శర్వా ఈ సినిమాలో నవ్వుతూ బాగా చేశాడు. అందులోనే హిట్ కళ కనిపిస్తుంది- ఆడవాళ్ళు మీకు జోహార్లు`ప్రీ రిలిజ్‌వేడుక లో సుకుమార్
రాసుకోండి- నా కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలుస్తుంది - శర్వానంద్
నా కెరీర్‌లో బెస్ట్ సినిమాగా ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రం నిలుస్తుందని కథానాయకుడు శర్వానంద్ అన్నారు. శర్వానంద్, రష్మిక మండన్న జంటగా నటించిన `ఆడవాళ్ళు మీకు జోహార్లు`ప్రీరిలీజ్ వేడుక ఆదివారం రాత్రి శిల్పకళావేదికలో వైభవంగా జరిగింది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్ర సంగీతం లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైంది. ఈ సందర్భంగా శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో చిత్ర టైటిల్ సాంగ్‌ను వ్యాపారవేత్త రాజ సుబ్రహ్మణ్యం, కెమెరామెన్ సుజిత్ సారంగ్ సంయుక్తంగా ఆవిష్కరించారు. మరో గీతాన్ని ప్రముఖ నిర్మాతలు నవీన్ యెర్నేని (మైత్రీ మూవీస్), వెంకట్ బోయినపల్లి (శ్యామ్ సింగరాయ్) ఆవిష్కరించారు.
చిత్ర ట్రైలర్‌ను ముఖ్య అతిథులు ప్రముఖ దర్శకుడు సుకుమార్, కీర్తిసురేష్, సాయిపల్లవి సంయుక్తంగా ఆవిష్కరించారు.
అనంతరం సుకుమార్ మాట్లాడుతూ, అందమైన నాయికలు రష్మిక, సాయిపల్లవి, కీర్తిసురేశ్. ముగ్గురూ బెస్ట్ పెర్‌ఫామ్ చేస్తారు. వీరికి సమంత గ్యాంగ్ లీడర్. సాయిపల్లవి లేడీ పవన్ కళ్యాణ్‌లా కనిపిస్తారు. ఈ రంగంలో తనలా వుండడం కష్టం. మానవతా కోణంలో ఆలోచించి ఒక వాణిజ్య ప్రకటనను రిజక్ట్ చేయడంలో సాయి పల్లవి ఆదర్శంగా నిలుస్తారు. నేను దేవీశ్రీ రిజల్ట్ నమ్ముతాను. ఎంతో ఇష్టంగా ఈ సినిమాకు రీరికార్డింగ్ చేశాడు. దర్శకుడు కిశోర్ చాలా సున్నితమైన మనసున్న వ్యక్తి.. మంచి సినిమాకు ఇది స్పూర్తి కావాలని కోరుకుంటున్నా.శర్వాకు అభిమానిని. తను గత రెండు సినిమాల్లో సీరియస్‌గా కనిపించాడు. కానీ ఈ సినిమాలో నవ్వుతూ బాగా చేశాడు. అందులోనే హిట్ కళ కనిపిస్తుంది. నిర్మాత సుధాకర్ సినిమాపై తపనతో తీశారు. ఆయనకు పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఖుష్బూ గారితో ఒకసారి షూట్ చేసే అవకాశం వచ్చింది. ఆమె దగ్గర కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నాను అని తెలిపారు.
కీర్తి సురేష్ మాట్లాడుతూ, నేను చేసిన `నేను శైలజ` సినిమా చేసిన దర్శకుడు కిశోర్‌గారు. కిశోర్ పేరు కనిపించకపోయినా ఆయన సినిమాను చూసి గుర్తుపట్టవచ్చు. రష్మిక టాలెంటెడ్ పర్సన్. కెరీర్ బిగినింగ్ నుంచీ తగ్గెదేలే అన్నట్లు సాగుతోంది. ఆడవాళ్ళకే కాదు ఈ సినిమాలో పనిచేసిన అందరికీ నా జోహార్లు. ఈ సినిమా అందరూ హాయిగా చూసేట్లుగా వుంటుంది. ఈ సినిమాకు పనిచేసిన మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.
