Home » , » Every Day is MothersDay-JD Chakravarthy-Telugucinemas.in

Every Day is MothersDay-JD Chakravarthy-Telugucinemas.in

'నా తల్లే నా బలం'


(మదర్స్ డే సందర్భంగా)
మా నాన్నంటే నాకు అసహ్యం. మాతృదినోత్సవం రోజు నాన్నంటే అసహ్యం అంటున్నాడేంటి? అనుకుంటున్నారా! మా నాన్న తాగుబోతు అయ్యుండి, తిరుగుబోతు అయ్యుండి, చీటికి మాటికి మమ్మల్ని హింసించే రకం అయ్యుంటే నిజంగా నేను ఈ రోజు ఆనందించేవాడ్ని. కానీ మా నాన్న అలాంటి వారు కాదు. మమ్మల్ని ప్రాణం కంటే మిన్నగా చూసుకునేవారు. మరి అలాంటప్పుడు నాన్నంటే అసహ్యం దేనికి? అనేనా మీ ప్రశ్న. ఎందుకంటే, నా పదమూడో ఏటే నన్ను వదిలేసి, అమ్మను ఒంటరి చేసి వెళ్లిపోయారాయన. అందుకే ఆయనంటే అసహ్యం, కోపం. అయితే... నాన్నలేని లోటు మాత్రం అమ్మ మాకెప్పుడూ రానివ్వలేదు. అమ్మే నాన్నై పెంచింది. ఏ విషయంలోనూ అమ్మ నన్ను ఎమోషనల్ బ్లాక్‌మైల్ చేసేది కాదు. ‘చెప్పిన మాట వినకపోతే... నేను హర్ట్ అవుతాను’ అనేది అంతే. వెంటనే చేసేసేవాడ్ని. 

అందరూ ‘మా అమ్మే నా వీక్నెస్’ అంటుంటారు. కానీ నేను అలా అనను. ‘నా తల్లే నా స్ట్రాంగ్‌నెస్’ అంటాను. హీరోగా ఎంత ఎదిగినా, ఎంత డబ్బు సంపాదించినా పూర్తిగా అమ్మపైనే ఆధారపడిన వాణ్ణి నేను. ఇప్పటికీ నా డ్రస్సులు కూడా నేను సెలక్ట్ చేసుకోనంటే మీరు నమ్ముతారా? సినిమాల్లో నేను ధరించే డ్రస్సులను మినహాయిస్తే... బయట నేను వేసుకునే దుస్తులన్నీ అమ్మ సెలక్ట్ చేసినవే. అందుకని ఆమె డిక్టేటర్‌గా వ్యవహరిస్తుందనుకుంటే పొరపాటు. నా ఇష్టాయిష్టాలను బట్టే అమ్మ నడుచుకుంటుంది. అమ్మకు నేనంటే చాలా నమ్మకం. నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మేస్తుంటుంది. అయితే... నేనెంటో అమ్మకు పూర్తిగా తెలుసు. నేను హీరో అయ్యాక నాపై వచ్చినన్ని గాసిప్పులు ఏ హీరోకీ వచ్చి ఉండవు. వాటన్నింటినీ చాలా తేలిగ్గా తీసుకుంటుంది అమ్మ. ఈ మధ్య నాకు పెళ్లి అయిందన్న రూమర్ కూడా వచ్చింది. ఈ విషయాన్నే మా బంధువు అమ్మను అడిగారట. ‘నువ్వనట్లు వాడికి నిజంగా పెళ్లయితే ఎంత బావుడ్నో. కానీ.. వాడు ఎప్పుడూ నాతోనే ఉంటాడు. రెస్ట్ తీసుకోవడానికి మాత్రం ఓ మూడు గంటలు పైకైళ్లి పడుకుంటాడు. ఆ మూడు గంటల్లో పెళ్లైపోయిందంటే.. నేనైతే నమ్మను’ అని సమాధానం ఇచ్చిందట అమ్మ. ఇంకేముంది ఖంగు తినడం వారి వంతైంది. 

