భారత క్రికెట్ ప్రేమికుడు మరచిపోలేని అద్వితీయ ప్రయాణం ‘83’ ట్రైలర్ విడుదల.. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24 ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల
భారతదేశంలో క్రికెట్‌ను ప్రేమించిన, ప్రేమించే, ప్రేమించబోయే ప్రతివారు తెలుసుకోవాల్సిన మరపురాని, మరచిపోలేని అద్భుతమైన ప్రయాణం 1983. ఈ ఏడాదిలో భారత క్రికెట్ గమనాన్ని దిశా నిర్దేశం చేసింది. భారత క్రికెట్ టీమ్ విశ్వ విజేతగా ఆవిర్భవించింది. అలాంటి అద్భుతమైన ప్రయాణం గురించి నేటి తరంలో చాలా మందికి తెలియకపోవచ్చు. అంతెందుకు ఇప్పుడున్నంత సాంకేతిక లేకపోవడంతో వార్తాపత్రికలు, దూరదర్శన్ వంటి ఛానెల్స్ ద్వారా మాత్రమే కపిల్ డేర్ డెవిల్స్ ప్రయాణం గురించి తెలిసింది. అయితే అది గ్రౌండ్‌లో మాత్రమే. అసలు ఎవరూ ఊహించని ఓ ప్రయాణాన్ని సుసాధ్యం చేయాలంటే ఎలాంటి భావోద్వేగాలకు క్రికెట్ టీమ్‌లోని సభ్యులు లోనై ఉంటారో ఊహించవచ్చు. అలాంటి ఓ ఎమోషనల్ జర్నీయే ‘83’. ఈ భారీ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదలవుతుంది.
డైరెక్టర్ కబీర్ ఖాన్ కొన్ని కోట్ల మంది భారతీయుల కలను వెండితెరపై సాక్షాత్కరింప చేయడానికి అడుగులు వేసినప్పుడు ఎలా ఉంటుందోనని అందరూ అనుకున్నారు. కానీ ‘83’ సినిమా పోస్టర్స్, ప్రమోషన్స్.. కపిల్ దేవ్ నుంచి మేనేజర్ మాన్ సింగ్ వరకు ప్రతి ఆటగాడిగా నటించిన యాక్టర్స్ గురించి క్రమంగా తెలుస్తూ రావడంతో సినిమాపై అంచనలు పెరిగాయి. రీసెంట్‌గా విడుదలైన టీజర్ ఈ అంచనాలను రెట్టింపు చేసింది. అయితే మంగళవారం విడుదలైన ‘83’ ట్రైలర్ ఈ అంచనాలను ఆకాశాన్నంటేలా చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ అలనాటి కపిల్‌దేవ్ పాత్రను పోషించగా.. నాటి కపిల్ సతీమణి పాత్రను రణ్వీర్ నిజ జీవితంలో సతీమణి అయిన దీపికా పదుకొనె క్యారీ చేసింది. ట్రైలర్ విషయానికి వస్తే.. 1983లో ఎంతో కీలకంగా భావించిన సెమీఫైనల్ పోరుతో మొదలైంది. నిజానికి 1983 సెమీఫైనల్స్‌లో భారత టీమ్ జింబాబ్వేను ఎదుర్కొన్నప్పుడు మ్యాచ్ ప్రసారం కాలేదు. ఆ మ్యాచ్‌ను ఎవరూ చూడలేకపోయారు. అలాంటి మ్యాచ్‌ను మన కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు డైరెక్టర్ కబీర్ ఖాన్. 9 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన భారత టీమ్‌ను ఆనాటి కెప్టెన్ దిగ్విజయంగా 176 పరుగులతో గెలుపు బాట ఎలా పట్టించాడో.. దాన్ని ‘83’ సినిమాలో చూపించనున్నారు.ఆ మ్యాచ్‌లోని కొన్ని ఎలిమెంట్స్‌తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది.
ఇక ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను ఎదుర్కొనే క్రమంలో భారత ఆటగాళ్లు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు. వాటిని మానసికంగా ఎలా అధిగమించి ప్రపంచ కప్పును ముద్దాడారు అనే విషయాలను ఈ ట్రైలర్‌లో ఆవిష్కరించారు. నేపథ్య సంగీతం, విజువల్స్ అన్నీ సినిమా బ్లాక్‌బస్టర్ పక్కా అని చెప్పేయడమే కాదు.. ప్రతి క్రికెట్ అభిమాని గుండెల్లో నిలిచిపోయే చిత్రమవుతుందని చెప్పకనే చెప్పేస్తుంది.
అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ సమర్పణలో కబీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా పదుకొనె, సాజిద్ నడియద్‌వాలా, కబీర్ ఖాన్, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంటమ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మించారు. కపిల్ దేవ్‌గా రణ్వీర్ సింగ్, కపిల్ సతీమణి రూమీ భాటియాగా దీపికా పదుకొనె, సునీల్ గవాస్కర్‌గా తాహిర్ రాజ్ బాసిన్, కృష్ణమాచార్య శ్రీకాంత్‌గా జీవా, మదన్ లాల్‌గా హార్డీ సందు, మహీంద్రనాథ్ అమర్‌నాథ్‌గా సకీబ్ సలీమ్, బల్వీందర్ సంధుగా అమ్మి విర్క్, వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణిగా సాహిల్ కత్తార్, సందీప్ పాటిల్‌గా చిరాగ్ పాటిల్, దిలీప్ వెంగ్‌సర్కార్‌గా అదినాథ్ కొతారె, రవిశాస్త్రిగా కార్వా.. మేనేజర్ మాన్‌సింగ్‌గా పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు. ఇండియన్ క్రికెట్‌లో మరచిపోలేని అమేజింగ్ జర్నీతో రూపొందిన ‘83’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 24న గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
Post a Comment