Home » » Pawan Kalyan Congratulates Padma Awardees

Pawan Kalyan Congratulates Padma Awardees

పద్మ పురస్కారాలకు ఎంపికైనవారికి అభినందనలు 



గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారగ్రహీతల్లో స్థానం పొందిన తెలుగువారికి నా తరఫున జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. కోవిడ్ మహమ్మారిని అదుపు చేసేందుకు విస్తృత ప్రయోగాలు చేసి వ్యాక్సిన్ ఆవిష్కరించి ప్రపంచానికి అందించి... మన దేశ పరిజ్ఞాన విశిష్టతను చాటిన భారత్ బయోటెక్ సంస్థ కృషికిగాను ఆ సంస్థ వ్యవస్థాపకులు డా.కృష్ణ ఎల్లా, శ్రీమతి సుచిత్ర ఎల్లాలకు పద్మభూషణ్ పురస్కారం దక్కడం ముదావహం. సాఫ్ట్ వేర్ రంగంలో తెలుగువారి ఖ్యాతి చాటిన మైక్రోసాఫ్ట్ సి.ఈ.ఓ. శ్రీ సత్య నాదెళ్ళతోపాటు గూగుల్ సీఈవో, మన దక్షిణ భారతీయుడు శ్రీ సుందర్ పిచాయ్, కోవిడ్ వ్యాక్సిన్ అందించిన సీరం సంస్థ ఛైర్మన్ శ్రీ సైరస్ పూనావాలా పద్మభూషణ్ అవార్డుకు ఎంపికచేయడం సముచితం. దేశ రక్షణ కోసం విశిష్ట సేవలందించి ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ శ్రీ బిపిన్ రావత్ కు పద్మవిభూషణ్ ప్రకటించి ఆయన సేవలకు సార్థకత కలిగించారు.

తెలుగు సాహిత్యం, ఆధ్యాత్మిక అంశాలపై సాధికారత కలిగిన ప్రవచనకర్త, అవధాని శ్రీ గరికపాటి నరసింహారావు, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు, పోలియో నిర్మూలన మిషన్ లో కీలకంగా వ్యవహరిస్తూ పేదలకు వైద్యం అందించే డా.సుంకర ఆదినారాయణరావు, అరుదైన కిన్నెర వాయిద్యంపై సంగీతం పలికించే శ్రీ దర్శనం మొగులయ్య, ప్రముఖ కూచిపూడి నృత్యకళాకారిణి శ్రీమతి పద్మజా రెడ్డి, కళాకారులు శ్రీ రామచంద్రయ్య, ప్రముఖ నటి శ్రీమతి షావుకారు జానకి గార్లను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. భద్రాచలం దేవాలయం ఆస్థాన విద్వాంసులుగా సేవలందించిన నాదస్వర కళాకారులు దివంగత గోసవీడు షేక్ హసన్ గారిని పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం ద్వారా ప్రచారానికి దూరంగా కళా సేవ చేసేవారిని, సంఘ సేవకులను శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గుర్తిస్తుంది అని మరోసారి వెల్లడైంది.


(పవన్ కళ్యాణ్)


Share this article :