Home » » Major Director Sashi Kiran Tikka Interview

Major Director Sashi Kiran Tikka Interview

 మేజర్ చిత్రం దర్శకుడు శశి కిరణ్ తిక్క ఇంటర్వ్యూ
అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం  మేజర్.  26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం  తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్ టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఈ సందర్భంగా దర్శకుడు శశి కిరణ్ తిక్క బుధవారంనాడు మీడియాతో సమావేశమయ్యారు. ఆ వివరాలు.


మేజర్ చిత్రం ఎలా మొదలైంది?

అడవి శేష్ వల్లే మొదలైంది. 2010నుంచి మేం స్నేహితులం. నేను అసిస్టెంట్గా ప్రయత్నాలు చేస్తున్నా. తను హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఓసారి మాటల్లో మేజర్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాడు. ఆ తర్వాత రెండు కథలు అనుకున్నాం. కానీ సాధ్యపడలేదు. ఆఖరికి 2016లో గూఢచారి మొదలు పెట్టాం. అది విడుదలై మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఎవరు సినిమాలు వారివి అనేలా బ్రేక్ తీసుకున్నాం. నేను వేరే నిర్మాణ సంస్థలోకి  వెళ్ళాను. కొన్నాళ్ళకు శేష్, సహ నిర్మాత శరత్, నమ్రత, సోని సంస్థను కలిపి ఒక వేదికపై తీసుకువచ్చారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి సినిమా గురించి చెప్పాడు. చేసేయ్ అన్నా. చేయడంకాదు. ఈ సినిమా నువ్వే దర్శకత్వం వహించాలి అన్నాడు. నేను కాస్త బ్రేక్ తీసుకుందాం అనుకున్నానని చెప్పినా వినలేదు. నువ్వే కరెక్ట్ అన్నాడు. దాంతో కొంత సమయం తీసుకుని చెబుతాను అన్నాను. ఆ సమయంలో మేజర్ గురించి స్టడీ చేశాను. ఆ క్రమంలో ఆ పాత్ర నన్ను బాగా ఆకట్టుకుంది. 26/11 ఎటాక్ లో ఎంతోమందిని కాపాడిన వ్యక్తి. ఎంతో నాలెడ్జ్ వున్న పర్సన్. దాంతో ఈ విషయం అందరికీ తెలియజేయాలనే నేనే సినిమా చేస్తానని శేష్ తో చెప్పాను. అలా సినిమా మొదలైంది.


శేష్ కెరీర్ గ్రాఫ్ లో హీరో, రచయిత, దర్శకుడు వున్నారు కదా. అలాంటప్పుడు మీకు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వుంటాయి గదా. ఒకవైపు ప్రీ ప్రొడక్షన్ సినిమా పక్కన పెట్టి మేజర్ చేయడానికి కారణం?


నేను బయట సినిమా చేయాలనుకున్నాను కానీ అది ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశకు రాలేదు. రైటింగ్ స్టేజీలోనే వుంది. ఇక మేజర్ కథను కేవలం సందీప్ తల్లిదండ్రుల కోసమే చేశాను. వారిని కలిసినప్పుడు ఈ కథకు బయటకు తేవాలని అనుకున్నా. సందీప్ గురించి సిబిఎస్.సి. టెక్ట్ బుక్స్లో ఒక చాప్టరే వుంది. అందుకే  ఒళ్ళు దగ్గరపెట్టుకుని సినిమా చేయాలనుకున్నా.

 

ఈ కథ పై చాలాకాలం శేష్ తో ట్రావెల్ అయ్యారు కదా? మీకు ఫ్రీడం  దక్కిందా?


ఈ సినిమా ఓ బేబిలా జాగ్రత్త గా చేశాం. అతను గతంలో దర్శకుడు కావచ్చు. కానీ ఈ సినిమాకు నటుడు మాత్రమే. అందుకే శేష్ తో గూఢచారి, ఇప్పుడు మేజర్ చేశాను. ప్రతీ నటుడు ఎక్కడో చోట ఓ నిర్ణయం తీసుకోవాలి. అది మేజర్ కు శేష్ తీసుకున్నాడు.

