అర్జున్ దాస్ వర్సెస్ శాండీ మాస్టర్.. ద్విభాషాచిత్రంగా రాబోతోన్న 'సూపర్ హీరో బాబు' ఫస్ట్ లుక్ విడుదల
అర్జున్ దాస్, శాండీ మాస్టర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సూపర్ హీరో బాబు' (తమిళంలో ‘సూపర్ హీరో’). ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత నిర్మాత కె.ఎస్. సినిష్ 'సోల్జర్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ' బ్యానర్‌పై సమర్పిస్తుండగా 'రెడాక్టెడ్ స్టూడియోస్'కు చెందిన శంజన్ జి సంయుక్తంగా నిర్మించారు. తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా ‘సూపర్ హీరో బాబు’ రాబోతోంది. 'బెలూన్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కె.ఎస్. సినిష్ ‘డిక్కిలూనా’, ‘పార్కింగ్’తో నిర్మాతగానూ మంచి పేరు సంపాదించుకున్నారు. నిర్మాతగా సినిష్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కంటెంట్ ఉన్న కథతో 'సూపర్ హీరో'ని నిర్మించారు.
అర్జున్ దాస్‌కి తెలుగులో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఓజీతో అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి అర్జున్ దాస్ 'సూపర్ హీరో బాబు' చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్ తేజు అశ్విని, అర్జున్ దాస్ సీన్స్ ఈ మూవీకి హైలెట్ కానున్నాయి. మరో వైపు శాండీ మాస్టర్ ప్రస్తుతం నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయారు. ‘లోక చాప్టర్ 1’, ‘కిష్కిందపురి’ చిత్రాల్లో శాండీ మాస్టర్ యాక్టింగ్‌కి అందరూ ఫిదా అయ్యారు. ఇక శాండీ మాస్టర్, అర్జున్ దాస్ కాంబోలోని సీన్స్ ‘సూపర్ హీరో బాబు’ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టీం చెబుతోంది.
ఈ చిత్రంతో విఘ్నేష్ వేణుగోపాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 'బెలూన్' సినిమాకి కె.ఎస్. సినీష్ వద్ద సహాయ దర్శకుడిగా విఘ్నేష్ వేణుగోపాల్ పనిచేశారు. టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ అయిన కార్తీక్ యోగి (డిక్కిలూనా), రామ్ (పార్కింగ్)ని సినిష్ తెరకు పరిచయం చేశారు. ఇప్పుడు మరో కొత్త దర్శకుడు విఘ్నేష్‌ను పరిచయం చేయబోతోన్నారు.
'సూపర్ హీరో బాబు' చిత్రానికి సంగీతాన్ని హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించారు. 'ఖుషి', 'హాయ్ నాన్న', 'ది గర్ల్‌ఫ్రెండ్' వంటి భావోద్వేగభరితమైన చిత్రాలకు హేషమ్ అందించిన సంగీతం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ఆయన అందించిన అద్భుతమైన సంగీతం ఇప్పటికే 'సూపర్ హీరో'పై అంచనాలను పెంచేసింది.


Post a Comment