గొప్ప ఆశయంతో అందరికీ మంచి చేయాలని ఉద్దేశంతో పోటి చేస్తున్నాను: నిర్మాత సి కళ్యాణ్
''దాసరి గారి బాటలో నిర్మాతగా, నిర్మాతల మండలిలో చిన్న సభ్యుడిగా ఎదిగాను. నిర్మాతల సంక్షేమం కోసం రకరకాలుగా ఆదాయాన్ని సమకూర్చాం. నాలుగు రాష్ట్రాల చిత్ర పరిశ్రమలను కలిపి లీడ్ చేద్దామనుకుంటున్నాం. ఆయా ప్రభుత్వాల సహకారంతో నాలుగు రాష్ట్రాల పరిశ్రమలకు మంచి చేస్తాం' అన్నారు నిర్మాత సి కళ్యాణ్. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలపై సి.కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదట నిర్మాతలకు మెడిక్లైమ్ తీసుకొచ్చింది నేనే . నిర్మాతల మండలి ఆదాయానికి గిల్డ్ అనే గ్రూపు గండి కొట్టింది. గత నాలుగేళ్లలో ఫిల్మ్ ఛాంబర్ సర్వనాశనం అయ్యింది. నేను ఈ దఫా అధ్యక్షుడిగా పోటీ చేయడానికి బలమైన కారణం ఉంది. గతంలో దిల్ రాజు, దామోదరప్రసాద్ వచ్చి డిజిటల్ ఛార్జీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెబితే విరమించుకున్నా. రెండు లక్షల రూపాయలు లేకుండా సినిమా విడుదల ఆగిపోయిన సందర్భాలు నేను ఎదుర్కొన్నా. చిన్న సినిమాలు ఆపితే కృష్టానగర్ అకలితో అలమటిస్తుంది.పెద్ద సినిమాలకు ఎక్కువ మంది పనిచేయరు. చిన్న సినిమాలను బతికించాలి' అన్నారు.
ఐదుగురు నిర్మాతలు చిన్న సినిమాలకు మేం ఉన్నామని చెబితే సంతోషించాం. సినీ పరిశ్రమకు దాసరి లాంటి వ్యక్తులు కావాలి. ఎన్నికల్లో ఆ నిర్మాతలు పోటీ చేయరు, ప్రతిపాదిస్తారు, బెదిరిస్తారు. నేను నాలుగు సినీ పరిశ్రమలను కలపగలను డైలాగులు చెప్పడం కాదు ఆచరణ సాధ్యమయ్యే పనులు చేయండి. ఆస్కార్ నిర్మాత దానయ్య, బాహుబలి నిర్మాత శోభుయార్లగడ్డను ఎందుకు నిలబెట్టడం లేదు. ఫిల్మ్ ఛాంబర్ కు సేవ చేసేవాళ్లు కావాలి. పని చేసే వాళ్లను నిర్మాతలు గుర్తిస్తారు.'అన్నారు
ఓటు హక్కు ఉన్నవాళ్లలో 1600 మంది నిర్మాతలున్నారు. ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాణ సంస్థలకు ఓటు హక్కు ఉంది, వ్యక్తులకు కాదు. బ్యానర్ తరపున ప్రతినిధి తన ఓటు హక్కును వినియోగించుకుంటారు.ఎన్నికల్లో పోటిపై దిల్ రాజును కలిసి మాట్లాడాను. గిల్డ్ లోని 27 మంది సభ్యులు 1600 మంది నిర్మాతల రక్తం తాగుతున్నారు
దిల్ రాజుతో నాకు ఎలాంటి యుద్ధం లేదు. నా సినిమా వాళ్ల డిస్ట్రిబ్యూటర్ నుంచి రిలీజ్ కాలేదు. ఎన్నికలు వచ్చాయి కాబట్టే నాకు ఆయన ప్రత్యర్థి. గుత్తాదిపత్యం, స్టూడియోల వ్యాపారం వల్ల పరిశ్రమ బీటలు వారుతోంది. మాకు ఈ ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలవాలని లేదు. మందు విందు పొందు అనేది మాకు అలవాటు లేదు. మాది పూర్ ఫ్యూర్ ప్యానెల్'' అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్; అశోక్‌కుమార్, మద్దినేని రమేశ్, నట్టి కుమార్, రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.