 

ఇలాంటి కథకు డ్రామా వుంటుంది. అబ్బూరి రవి డైలాగ్స్ ఏ మేరకు రీచ్ అయ్యాయంటారు?

నాకు అబ్బూరి రవి బ్యాక్ బోన్ లాంటివారు. నాతోపాటు కథా చర్చల్లో పాల్గొన్నారు. కథ, డైలాగ్స్ ఆయన పేరు వుంటుంది. హిందీ తెలుగు ఒకేసారి చేశాం. తెలుగు డైలాగ్ లు ఆయన రాశారు. హిందీ డైలాగ్ లు అచ్చుత్ రాశారు. కొన్ని పదాలు కొత్తగా అనిపిస్తే తెలుగులో వాటికి అనుగుణంగా మెరుగులు దిద్దేవారం. ఇందులో మాటలు చాలా సహజంగా నీట్ గా వున్నాయి. వైజాగ్ లో సినిమా చూస్తూ ఆడియన్స్ డైలాగ్స్కు విజిల్స్ వేస్తున్నారు. ఆ రియాక్షన్ రేపు అన్ని చోట్ల వుంటుందనుకుంటున్నాను.


26/11లో 17 మంది అధికారులు చనిపోయారు. అందులో కేవలం సందీప్ కథే ఎందుకు ఎంపిక చేసుకున్నారు?


సహజంగా ఇన్స్ప్రిరేషన్ ఎలా వస్తుందంటే, ఫ్రీడం ఫైటర్స్ చాలా మంది వుంటారు. కానీ ఎఫెక్ట్ ఒకరి పైనే పడుతుంది. మిగిలినవారు తక్కువని కాదు. వారి గురించి కూడా కథలు రావచ్చు. శేష్.. సందీప్ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాడు. మిగిలిన ఆఫీసర్ల గురించి ముందు ముందు ఫిలింమేకర్స్ చేయవచ్చు. ఇక్కడ ఎవరూ తక్కవకాదు.


 సందీప్ ఉన్నికృష్ణన్ కుటుంబ సినిమా చూశారా?

నిన్ననే బెంగుళూరులో చూశారు. మూడేళ్ళుగా మేం వారిని సంప్రదిస్తూనే వున్నాం. షూట్ లో మేజర్ రియాక్షన్ ఫలానా సన్నివేశంలో ఎలా వుంటుందో అని అడిగి మరి చేసేవాళ్ళం. వారి అమ్మగారు తగువిధంగా సూచనలు చేసేవారు. అందుకే ఇంత ఔట్ పుట్ తీసుకున్న వీరు ఎలా తీశారనే ఆసక్తి వారికీ వుంటుంది. వారు చూడగానే మెచ్చుకున్నారు.

సందీప్ భార్య గురించి ప్రస్తావించారా?

ఆమె గురించి ఆ తర్వాత విషయాలు ఏమీ చెప్పలేదు.

మీరు వారిని అడిగినప్పుడు ఎమోషన్ అయిన సందర్భాలున్నాయా?

మేజర్ తల్లిదండ్రులతో చర్చలో పాల్గొన్నప్పుడు నేను ఇన్స్పైర్ అయిన సందర్భాలున్నాయి. రియల్ లైఫ్ లో ఆహ్లాదకరంగానూ, బాధలు, ఏడుపులు ఇవన్నీ ఆయనలో వున్నాయి. మేం కూడా విన్నాక ఫీల్ అయ్యాం. ఈ ఫీలింగ్ ను యథాతథంగా నటీనటులకు ఫీలయ్యేలా చేశాం. అవి తెరపై వచ్చేలా చూశాం. ప్రకాష్రాజ్, రేవతి పాత్రలు చూస్తే మీకే తెలుస్తుంది. వారు ఫీలయి చేశారు. చూసేవారికి కంటతడి పెట్టిస్తుంది. 

 

 గూఢచారి కంటే మేజర్ బడ్జెట్ పరంగా ఎక్కువవ కదా. ఛాలెంజ్ అనిపించిందా?

