Home » » Sita Ramam Trailer Launched Grandly

Sita Ramam Trailer Launched Grandly


దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ క్లాసిక్ లవ్ స్టోరీ 'సీతా రామం' తెలుగు ట్రైలర్ గ్రాండ్ గా విడుదల


స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో 'యుద్ధంతో రాసిన ప్రేమకథ'గా ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం 'సీతా రామం'. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో కనిపిస్తున్నారు. బ్రిగేడియర్ విష్ణు శర్మ సుమంత్ మరో కీలక పాత్ర పోహిస్తున్నారు. గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో 'సీతారామం' థియేట్రికల్ ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దుల్కర్, హను రాఘవపూడి, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన, సుమంత్, రమేష్ ప్రసాద్, నిర్మాత అశ్వినీదత్ పాల్గొన్నారు. 


థియేట్రికల్ ట్రైలర్ 'సీతారామం' ఎపిక్ లవ్ స్టొరీలోని కీలకమైన ఘట్టాలని ఆసక్తికరంగా ఆవిష్కరించింది.“ఇరవై ఏళ్ల క్రితం లెఫ్ట్నెంట్ రామ్ నాకొక బాధ్యత అప్పగించాడు. ఈ ఉత్తరం సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి' అనే డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 

రామ్ ఒక ఒక అనాథ. కాశ్మీర్ లో లెఫ్టినెంట్ గా భాద్యతలు నిర్వహిస్తుంటాడు. సీత అనే అమ్మాయి నుండి వచ్చిన ఉత్తరం రామ్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. రామ్, సీతను కలుస్తాడు. వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. రామ్ కాశ్మీర్ లోని తన క్యాంపు కి తిరిగి వచ్చినప్పుడు సీతకు ఒక లేఖ రాస్తాడు. కానీ అది ఆమెకు చేరలేదు. 20 ఏళ్ల తర్వాత సీతకు ఆ లేఖ ఇచ్చే భాద్యత రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్ ల పై పడుతుంది. సీత అన్వేషణ లో విఫలమైన వారు.. రామ్ కోసం అన్వేషణ మొదలుపెడతారు. కానీ రామ్ ని పట్టుకోవడం సీతని అన్వేషించడం కంటే కష్టమౌతుంది. దీనికి కారణం రామ్ బాస్ బ్రిగేడియర్ విష్ణు శర్మ (సుమంత్). ట్రైలర్ లో ఆవిష్కరించిన ఈ సన్నివేశాలు సినిమాపై మరింత క్యురీయాసిటీని పెంచాయి. 


1965, 80 నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా అద్భుతంగా సాగింది. అత్యున్నత నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేసిన ఈ చిత్రం చిరకాలం నిలిచిపోయే చిత్రంగా అవుతుంది అని ట్రైలర్ చూస్తేఅర్ధమౌతుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తమ స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకున్నారు,. ఇందులో వారి కెమిస్ట్రీ మ్యాజికల్ గా వుంది. రష్మిక మందన్న హీరోయిక్ రోల్, సుమంత్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించడం ఆసక్తికరంగా వుంది.


అందమైన ప్రేమకథలు రూపొందించడంలో హను రాఘవపూడి మరోసారి తన ప్రత్యేకతని నిరూపించుకున్నారు. సీత, రామ్ ల ప్రేమకథని చాలా అందంగా, హృద్యంగా చూపించారు. “నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే – కాశ్మీర్ ని మంచుకొదిలేసి వస్తారా?“ అనే డైలాగ్ ఈ ప్రేమ కథ ఎంత అందంగా వుంటుందో చెప్పకనే చెప్పింది.   


పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ విజువల్ వండర్ గా వుంది. ట్రైలర్ కి విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన రీ-రికార్డింగ్ గ్రాండ్ గా ఉంది. ఎమోషన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసింది. రెండు విభిన్న కాలాల కథను సులభంగా అర్థమయ్యే రీతిలో అందించడంలో మాస్టర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు తన మార్క్ ని చూపించారు. వైజయంతీ మూవీస్ , స్వప్న సినిమా గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్ అత్యద్భుతంగావుంది. విజువల్స్ గొప్ప ఆర్టిస్ట్ చిత్రీకరించిన పెయింటింగ్స్ లా ఉన్నాయి.

ఆగస్ట్ 5న సీతారామం తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.


ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. అందరూ రొమాంటిక్ హీరో అని పిలవడంతో విసుగొచ్చి ఇంక ప్రేమకథలు చేయకూడదని అనుకున్నాను. ఇలాంటి సమయంలో హనుగారు ఈ కథతో వచ్చారు. అద్భుతమైన ప్రేమ కథ. చిరకాలం గుర్తిండి పోయే ఎపిక్ సినిమా. ఇలాంటి కథని ఎట్టిపరిస్థితిలో వదులకూడదనిపించింది. చివరి ప్రేమకథగా సీతారామం లాంటి క్లాసిక్ ఎపిక్ లవ్ స్టొరీ చేయాలని నిర్ణయించుకున్నా. సీతారామం షూటింగ్ అద్భుతమైన అనుభవం. దేశంలోని అనేక ప్రదేశాలలో షూట్ చేశాం. అన్ని ప్రదేశాలు నేను ఎప్పుడూ చూడలేదు. కథని బలంగా నమ్మాము. అందరం వంద శాతం బెస్ట్ వర్క్ ఇచ్చాం. అశ్వినీదత్ గారి లాంటి సినిమా పై ప్యాషన్ వున్న నిర్మాతతో ఇప్పటివరకూ పని చేయలేదు. అన్ని అవసరాలని సమకూర్చారు. ఎంతో అప్యాయంగా భోజనం పెట్టెవారు. హను గారు సినిమా పై గ్రేట్ ప్యాసన్ వున్న రచయిత, దర్శకుడు. ఆయనకి సినిమా తప్పితే మరో ద్యాస లేదు. సీతగా మృణాల్ అద్భుతంగా చేసింది. రష్మిక పాత్ర కూడా అద్భుతంగా వుంటుంది. గ్రేట్ టీమ్ తో పనిచేశాననే ఆనందం వుంది. సినిమాలో అద్భుతమైన మ్యూజిక్ వుంది. సీతారామం లార్జర్ దెన్ లైఫ్ సినిమా. ఆగస్ట్ 5న అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి'' అన్నారు.  


హను రాఘవపూడి మాట్లాడుతూ.. సీతారామం సినిమా బాగా వర్షం వచ్చినపుడు వేడి కాఫీ తాగినట్లు వుంటుంది. ఎండాకాలంలో చల్లటి నీరు తాగినట్లు వుంటుంది. ఆగస్ట్ 5 ఈ సినిమా చూస్తున్నపుడు మిమ్మల్ని మీరు మర్చిపోతారు. ఇది రాసివ్వగలను. ఈ సినిమా మీతో పాటు వచ్చేస్తుంది. చిరకాలం గుర్తిండిపోతుంది. కథ ,పాత్రలు మాత్రమే వుంటాయి.మిమ్మల్ని కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఇలానే ప్రదేశాలకు తీసుకెల్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దుల్కర్ , సుమంత్, మృణాల్, రష్మిక కి స్పెషల్ థాంక్స్. వీరి సపోర్ట్ లేకపొతే సినిమాలో ఒక్క పేజీ కూడా నిండేది కాదు. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితులని దాటి ఈ రోజు సినిమా ట్రైలర్ చూసే పరిస్థితి వచ్చిందంటే తెరవెనుక వందలమంది కష్టం వుంది. సీతారామం మీ అందరికీ గొప్ప అనుభూతిని ఇస్తుంది'' అన్నారు. 


మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. దర్శకుడు హను గారు జీనియస్. ఈ కథని చెప్పినపుడు సీత, రామ్ ల ప్రేమలో పడిపోయా. నిర్మాత అశ్వినీదత్ గారు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. సెట్ లో ప్రతిరోజు ఒక అందమైన కలలా వుండేది. సీత పాత్ర అద్భుతంగా వుంటుంది. ఆ పాత్రలో రోమాన్స్ కూడా వుంది. ఈ మధ్య కాలంలో రోమాన్స్ సినిమాలు తగ్గిపోతున్నాయి. సీతారామంలో మ్యాజికల్ రోమాన్స్ వుంటుంది. దుల్కర్, సుమంత్, రష్మిక కు థాంక్స్. ఆగస్ట్ 5న అందరం థియేటర్ లో కలుద్దాం' అన్నారు. 


రష్మిక మాట్లాడుతూ.. అఫ్రిన్ లాంటి వైలెంట్ క్యారెక్టర్ ఇచ్చారు.. ఈ పాత్రకు ఎలా న్యాయం చేయాలని దర్శకుడు హను గారిని అడిగాను. ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ నా పాత్రకు న్యాయం చేశానని పిస్తుంది. ఒక అందమైన ప్రేమ కథ చెప్పాడానికి కథకుడు వుండాలి. కథ ఎలా జరిగిందో వివరంగా చెప్పాలి కదా.. ఇందులో ఆ వివరాలని నేను ఇస్తా. సీత రామ్ అందమైన ప్రేమ కథని అఫ్రిన్ చెప్పే విధానం మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. ఆగస్ట్ 5కోసం ఎదురుచూస్తున్నాను'' అన్నారు.  


రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ..'ప్రసాద్'కు సినిమాతో ఎంతో అనుబంధం వుంది, నాన్నగారు మూకీ నుండి సినిమాల్లో భాగమయ్యారు. ప్రసాద్స్ అనేది సినిమా కోసం. సినిమా కరోనాతో గడ్డుకాలం ఎదురుకుంది. అయితే గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు ప్రేక్షకుల ప్రేమతో కష్టకాలాన్ని అధిగమించింది. సినిమా పరిశ్రమ నేడు ఎంతో చిత్తశుద్ధి, ప్రతిభతో చిత్రాలని నిర్మిస్తుంది. సీతారామం యూనిట్ కి ఆల్ ది బెస్ట్. సినిమా కలకాలం నిలుస్తుంది'' అన్నారు.  


సుమంత్ మాట్లాడుతూ.. ఈ సినిమా 150 పేజీల కథ మొత్తం చదివిన తర్వాత సీతారామం దృశ్యకావ్యం అవుతుందనిపించింది. 'గోదావరి' అనే సీతారాముల కథ చేశాను. అది అప్పుడు క్లాసిక్ అయ్యింది. ఇప్పుడు సీతారామం కూడా క్లాసిక్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆగస్ట్ 5 కోసం ఎదురుచూస్తున్నాను. ఇది థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఆగస్ట్ 5న అందరం థియేటర్లో కలుద్దాం'' అన్నారు. 


అశ్వినీదత్ మాట్లాడుతూ.. దుల్కర్ , సుమంత్, మృణాల్, రష్మిక సీతారామం యూనిట్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కరోనా ఉదృతంగా వున్న సమయంలో కాశ్మీర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రష్యా లాంటి ప్రదేశాల్లో సాహసించి షూటింగ్ చేశారు. సీతారామం చూసి ఎంజాయ్ చేసి మాకు సూపర్ సక్సెస్ ని ఇస్తారనే నమ్మకం వుంది'' అన్నారు.


ఈ సందర్భంగా విలేఖరు అడిగిన ప్రశ్నలు సమాధానాలు ఇచ్చింది సీతారామం చిత్ర యూనిట్ 


సీతారామం నిర్మించడానికి మిమ్మల్ని ఎక్సయిట్ చేసిన అంశం ?

అశ్వినీదత్ : సీతారామం నా 60వ చిత్రం. ఇప్పటివరకూ చాలా కాస్టింగ్ వున్న చిత్రాలు తీశాను కానీ లవ్ స్టొరీని మిస్ అయ్యాను. మంచి ప్రేమకథ తీయలేదనే ఫీలింగ్ వుండేది. మరోచరిత్ర, గీతాంజలి నా అభిమాన చిత్రాలు. ఇవి చూసినప్పుడు ఇలాంటి సినిమా తీయగలనా ? అనిపించేది. సీతారామంతో ఆ కోరిక తీరింది. సీతారామం సంచలనమైన విజయం సాధిస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమాని తీసినందుకు గర్వపడుతున్నాను. టికెట్ రేట్లు నార్మల్ గా వుంటాయి. అందరూ చూడాల్సిన సినిమా ఇది. అందరికీ అందుబాటు ధరలో టికెట్ రేట్లు వుంటాయి. నటీనటుల అద్భుత ప్రదర్శన, గొప్ప విజువల్స్, కథ, కథనం, మంచి సంగీతం వున్న ఈ సినిమాని ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లోనే చూస్తారు. 


సీతా రామం కథ .. రామాయణంలో సుందరకాండకి యుద్ధ కాండకి సారాంశం అనుకోవచ్చా ? 

హను రాఘవపూడి : రామాయణంతో పోలిక లేదు. ఆ కథకి ఈ కథకి సబంధం లేదు. అయితే ఒక అబ్ స్ట్రాక్ట్ గా అనుకోవచ్చు. రాముడులాంటి లక్షణాలు వున్న వారిని చూస్తే గొప్పగా చూస్తాం. అలంటి వ్యక్తిత్వం రామ్ ది. సీత పాత్ర వైదేహి లాంటిదే. అయితే రెండు విధాలుగా వుంటుంది. సినిమా చుస్తే అర్ధమౌతుంది. వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు రాస్తే రామాయణం అవుతుంది. అంత అద్భుతంగా వుంటుంది. 


అఫ్రిన్ పాత్ర చెప్పినపుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు ? 

