Mirna Menon Interview About Ugram

‘ఉగ్రం’లో ఛాలెజింగ్ రోల్ చేశాను :  హీరోయిన్ మిర్నా మీనన్  



'నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. మిర్నా మీనన్ కథానాయికగా నటించింది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌ ట్రెమండస్ రెస్పాన్స్ తో ఉగ్రంపై అంచనాలని పెంచాయి. మే 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ‘ఉగ్రం’ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు మిర్నా మీనన్.


మీ ప్రయాణం గురించి చెప్పండి ? ‘ఉగ్రం’ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?

నేను డెవలపర్ ని. దుబాయి లో ఇంజనీర్ గా పని చేశాను. తర్వాత కేరళ వచ్చి పని చేశాను. కానీ చిన్నప్పటి నుంచి సినిమా ఇష్టం. యాక్టర్ అవ్వాలని వుండేది. ఒక రోజు దర్శకుడు అమీర్ నుంచి కాల్ వచ్చింది. తమిళ్ లో ఆర్యతో నటించే అవకాశం వచ్చింది. అలా నా యాక్టింగ్ కెరీర్ మొదలైయింది. తర్వాత సూపర్ స్టార్ మోహన్ లాల్ గారి  ‘బిగ్ బ్రదర్’ చేశాను. అదే సమయంలోనే లాక్ డౌన్ వచ్చింది. దీని తర్వాత ‘క్రేజీ ఫెలో’ చేశాను. దీని తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ గారి ‘జైలర్’ సినిమాలో అవకాశం వచ్చింది. అది ఫస్ట్ షెడ్యూల్ లో ఉండగానే ఉగ్రం దర్శకుడు విజయ్ సంప్రదించారు. అలా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను.


ఉగ్రంలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?

నాంది టీం మళ్ళీ కలసి చేస్తున్న సినిమా ఉగ్రం. దర్శకుడు విజయ్ గారికి వర్క్ నాకు చాలా ఇష్టం. అలాగే నరేష్ గారికి నేను అభిమానిని. ఉగ్రం కథ చెప్పినప్పుడే ఓకే చెప్పేశాను. కథ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఇందులో నా పాత్ర ఛాలెజింగ్  గా   వుంటుంది. కాలేజీ అమ్మాయిగా, భార్యగా, ఒక బిడ్డకు తల్లిగా.. ఇలా భిన్నమైన కోణాలు నా పాత్రలో కనిపిస్తాయి. కెరీర్ బిగినింగ్ లో ఇలాంటి పాత్ర చేయడం సవాలే. ఆ సవాల్ ని స్వీకరించి ఈ పాత్రని చేశాను.


ఉగ్రం కథలో మీ పాత్రకు ప్రాధన్యత ఎలా వుంటుంది ?

ఇందులో నా పాత్ర పూర్తి స్థాయిలో వుంటుంది. నరేష్ గారితో పాటు నా పాత్ర కూడా కథలో ప్రయాణిస్తూ వుంటుంది. నటనకు  ఆస్కారం వుండే పాత్ర దక్కినందుకు చాలా ఆనందంగా వుంది.


ఈ పాత్ర కోసం ఎలాంటి హోం వర్క్ చేశారు ?

సెట్ కి వచ్చే ముందు నేను హోం వర్క్ చేస్తాను. యాక్టింగ్ ని ప్రొఫెషనల్ గా నేర్చుకున్నాను. కాలేజీ అమ్మాయిగా చేసినప్పుడు , భార్యగా కనిపించినపుడు, ఒక బిడ్డకు తల్లిగా చేసినప్పుడు ఆలోచనలో, హావభావాల్లో స్పష్టమైన తేడాలు ఉంటాయి. వాటి అన్నిటి పై ప్రత్యేక  ద్రుష్టి పెడతాను.


కెరీర్ ఆరంభంలోనే బిగ్ స్టార్స్ తో పని చేయడం ఎలా అనిపించింది ?

ఈ విషయంలో నేను అదృష్టవంతురాలినని భావిస్తాను. తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తోంది.


నరేష్ గారితో పని చేయడం ఎలా అనిపించిది ?

నరేష్ గారు చాలా కూల్ గా వుంటారు. కామెడీ, సీరియస్ రెండు పాత్రలని అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు. కళ్ళతో హావభావాలు పలికిస్తారు. గ్రేట్ కోస్టార్. నరేష్  గారితో వర్క్ చేయడం మంచి అనుభూతి.


దర్శకుడు విజయ్ కనకమేడల గురించి ?

విజయ్ చాలా క్లారిటీ వున్న దర్శకుడు. తన స్క్రీన్ ప్లే రాసుకునే విధానం అద్భుతంగా వుంటుంది. ప్రతి సీన్ కి చివర్లో ఒక మీనింగ్ వుంటుంది. అది కథలో భాగమవుతుంది. తను మంచి ఎడిటర్ కూడా. సినిమా  ఆయన మైండ్ లోనే ఎడిట్ అయిపోతుంది. ఆయన తీసిన ప్రతీదీ సినిమాలో వుంటుంది. ఎంత కావాలో అంతే తీస్తారు. ఆయన పర్ఫెక్షనిస్ట్. విజయ్ గారి వర్క్ కి నేను ఫ్యాన్ అయిపోయా.  


ఇందులో మీ పాత్రలో గ్లామర్ ఉంటుందా ?

ఇందులో ఒక పాట బెంగళూరు లో షూట్ చేశాం. ఈ పాట కూడా కథలో భాగం గానే వుంటుంది. నేను ఇందులో బాధ్యత గల గృహిణి గా కనిపిస్తా. తను ఓ పోలీస్ అధికారికి భార్య. ఆ పాత్రకు ఎంత గ్లామర్ కావాలో అంత వుంటుంది.


ఉగ్రంలో ఎక్కువగా రాత్రి వేళల్లో షూట్ చేసారు కదా ?

 75 రోజుల వర్కింగ్ కాల్షీట్ లో 55 రోజులు నైట్ షూట్ చేశాం. కంటిన్యూగా 15 రోజులు నైట్ షూట్ లో 48 గంటలు బ్రేక్ లేకుండా చేశాం. ఇది డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. భారీ వర్షం, హైవే పై దుమ్ము లో షూట్ చేశాం. కొన్ని రియల్ స్టంట్స్ చేశాం. ట్రైలర్ లో చూపించిన కారు ప్రమాదం సీన్ రియల్ స్టంట్. చాలా రిస్కీ అనిపించింది. నరేష్ గారికి స్క్రాచెస్ కూడా అయ్యాయి. ఇందులో పాపగా నటించిన ఊహ కూడా అద్భుతంగా చేసింది.


షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో పని చేయడం ఎలా అనిపించింది ?

షైన్ స్క్రీన్స్ వారి మజిలీ సినిమా చూశాను. చాలా నచ్చింది. చాలా మంచి ప్రోడ్యూసర్స్. మంచి సినిమాలు చేయాలనే ఆలోచనతో వుండే నిర్మాతలు. ఉగ్రం ను ఎక్కడా రాజీ పడకుండా చేశారు. నేను పని చేసిన నిర్మాతల్లో  షైన్ స్క్రీన్స్ బెస్ట్ ప్రొడ్యూసర్స్.


కొత్తగా చేయబోతున్న సినిమాలు ?

వెట్రిమారన్ గారి కథతో అమీర్ గారి దర్శకత్వంలో ఓ సినిమా వుంటుంది. మలయాళంలో మరో సినిమా చేస్తున్నా.


ఆల్ ది బెస్ట్

థాంక్స్


Post a Comment

Previous Post Next Post