గూఢచారి అనేది నేచురల్ లొకేషన్ లో చేశాం. కానీ మేజర్ అనేది స్టార్ హోటల్ లో చూపించాలి. 1990 నాటి హోటల్స్. అందుకే హైదరాబాద్ లోని చాలా హోటల్స్ లో చేశాం. రామోజీ ఫిలింసిటీ లో ఏడు సెట్లు వేశాం. 

సినిమా లిబర్టీని ఎంతవరకు తీసుకున్నారు?

సినిమాపరంగా కొన్ని తీసుకున్నాం. యాక్షన్ చాలా జాగ్రత్తగా చేయాల్సి వచ్చింది. అహ్మదాబాద్, లక్నో వంటి చోట్ల యాక్షన్ తీశాం. 

తాజ్ హోటల్ లో షూట్ చేశారా?

అక్కడ పర్మిషన్ ఇవ్వరు. అందుకే తాజ్ హోటల్ లోని బ్లాక్ లాగా కొన్ని సెట్లు వేసి తీశాం. కోవిడ్ వల్ల కొంత ఆలస్యమైంది. 

ముందుగానే సినిమా అందరికీ చూపించాలనే ఆలోచన ఎవరిది?

మార్కెటింగ్ డిపార్ట్మెంట్.. శరత్, శేష్ డిసైడ్ చేశారు. పైరసీ వుంటుందేమోనని అనుమానం కూడా వచ్చింది. దాన్ని కంట్రోల్ చేసేలా ఫోన్లు ముందుగానే తీసుకున్నాం. 

 కానీ బయట ఈ సినిమాకు అంత బజ్ రాలేదే?

సోషల్ మీడియాలో తగిన విధంగానే బజ్ వచ్చింది. మేం మలయాళంలో షో వేయలేదు. అక్కడ పైరసీ ప్రాబ్లమ్.

 

 పాన్ ఇండియా సినిమా కొలమానాలు ఏమిటి?

ఎనీ ఫిలిం మేకర్ తమ సినిమా అందరూ చూడాలనే అనుకుంటారు. గోవా పిలిం పెస్టివల్ లోనూ తన సినిమాలో అందరూ చూడాలనే కోరిక మేకర్కు వుంటుంది. కథలు యూనివర్శల్. అందుకే పాన్ ఇండియా సినిమాగా మారిపోయాయి. అది నిర్మాతను బట్టి వుంటుంది.


కెరీర్ మొదట్లోనే బయోపిక్ చేయడం కష్టం అనిపించిందా?

మేజర్ చేయాలనే చేశాను. గూఢచారి అనేది ఫిక్షన్ అది ఎలాగైనా చేయవచ్చు. మేజర్ కు మాత్రం పరిమితులు వుంటాయి. అలానే చేయాలి. 31 ఏళ్ల మేజర్ జర్నీ, ఆయన చుట్టు పక్కలవారి జర్నీ కూడా చూపించాలి. 

మహేష్బాబు చూసారా?

ట్రైలర్ ముందు రోజు సినిమా చూశారు. 5 నిముషాలు ఏమీ మాట్లాడలేదు. బాగుందో లేదో అనే అనుమానం వచ్చింది. కానీ వెంటనే శేష్ ను హగ్ చేసుకున్నారు. అభినందించారు. 


మిగతా నటీనటులు గురించి?

రేవతి నా ఫేవరేట్ నటి. మోనిటర్ లో చూస్తేనే ఏడుపు వచ్చింది. అలా పాత్రను పండించారు. ప్రకాష్రాజ్ నాతో రెండో సినిమా. ఇలాంటి సినిమాకు కొన్ని పరిమితులుంటాయి. అలానే చేశారు. అలాగే సాయిమంజ్రేకర్, శోభితా బాగా నటించారు.  

 

మీ తదుపరి చిత్రాలు?

రెండు కథలున్నాయి. సితార ఎంటర్ టైన్మెంట్ బేనర్ లో చేయాలి. త్వరలో వివరాలు చెబుతాను.


Share this article :