టాలీవుడ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఓటీటీలో సంతోషం అవార్డ్స్
సినీ జర్నలిస్టుగా కెరియర్ ప్రారంభించి తర్వాత ఒక పత్రికను స్థాపించి ఈ రోజుకి కూడా దాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు సురేష్ కొండేటి. సంతోషం మ్యాగజైన్ పేరుతో ప్రతి వారం సినీ పరిశ్రమలో జరుగుతున్న విశేషాలు అప్డేట్స్ సహా మరెన్నో విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా సంతోషం అవార్డుల కార్యక్రమం కూడా నిర్వహిస్తూ వస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రారంభించిన నాటి నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనా అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు సురేష్ కొండేటి. ఇక అలాగే గత ఏడాది అంటే 2022 ఈవెంట్ కూడా ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి సహా ఎంతో మంది ప్రముఖులు హాజరైన ఈవెంట్ డిసెంబర్ 26వ తేదీన ఘనంగా జరిగింది. అయితే ఈవెంట్ జరిగింది కానీ ఈవెంట్ కి సంబంధించిన విశేషాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈవెంట్ కి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంది. సాధారణంగా అవార్డుల వేడుక ఇప్పటివరకు యూట్యూబ్ లో ప్రసారమయ్యేది, లేదా సాటిలైట్ చానల్స్ ద్వారా ప్రచారం అయ్యేది. కానీ మొట్టమొదటిసారిగా ఒక ఓటీటీ సంస్థ సంతోషం హక్కులు భారీ రేటుకు కొనుగోలు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య ఓటీటీల మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో మనందరం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే తెలుగు మీద ఫోకస్ చేస్తున్న ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ అవార్డుల హక్కులను కొనుక్కోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి కొద్ది రోజుల్లో ఓటీటీ సంస్థ స్వయంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక రకంగా ఇది తెలుగు సినీ చరిత్రలోనే మొట్టమొదటిసారి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓటీటీలు విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమాలను, వెబ్ సిరీస్ లను కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా ఒకటి రెండు ఓటీటీ సంస్థలు సీరియల్స్ లా ఎపిసోడ్స్ ప్రసారం చేస్తున్నారు. అలాంటిది ఒక అవార్డుల ఈవెంట్ హక్కులు కొనుక్కుని ఒక ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్ చేయటం అనేది టాలీవుడ్ చరిత్రలోనే మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. కేవలం ఈ సంతోషం అవార్డ్స్ స్ట్రీమింగ్ మాత్రమే కాదు గతంలో కూడా సురేష్ కొండేటి అనేక ప్రయోగాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నో కార్యక్రమాలను మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా చేసి సక్సెస్ అయ్యారాయన. ఈ నేపథ్యంలో ఈ అవార్డుల కార్యక్రమం ఓటిటి స్ట్రీమింగ్ కూడా సూపర్ హిట్ కావడం ఖాయం అంటున్నారు