Home » » Avasarala Srinivas Interview About 101 Jillala Andagadu

Avasarala Srinivas Interview About 101 Jillala Andagadu

 నూటొక్క జిల్లాల అందగాడు చూసి... ఒక్కరు మారినా సంతోషిస్తా

- అవసరాల శ్రీనివాస్‌ 



*నూటొక్క జిల్లాల అందగాడు గురించి చెప్పండి?

- మనకి గుర్తున్నట్టయితే, ఈ సినిమా 2019 అక్టోబర్‌లో ఓపెన్‌ చేశాం. అప్పటికి హిందీలో బాలా రాలేదు. అయితే బాలా వస్తోందని, ఆ సినిమాతో పోటీ పడి చేసి రిలీజ్‌ చేద్దామనుకున్నాం. కానీ కుదర్లేదు. బాలాకి కూడా హిందీలో ఉజ్డా చమన్‌  పోటీకొచ్చింది. ఇన్నిటి మధ్య  పోటీ పడలేమని ఏప్రిల్‌లో వద్దామనుకున్నాం. మార్చిలో లాక్‌డౌన్‌ వచ్చేసరికి పోస్ట్ పోన్‌ అయింది. అందుకే మనం ఇప్పుడు వస్తున్నాం.

* బాలా చూశారా మీరు?

- బాలా వచ్చినప్పుడు వెళ్లి చూశాను. అయితే ఆ సినిమా చూశాక, నూటొక్కజిల్లాల అందగాడులో  మార్పులు చేయలేదు. మనల్ని మనం ఉన్నదున్నట్టుగా యాక్సెప్ట్ చేయాలనే విషయంలో మాత్రం రెండు సినిమాల్లోనూ సిమిలారిటీ కనిపిస్తుందేమో. అంతకు మించి దేనికదే సెపరేట్‌గా ఉంటుంది. అందుకే, చేంజెస్‌ అవసరం లేదనుకున్నా. కానీ బాలా కన్నా ముందు ఈ సినిమా వచ్చి ఉంటే బావుండేది. ఇప్పుడు అందరూ ఒరిజినలా కాదా? అని అడుగుతున్నారు.

* ఈ కథకి ఇన్‌స్పిరేషన్‌ ఏంటి? 

- కథకి ఇన్‌స్పిరేషన్‌ అంటూ ఏమీ లేదు. మన సొసైటీలో కాస్త కలర్‌ తక్కువగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా... కామెడీ చేస్తుంటారు. ఒకసారి నేనొక పెళ్లికెళ్తే.. పెళ్లికొడుకు ఎంత అసహ్యంగా ఉన్నారో పెళ్లి కూతురు వాళ్లు పాడుతున్నారు. ఇటువారు అమ్మాయి గురించి పాడుతున్నారు. మన సొసైటీలో బాడీ షేమింగ్‌ ఎప్పటినుంచో ఉంది. ఇది కొంతమంది కాన్పిడెన్స్ దెబ్బతీస్తుంది.  కొందరు ఎఫెక్ట్ అయినవాళ్లున్నారు. నిజానికి బట్టతల అనేది కాన్ఫిడెన్స్ దెబ్బతీయాల్సిన విషయం కాదు.

* క్రిష్‌తో ఎలా అసోసియేట్‌ అయ్యారు?

- కథను ఒకసారి క్రిష్‌గారికి చెబితే బావుందన్నారు. తర్వాత 2018లో కలిసినప్పుడు 'ఆ కథ చెప్పావు బావుంది... టీవీల్లోనూ ఇది కరెక్ట్ కాదని చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు చేద్దాం' అన్నారు. సరేనని చేశాం.

* లడ్డూబాబు, సైజ్‌ జీరోకి రిలేటెడ్‌గా ఉంటుందా ఈ సినిమా?

- ఒక్కొక్కరి టేక్‌ ఒక్కోలా ఉంటుంది. ఈ సినిమాలో కాస్త హ్యూమర్‌ ఎక్కువగా ఉంటుంది.

* మీరు డైరక్ట్ చేయాలనుకోలేదా? 

- నేను మూడో సినిమా ఆల్రెడీ మొదలుపెట్టేశాను. అది సగంలో ఉంది. మిగిలిన సగం అమెరికాలో షూట్‌ చేయాలి. ఒక సినిమా సగంలో ఉండగా ఇంకో సినిమా డైరక్ట్ చేయడం రైట్‌ కాదనిపించింది.

* విద్యాసాగర్‌కి కథ చెప్పగానే ఏమన్నారు?