సాయిపల్లవి మాట్లాడుతూ, ఈరోజు నా కుటుంబ వేడుకకు వచ్చినట్లు వుంది. `పడిపడి లేచె మనసు` చేసినప్పటి నుంచి నిర్మాతలు నా కుటుంబ సభ్యులు అయిపోయారు. శర్వాతో స్నేహితురాలిగా మాట్లాడతాను. శర్వాకు హీరో అయిపోయానని కాకుండా తను బాగా వినోదాన్ని పంచాలను ప్రయత్నిస్తుంటాడు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. దేవీశ్రీ సంగీతం ప్రత్యేకంగా వుంది. రష్మిక ఎప్పుడూ నవ్వుతూనే వుంటుంది. పుష్ప సక్సెస్ అయినట్లే ఈ సినిమా కూడా ఆమెకు అవ్వాలని ఆశిస్తున్నానని తెలిపారు.
రష్మిక మాట్లాడుతూ, కెమెరా సుజిత్ గారు అందంగా చూపించారు. దేవీశ్రీ సంగీతం బాగుంది. శర్వానంద్ నేను కలిసిన హీరోల్లో స్వీట్ పర్సన్. సాయిపల్లవి, సుకుమార్, కీర్తిసురేష్ ఈ సినిమా సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. కోవిడ్‌లో నిరాశలో వున్న అందరికీ మంచి ఎంటర్‌టైన్ సినిమా ఇది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమా ఇచ్చినందుకు దర్శకుడు కిశోర్ గారికి కృతజ్ఞతలు. ఆడాళ్ళంతా కలిసి సరదాగా ఈ సినిమా చేశామని` తెలిపారు.
శర్వానంద్ మాట్లాడుతూ, సుకుమార్‌కు నేను అభిమానిని. ఆయన వచ్చి ఆశీర్వదించడం ఆనందంగా వుంది. కీర్తి గారికి ధన్యవాదాలు. సాయిపల్లవిని నటిగా చూడను. తను మనసుతో మాట్లాడే వ్యక్తి. మంచి స్నేహితురాలు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రాణం పోశాడు. 15 ఏళ్ళనాడు దేవీ ఓ మాట ఇచ్చాడు. `నీకు సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ ఇస్తానని` అన్నారు. అది ఈ సినిమాతో నెరవేర్చాడు. ఈ సినిమాలో గొప్ప నటులతో నటించే అవకాశం కలిగింది. సుధాకర్‌గారి వల్లే ఈ సినిమా చేశాను. ఆయన నన్ను నమ్మారు. రాసుకోండి.. ఈ సినిమా నా కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది. మార్చి 4న వస్తున్నాం. ఇంతకాలం మిస్ అయిన ఫ్యామిలీ సినిమాను మీకోసం ఇస్తున్నాం. ఇక రష్మిక ఎప్పుడూ నవ్వుతూనే వుంటుంది. ఆమెతో నటించడం ఆనందంగా వుంది. థియేటర్‌కు వచ్చి సినిమా చూశాక నవ్వుకుంటూ బయటకు వెళతారు అని గట్టిగా చెప్పగలను అని పేర్కొన్నారు.
దర్శకుడు కిశోర్ తిరుమల మాట్లాడుతూ, ఈరోజు ఈవెంట్ నాకు మర్చిపోలేనిది. మీరంతా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి అని తెలిపారు.
దేవీశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, నేను జోహార్లు చెప్పాల్సి వస్తే మా మదర్‌కు చెబుతాను. మీరు కూడా అలాగే చెప్పండి. కిశోర్ గారు కథ చెప్పినప్పుడు నాకు తెగ నచ్చేసింది. హీరో పాత్ర గురించి చెప్పినప్పుడే `మాంగల్యం..` అనే సాంగ్ వచ్చేసింది. అది కిశోర్ గారికి నచ్చేసింది. అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కిశోర్ చిత్రాల్లో ఎమోషన్స్ వుంటూనే ఎంటర్‌టైన్ మెంట్ కూడా వుండేలా చూసుకుంటారు. నిర్మాతకూ శుభాకాంక్షలు. ఈ సినిమా యూత్‌కూ బాగా నచ్చుతుంది. శర్వాకు బెస్ట్ ఫిలిం అవుతుంది. ఇందులో తను అన్ని ఎమోషన్స్, టైమింగ్ ఫర్‌ఫెక్ట్‌గా చూపించారు. ఇక ఖష్బూ, రాధిక, ఊర్వశి పాత్రలు సమానస్థాయిలో వున్నాయి అని తెలిపారు.
ఖుష్బూ మాట్లాడుతూ, చాలా రోజుల తర్వాత తెలుగులో నటించాను. మంచి కథతో వచ్చాను. ఆడవాళ్ళు ఇంటిలో వుంటే ఎలా వుంటుందనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. శర్వానంద్ ఫాత్ర హీరోయిజమేకాదు పాత్రను నమ్మిచేశాడు. రష్మికను `గీత గోవిందం`లో చూసి నేను అభిమానిగా మారాను. కిశోర్ గారు కథ చెప్పగానే రష్మిక కాంబినేషన్ కూడా వుంది అనగానే వెంటనే అంగీకరించాను. దేవీశ్రీప్రసాద్ సినిమాకు బలం. విజువల్ ఎంత అందంగా వున్నాయో సంగీతం అంతలా కుదిరింది. ఏ సినిమా అయినా సక్సెస్ అవ్వాలంటే ఆడవాళ్ళు థియేటర్‌కు రావాలి. ఈ సినిమాకు వచ్చి విజయం సాధించి పెడతారని ఆశిస్తున్నాను.ఈ సందర్భంగా ప్రతితిభను గుర్తించి ప్రోత్సహించిన రామానాయుడు, కె. రాఘవేంద్రరావుగారిని గుర్తుచేసుకున్నారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత శ్రీకాంత్ తెలుపుతూ, మార్చి 4న మా సినిమా రాబోతుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కుటుంబ సభ్యులతో వచ్చి ఎంజాయ్ చేయాలని ఆశిస్తున్నాను అని తెలిపారు.
యాంకర్, నటి ఝాన్సీ మాట్లాడుతూ, ఈ సినిమాలో ప్రతీ పాత్ర మన ఇళ్ళలోనూ కనిపించే పాత్రలాగా వుంటాయి. పరిస్థితుల ప్రభావంతో ఆయా పాత్రలు నడుస్తాయి. అందరినీ నవ్వించే ప్రయత్నం చేశాం. పిల్లలనుంచి పెద్దల వరకూ హాయిగా నవ్వుకునే సినిమా అని తెలిపారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలుపుతూ, ఈ సినిమా టీజర్ చూడగానే శర్వాకు హిట్ అని చెప్పాను. శర్వాకు ఒక సినిమా బాకీ వున్నా. అది త్వరలో తీరుస్తాను అని చెప్పారు. మరో నిర్మాత సాహు గారపాటి టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
నటి రజిత తెలుపుతూ, ప్రతి పురుషుడి విజయం వెనుక మహిళ వుంటుందంటారు. కానీ ఈ సినిమాలో మా విజయం వెనుక మగాళ్ళు వుంటారని పేర్కొన్నారు.
ఇంకా ఈ వేడుకలో సాహు గారపాటి, ప్రకాష్, శ్రీకర ప్రసాద్, వాసు, చాగంటి విజయ్ కుమార్, పంపిణీదారుడు వరంగల్ శ్రీను, వేణు, గాయకుడు సాగర్ తదితరులు పాల్గొన్నారు.