Home » » 17years For Premisthe

17years For Premisthe

 'ప్రేమిస్తే' మూవీకి 17 ఏళ్లు

 


'ప్రేమిస్తే' మూవీ రిలీజ్ అయి పదిహేడేళ్ళు పూర్తి అయ్యాయి. పదిహేడేళ్ళ క్రితం అక్టోబర్  12న ప్రేమిస్తే చిత్రం విడుదలైంది. తెలుగు సినిమా చరిత్రలో మరో చరిత్ర, సీతాకోకచిలుక ఎలా అయితే మైలు రాళ్ళుగా నిలిచాయో అలాగే ప్రేమిస్తే చిత్రం అజరామర ప్రేమ కావ్యంగా మిగిలిపోయింది. ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రొడ్యూసర్ గా ఎస్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మించిన కాదల్ చిత్రాన్ని నిర్మాత సురేష్ కొండేటి ప్రేమిస్తే పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి బుధవారంతో పదిహేడేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సినిమాతోనే అప్పటివరకు జర్నలిస్ట్, పబ్లిషర్, డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న సురేష్ కొండేటి నిర్మాతగా మారారు. నిర్మాతగా మారకముందు వెస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూటర్ గా పలు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో మారుతితో మంచి పరిచయం ఏర్పడగా ఆయన కాదల్ సినిమాను చూసి తెలుగులో మనం రిలీజ్ చేద్దామని చూపించారు. ఆ సినిమా చూసిన వెంటనే డబ్బింగ్ రైట్స్ తీసుకోవాలని డిసైడ్ అయినా చాలా మంది ఆ సినిమా చేయొద్దని భయపెట్టారట. అయితే చిరంజీవి గారు సంతోషం రెండవ వార్షికోత్సవ సంబరాల్లో నువ్వు నిర్మాతగా మారితే చూడాలనుంది సురేష్ అని చెప్పడంతో ఆయన కోరిక మేరకు సురేష్ కొండేటి నిర్మాతగా మారారు. ఇక నేటి టాప్ డైరెక్టర్ మారుతి గతంలో ఈ ప్రేమిస్తే సినిమా లేకపోతే నేను అసలు ఇండస్ట్రీలో కనిపించేవాడ్ని కాదని, డిస్ట్రిబ్యూటర్ గా నేను పని చేస్తున్న రోజుల్లో కాదల్ అనే తమిళ సినిమాని చూడగా బాగా కనెక్ట్ అయిందట. ఎలా అయినా తెలుగులో చేయాలని డిసైడ్ అయ్యి సురేష్ గారిని కలిసి సినిమా చూపించి ఆయనతో కలిసి ప్రేమిస్తే పేరుతో తెలుగులో రిలీజ్ చేశారట. అలా ఆ సినిమా ఎన్నో లాభాలు తెచ్చిపెట్టడమే కాక సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసిందని అంటూ ఉంటారు. 

 

సమాజంలో మనం ఎక్కడో ఒక చోట మనం నిత్యం చూస్తూ ఉండే కథనే సినిమాగా తీస్తే మనకు చాలా బాగా నచ్చి సూపర్ హిట్టు అయింది ప్రేమిస్తే. ప్రేమించిన అమ్మాయి దక్కలేదని అబ్బాయి పిచ్చోడు అవ్వడం క్లైమాక్స్ లో నిజంగా గుండెలకు హత్తుకుంటుంది. మురళీ(భరత్) ఒక మెకానిక్ ఐశ్వర్య(సంధ్య) ఒక వైన్ షాప్ ఓనర్ కూతురు. మురళీ ని ప్రేమిస్తుంది. ఆ పేదవాడి ప్రేమలో నిజాయితీ నచ్చి ఆ ప్రేమికుల మధ్య కాలం క్షణంలా సాగిపోతుండగా, ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని ఇద్దరూ ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతారు. వేరే ఊర్లో కలిసి బ్రతుకుతుండగా ఇంట్లో వాళ్ళు తెలుసుకొని మీకు పెళ్లి జరిపిస్తాం అని చెప్పి తీసుకొచ్చి మురళిని కొట్టి ఐశ్వర్యకు వేరే అబ్బాయితో పెళ్లి జరిపిస్తారు. ఆ బాధతో మురళీ పిచ్చోడు అయిపోతాడు. ఈ కథలో పిల్లల ప్రేమ, పెద్దల మోసం, ప్యూర్ లవ్ తాలుకా ఎమోషన్ తప్ప మరేది ఉండదు, కానీ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎందుకో తెలుసా, ఈ సినిమాలో ఒక నిజాయితీ ఉంది, దర్శకుడు తను చెప్పాలనుకున్నది క్లారిటీగా ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పారు. మనం ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు తప్పకుండా చర్చించవలసిన మరో రెండు డిపార్టమెంట్ లు కెమెరా అండ్ సంగీతం. విజయ్ మిల్టన్ అందించిన కెమెరా వర్క్ అయితే సినిమాను స్క్రీన్ ప్లే జతకలిసిన ఒక పెయింటింగ్ లా చూపించింది. నేటివిటి కూడా అత్యద్భుతంగా ఉంటుంది. సంగీతం అందించిన జాషువా శ్రీధర్ ని కూడా మనం అభినందించకుండా ఉండలేము. తను మనకు అందించిన ఒక్కక్క సాంగ్ ఒక ఆణిముత్యం, ప్రతి సీన్ లో ఎలివేట్ అయ్యే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకు ప్రాణం పోసింది అని చెప్పుకోవచ్చు. ఇక చివరిగా బాలాజీ శక్తివేల్, తీసుకున్న కథ మాములుదే అయినా దానిని ఎలా చెప్తే ప్రేక్షకులు ఒప్పుకుంటారో కరెక్ట్ గా తెలిసిన డైరెక్టర్ అని అనడంలో ఎలాంటి సందేహం లేద. క్లైమాక్స్ లో తన వల్ల మురళీ పిచ్చోడు అయిపోయాడు అని ఐశ్వర్య రోడ్డున కూర్చొని బిగ్గరగా ఏడుస్తుంటే అది చూసి వచ్చిన ఐశ్వర్య భర్త మురళీని ఐశ్వర్య ను కలిపి ఇంటికి తీసుకెళ్ళే సీన్ తో ప్రేక్షకులు అంతసేపు బాధ పడినప్పటికీ ఆ ఒక్క సీన్ తో సినిమాకు బాగా కనెక్ట్ అయి సినిమాను సూపర్ డూపర్ హిట్టు చేశారు. తమిళంలో సూపర్ సక్సెస్ సాధించి ఖర్చు పెట్టిన బడ్జెట్ కి పదింతలు లాభం తెచ్చి పెట్టిన ఒక క్లాసికల్ పెయిన్ ఫుల్ లవ్ స్టొరీని తెలుగు ప్రేక్షకులకు మనకు అందించారు  సురేష్ కొండేటి. ఈ సినిమాకు దర్శకుడు మారుతి ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించగా ఏస్.కే పిక్చర్స్ బ్యానర్ పై తెలుగులో కూడా విడుదల చేసి తెలుగు ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమా అందించారు. ఈ సినిమా సెలబ్రిటీ ప్రీమియర్ సమయంలో ఛార్మీ కన్నీళ్లు పెట్టుకోడవం ఈ గమనార్హం. ఈ సినిమా తమిళం లో కంటే తెలుగులో ఇంకా పెద్ద ఘన విజయం సాధించడం విశేషం.


Share this article :