రష్మిక: అఫ్రిన్ ఒక రెబల్ పాత్ర. నా వల్ల ఎలా అవుతుందని హనుగారిని అడిగాను. నా పాత్రల్లో యాంగ్రీ బర్డ్ గా వుంటాను కానీ అందులో కూడా అమాయకత్వం వుంటుంది. కానీ అఫ్రీన్ పూర్తిగా రెబల్ రోల్. ఐతే ఇది అద్భుతమైన ప్రేమ. ఇందులో నా పాత్ర రామ్ సీతల ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది. ఇది నాకు చాలా కొత్త పాత్ర. నా పాత్ర పై ఆడియన్స్ కి కోపం వచ్చి నా ఎమోషన్స్ తోటి కనెక్ట్ అయితే నేను విన్నర్ అయినట్లే. 


వైజయంతి మూవీస్ లో మహానటి, ఇప్పుడు సీతారామం చేశారు.. ఈ అనుభవం ఎలా వుంది ? 

దుల్కర్ : వైజయంతి మూవీస్ హైదరాబాద్ లో నా సొంత ఇల్లు లాంటింది. నా కోసం మంచి కథలు తీసుకొస్తారనే నమ్మకం వుంది. నేను నో చెప్పలేని స్క్రిప్ట్స్ మాత్రమే చెప్తారు. అందుకే వైజయంతి లో సినిమా అంటే నేను పెద్దగా అలోచించను. సినిమాని చాలా ప్యాషన్ తో చేసే నిర్మాతలు. 


సీత పాత్రలో రష్మికని ఎందుకు తీసుకోలేదు ? 

హను రాఘవపూడి : అఫ్రిన్ పాత్ర అనుకున్నపుడు రష్మిక ఫస్ట్ ఛాయిస్ గా కనిపించారు. సీత పాత్రలో మరొకరిని వూహించుకుంటానేమో కానీ అఫ్రిన్ పాత్ర చేయడానికి మరొక ఆప్షన్ లేదు. ఇద్దరు వ్యక్తులని కలిసేలా చేసే మనిషిని అద్భుతం అంటాం. రష్మిక గారి ఆఫ్రిన్ పాత్ర కూడా ఒక అద్భుతం. ఇది రామాయణం కథకు కనెక్ట్ చేసే హనుమంతుడు అంటాం. రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంత గొప్పదో ఇందులో ఆఫ్రిన్ గా రష్మిక పాత్ర అంత వున్నతమైనది. 


బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రని చేయడానికి మిమ్మల్ని ఎక్సయిట్ చేసిన అంశం ? 

సుమంత్ : నేను ఎప్పటి నుండో ఇలాంటి పాత్ర చేయడానికి ఎదురుచూస్తున్నాను. హీరో పాత్రలు చేస్తూ కథలో బలమైన పాత్రలు చేయాలనీ ఎప్పటినుండో అనుకుంటున్నాను. హను గారు ఈ కథ చెప్పినపుడు నా పాత్ర చాలా నచ్చింది. ఇప్పుడే పాత్ర గురించి ఇంకా ఎక్కువ చెప్పడం సరికాదు. అలాగే చాలా కాలం తర్వాత భూమిక నేను కలసి నటిస్తున్న సినిమా సీతారామం కావడం కూడా ఆనందంగా వుంది.


సీతారామం చేయడనికి మిమ్మల్ని ఎక్సయిట్ చేసిన అంశాలు ? 

మృణాల్: హనుగారు చాలా గొప్ప కథ చెప్పారు. వైజయంతి మూవీస్, దుల్కర్ సల్మాన్.. ఇంత గొప్ప కాంబినేషన్ లో భాగమవ్వడం నా అదృష్టం, ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టడం ఎంతో గర్వంగా వుంది. సీతా రామం ఓ అద్భుతం.


తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, భూమిక చావ్లా ప్రకాష్ రాజ్ తదితరులు 


సాంకేతిక విభాగం:

దర్శకత్వం: హను రాఘవపూడి

నిర్మాత: అశ్వినీదత్ 

బ్యానర్: స్వప్న సినిమా

సమర్పణ: వైజయంతీ మూవీస్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గీతా గౌతమ్

ఛాయాగ్రహణం : పీఎస్ వినోద్ 

సంగీతం: విశాల్ చంద్రశేఖర్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

ప్రొడక్షన్ డిజైన్: సునీల్ బాబు

ఆర్ట్ డైరెక్టర్: వైష్ణవి రెడ్డి, అలీ

కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ

పీఆర్వో : వంశీ-శేఖర్


Share this article :