- ఆయన నా అసోసియేట్‌ డైరక్టర్‌. రాజీవ్‌రెడ్డిగారికి కథ  చెప్పినప్పుడు... ఈ కథకి విద్యాసాగర్‌ పూర్తి న్యాయం చేస్తారని చెప్పా. ఆ తర్వాత కూడా రెండు నెలలు... నేను, విద్యాసాగర్‌ డిస్కషన్స్  చేసుకున్నాం.  ఆ తర్వాతే ఆయన ఆన్‌బోర్డ్ వచ్చారు. ఆయన మంచి రైటర్‌. త్వరలోనే ఓన్‌ కథతో సినిమా చేస్తారు.

* మీ అసోసియేట్‌ అంటున్నారు. మీరే ఒక డైరక్టర్‌. ఆయనకు ఎంత వరకు ఫ్రీడమ్‌ ఇచ్చారు?

- నేను డైరక్ట్ చేసినప్పుడు కూడా నా నటులతో కొలాబరేషన్‌లాగానే ఫీలవుతాను. డైరక్టర్‌కి, యాక్టర్‌కీ ఆ కమ్యూనికేషన్‌ ఉన్నప్పుడే బావుంటుంది. సెట్లోకి నేరుగా వెళ్లి ఇప్పుడు ఏం చేయాలని అడిగితే అప్పుడు మన పర్సనాలిటీ బయటకు వస్తుందే కానీ, కేరక్టర్‌ ఎలివేట్‌ కాదు. ఇది ఆయన సినిమా. 

*క్రిష్‌కి కథ ఎప్పుడో చెప్పా అంటున్నారు... స్టేల్‌ అయ్యే ఛాన్సుల్లేవా?

- క్రిష్‌కి కథ చెప్పేటప్పుడు నేను జ్యో అచ్యుతానంద కథ రాస్తున్నా. అదే బ్యానర్‌లో సినిమా తీసి, ఇది చేద్దామనుకున్నా. దీన్ని కూడా థర్డ్ ఫిల్మ్ అయ్యాక చేద్దామని అనుకున్నా. కానీ నా మూడో సినిమా కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది.  విజిటర్స్ వీసాల మీద సినిమాలు షూట్‌ చేయడానికి లేదు. వర్క్ వీసాలు క్రూ మొత్తానికి అప్లై చేయడానికి 6-7 నెలలు పట్టింది. ఈలోగా ఖాళీగా ఉండటం ఎందుకని ఈ సినిమా చేశాం. మళ్లీ వీసాలకు వెళ్లాలని అనుకున్నప్పుడు లాక్‌డౌన్‌ వచ్చింది.

* ఈ టైటిల్‌ ఎలా చూజ్‌ చేసుకున్నారు?

- నూటొక్క జిల్లాల అందగాడు అనగానే మనకు నూతనప్రసాద్‌గారు గుర్తుకొస్తారు. నేను ఫస్ట్ రాసుకున్నప్పుడు అందమే ఆనందం అని టైటిల్‌ అనుకున్నా.  నేనిచ్చిన నాలుగు టైటిల్స్ లో ఇది క్రిష్‌కి బాగా నచ్చింది. జనాల్లో కూడా ఈ టైటిలే బాగా రీచ్‌ అయిందన్నారు. చాలా మంది కథ... చాలా మంచి కథ అని ట్యాగ్‌ లైన్‌ పెట్టుకున్నాం.

*రుహానీ శర్మను తీసుకోవడానికి రీజన్‌ ఏమైనా ఉందా?

- నేను చిలసౌ సినిమా చూశా. ఆ తర్వాత నేను వేరే కథ కోసం ఆ అమ్మాయిని చూశా. అప్పుడు వర్కవుట్‌ కాలేదు. ఈ సినిమా కోసం దిల్‌ రాజుగారి దగ్గర చెప్పిన పేర్లలో ఈ అమ్మాయి పేరు కూడా ఉంది. ఈ అమ్మాయి పేరుకు నిర్మాతలు కూడా ఓటు వేశారు.

* బట్టతల మీద తీశారు. ఎవరి మనోభావాలు దెబ్బతినవు కదండీ?

