన విషయం! ఆ విషయంలోనూ ఈ సినిమాది శిఖరాగ్రస్థానం!


ఇన్ని ప్రత్యేకతలు ఉన్న సినిమా ఈ శతజయంత్యుత్సవాలలో శత చిత్ర ప్రదర్శనగా రావడం వెరీ నోస్టాలజిక్ అండ్ మెమోరబుల్ మూమెంట్!

🙏🙏🙏


Share this article :