-  తినవండీ. ఇందులో ఎక్కడా ఎవరినీ కించపరచడం లేదు. అదే జరిగితే నిజంగా నేను ఫ్లాప్‌ అయినట్టే. టీజింగ్‌.... హ్యూమర్‌ కాదని చెప్పాలన్నదే నా పర్పస్‌. శిరీష్‌గారు ఎడిట్‌ రూమ్‌లో చూసి... 'నా ఫ్రెండ్స్  చాలా మంది బట్టతలల వాళ్లున్నారు. వాళ్ల మీద జోకులు వేసేవాడిని. ఇంక వేయను" అని అన్నారట. నాతో అనలేదు. పక్కవాళ్లతో అన్నారు. ఈ సినిమా చూశాక ఎవరైనా పక్కవారిని ఇంకా కామెడీ చేస్తే సినిమా సక్సెస్‌ అయినా, ఫెయిల్యూర్‌ అన్నట్టే.

* బట్టతల ఉన్నవాళ్లతో మీరేమైనా ఇంటరాక్ట్ అయ్యారా? 

- లేదండీ. నాకు నల్లగా ఉన్నవాళ్ల గురించి తెలుసు. నలుపు వేరు. బట్టతల వేరు. బట్టతల ఉన్నవాళ్లు నరకయాతన పడుతుంటారు. నేను మెసేజ్‌ చెప్పాలని అనుకోలేదు. నాకు అనిపించింది, ఎక్స్ ప్లోర్‌  చేస్తూ తీశా. అది చూసిన వాళ్లకి మెసేజ్‌లా అనిపిస్తే ఓకే. అంతేగానీ నేనేం చెప్పాలనుకోలేదు.

* ఈ సినిమాతో సొసైటీలో మార్పు వస్తుందనుకుంటున్నారా?

- ఒక్క సినిమాతోప్రపంచంలో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావు. అవేర్‌నెస్‌ స్టెప్‌ బై స్టెప్‌ బిల్డ్ అయితే బావుంటుంది.

* ఫక్తు కామెడీ సినిమానా? 

- చాలా మంది ఉన్న కామెడీ అంతా ట్రైలర్‌లో పెట్టేస్తుంటారు. సినిమాకి వచ్చిన వారు ట్రైలర్‌ కన్నా ఎక్కువ ఎంజాయ్‌  చేయాలని నా ఫీలింగ్‌. మనసులో నుంచి హ్యూమర్‌ రాకుంటే వెంటనే మర్చిపోతుంటారు. ఈ సినిమాలో ఉన్న హ్యూమర్‌ అంతా ఎమోషన్‌ నుంచి వచ్చే హ్యూమరే. లాంగ్విటీ ఉంటుందని నమ్ముతున్నా.

*ఇండస్ట్రీకి వచ్చి చాన్నాళ్లయింది. స్లోగా సినిమాలు చేస్తున్నారు?

- నా సినిమాలు నేనే రాసుకుంటా. ఊహలు గుసగుసలాడేకి 3 ఏళ్లు పట్టింది. జో అచ్యుతానందకు రెండేళ్లు పట్టింది. నెక్స్ట్ సినిమాకు మళ్లీ రెండేళ్లు పట్టింది. స్క్రిప్ట్ కి కనీసం ఏడాది పడుతుంది రాయాలంటే. నాక్కూడా కంగారు లేదు. నచ్చడం, నచ్చకపోవడం అనేది కాదు కానీ, టీమ్‌ని పెట్టి వండించాలని అనుకోను.  ఏం కథ చెప్పాలనిపిస్తోంది... ఎంత కన్విన్సింగ్‌గా చెప్పగలం అనేది ఇంపార్టెంట్‌. 

ఈ కథ నాది కాదు... అనిపిస్తే నేను సినిమా చేయలేను. 

* బాబు బాగా బిజీ నచ్చే చేశారా?

- బాబు బాగా బిజీ నచ్చే చేశాను. ఫ్యామిలీస్‌ ఇబ్బందిపడ్డారని తెలుసు. కానీ నేను నటుడిగా నటించానంతే. నటుడిగా ఇమేజ్‌కి ఇరుక్కుపోవడం నాకు నచ్చదు. జెంటిల్మేన్‌లో విలన్‌గా చేశా. నటుడిగా ఎక్స్ ప్లోర్‌ కావాలనే చేశాను.

*మీరేం కావాలని అనుకుంటున్నారు?

- నేనేమవ్వాలో అది అయిపోయాను. నాకు రైటింగ్‌లోనే శాటిస్‌ఫ్యాక్షన్‌. సినిమాలన్నీ రైటింగ్‌ టేబుల్‌; ఎడిటింగ్‌ టేబుల్‌ మీద జరుగుతాయని నా ఫీలింగ్‌. నేను స్ట్రెస్‌ ఫీలయింది డైరక్షన్‌లో. రాసింది తీసింది తక్కువైనా నన్ను జనాల్లోకి బాగానే తీసుకెళ్లాయి.


*అందం గురించి మీ మైండ్‌లో విశ్లేషణ ఎలా ఉంటుంది?

- ఒక మనిషి ఇంకో మనిషితో ఇంటరాక్ట్ అయినప్పుడు... ఒక లెవల్‌ దాటరు. అది దాటగలిగిందే అందం అనుకుంటా. 

* ఇప్పుడు చేతిలో ఉన్న ప్రాజెక్టులు ఏంటి?

- నా దగ్గర నాలుగు కథలున్నాయి. రైటింగ్‌ మీద కాన్‌సెన్‌ట్రేట్‌ చేసుకున్నా. నాకు కొన్ని కమిట్‌మెంట్స్ ఉన్నాయి. ఆ నాలుగు కథల్లో దేన్ని ముందుకు తీసుకెళ్తే బావుంటుందో దాన్ని బట్టి ఎలాబరేట్‌ చేసి రాస్తాను.

* ఓటీటీల వల్ల సెన్సార్‌ ప్రాబ్లెమ్స్ కూడా ఉండవు కదా?

- నేను ఇప్పటివరకు తీసిన సినిమాల్లో నాకెప్పుడూ సెన్సార్‌కి ప్రాబ్లమ్‌ రాలేదు. నా సెన్సార్‌ యాక్చువలీ ప్రజలే. ఓటీటీలో తీసినప్పటికీ,  నా కథల్లో అభ్యంతరాలు ఉండవని నా ఫీలింగ్‌. వయలెన్స్ నాకు పెద్ద నచ్చదు.

* క్రిష్‌ ఉండటం వల్ల నూటొక్క జిల్లాల అందగాడుకు హైప్‌ వచ్చిందనుకుంటారా?

- క్రిష్‌ ఉండటం వల్ల హైప్‌ వచ్చిన మాట నిజమే. క్రిష్‌గారు బండిల్‌ ఆఫ్‌ ఐడియాస్‌. ఒక్క ఐడియా రెండో సారి చెప్పరు. 'నేను చెప్తున్నాను... నచ్చితే వినండి. లేకుంటే పెక్కనపెట్టండి" అంటారు. ఎడిటింగ్‌లో ఆయన ఇచ్చిన ఇన్‌పుట్స్ యూజ్‌ అయ్యాయి. ఆయనకు డ్రమటిక్‌ సెన్స్ ఉంది. రిథమ్‌ తెలుసు.

* మీరు డైరక్ట్ చేస్తున్న మూడో సినిమా గురించి చెప్పండి?

- 10 ఏళ్ల టైమ్‌ పీరియడ్‌లో జరిగే సినిమా. 7 డిఫరెంట్‌ లుక్స్ ఉంటాయి. ఎంత గ్యాప్‌ వస్తో లుక్‌లో పర్ఫెక్షన్‌ ఉంటుంది. నాగశౌర్య చేస్తున్నాడు. 50 శాతం పూర్తయింది. ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి చేస్తున్నాం. 2022లో అవుతుందేమో.ఇది సీరియస్‌ సినిమా. డైలాగులు కూడా సింక్‌ సౌండ్‌లో చేశాం. ఇది కంటెంట్‌... మీరు మాట్లాడుకోండి అన్న టైప్‌లో చేస్తున్నాం.

* మ్యూజిక్‌ గురించి చెప్పండి?

- శక్తికాంత్‌గారు చేశారు. కథ చెప్పిన 10 నిమిషాల్లో పార్ట్ అయ్యారు. 

* మీ సినిమాల్లో కామెడీ మస్ట్ గా ఉంటుందా?

- ప్రతి సినిమాలోనూ నాకు కామెడీ ఉండటం ఇష్టం.  ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు నవ్వించి చెప్తే తప్పేముంది? అనిపిస్తుంది. 

* మీ టార్గెట్‌ ఏంటి?

- నాకు టార్గెట్స్ లేవు. నెక్స్ట్ సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తా.

* వెబ్‌ సీరీస్‌ చేస్తున్నట్టున్నారు?

- అమెజాన్‌ ప్రైమ్‌కి నిత్యామీనన్‌ లీడ్‌లో  షో రన్నర్‌గా చేస్తున్నా. కుమారి శ్రీమతి అని టైటిల్‌ అనుకున్నాం. అక్టోబర్‌ నుంచి షూట్‌ స్టార్ట్ అవుతుంది


Share this article :