నేనైతే అమ్మను అప్పుడప్పుడు ఆట పట్టిస్తుంటా. ‘అమ్మా... నువ్వు చాలా అదృష్టవంతురాలి. ప్రతి కొడుక్కీ ఒకే పెళ్లి ఉంటుంది. కానీ నీ కొడుక్కి చూడు ఎన్ని పెళ్లిల్లో, ఎన్నెన్ని ఎఫైర్లో. సుస్మితాసేన్‌తో కొన్నాళ్లు కట్టారు. మనీషా కోయిరాలాతో కూడా లింకు పెట్టారు. తర్వాత ఎవరితో కావాలో నువ్వే ఎన్నుకో అని హీరోయిన్ల ఫొటోలు చూపిస్తుంటా’ అమ్మ కూడా నవ్వుకుంటుంది. షూటింగులకు కూడా అమ్మ నాతోనే ఉంటుంది. ‘హీరోయిన్లు మదర్స్‌తో రావడం చూస్తుంటాం. కానీ హీరో మదర్‌తో రావడం మాత్రం మీ విషయంలోనే జరుగుతుంది’ అని అందరూ అంటుంటారు. కానీ అమ్మ లొకేషన్‌కి మాత్రం రాదు. హోటల్‌లోనే ఉంటుంది. ‘మీరు పెళ్లి ఎందుకు చేసుకోరు?’ అని చాలామంది అడుగుతుంటారు. దానికి నేను రకరకాలుగా సమాధానాలు చెబుతుంటాను. కానీ అసలు విషయాన్ని చెప్పనా? మా ఫ్లాట్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న టైమ్‌లో ఓ రోజు మా అమ్మ నన్ను బలవంతంగా ఫ్లాట్ దగ్గరకు తీసుకెళ్లింది. ఫ్లాట్ చూపించడానికి తీసుకొచ్చిందేమో అనుకున్నాను. కానీ అక్కడకెళ్లగానే... ఓ కార్లో తల్లీ కూతుళ్లు దిగారు. నిజంగా ఆ అమ్మాయిని చూడగానే ఫిదా అయిపోయాను. అంత అందంగా ఉంది. చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలనుకున్నాను. వాళ్లు సరాసరి మా దగ్గరకే వచ్చారు. అప్పుడర్థమైంది... వాళ్ల్లు అమ్మకి తెలిసిన వాళ్లని. ఆ అమ్మాయిని, నన్ను ఒంటరిగా వదిలేసి మా అమ్మ, ఆ అమ్మాయి వాళ్ల అమ్మ పక్కకెళ్లారు. మా ఇద్దరికీ పరిచయం లేదు. దాంతో మాటల్ని అక్కడికక్కడ క్రియేట్ చేసుకొని మాట్లాడుకుంటున్నాం. ఈ లోపు నాకు డౌట్ వచ్చింది. నిజం చెప్పండి? అసలు మీరెవరు? ఎందుకు ఇక్కడకొచ్చారు? అని ఆ అమ్మాయిని అడిగేశాను. ‘మన పెళ్లికి మీ ఇంట్లోవాళ్లు, మా ఇంట్లో వాళ్లు ప్లాన్ చేస్తున్నారు’ చెప్పిందా అమ్మాయి. అంతే... ఒక్కసారిగా కలల్లో తేలిపోయిను. ఓ డ్యూయెట్ కూడా పాడేసుకున్నాను. అక్కడే రాముగారి సినిమాల్లోలా ఊహించని మలుపు. ఫ్లాట్ ఒక్కటే కడుతున్నారేంటి? అనడిగిందామ్మాయి. మరి ఎన్ని ఫ్లాట్లు కడతారు? అన్నాన్నేను. ‘ఒకే ఫ్లాటైతే... మీ అమ్మ ఎక్కడుంటారు’ అంది. అంతే నేను షాక్. ‘నేను ప్రశాంతతను కోరుకుంటాను. నేను, నా భర్త అంతేతప్ప మూడో మనిషి ఉండటం నాకు ఇష్టం ఉండదు’ అంది. మళ్లీ షాక్. ‘మీ అమ్మ కోసం వేరే ఫ్లాట్ చూడండి. కనీసం కొనకపోయినా అద్దెకు తీసుకోండి. అవసరమైతే భోజనం మనమే పంపిద్దాం’ అని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. నాకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. 

పిల్లలు పెళ్లి చేసుకుంటే తల్లులు అనాధలవ్వాలా? వృద్ధాశ్రమాల్లో బ్రతకాలా? లేక విషం తాగి చావాలా? అనే రకరకాల ప్రశ్నలు. ఆ దెబ్బతో నాకు పెళ్లిపైనే ఇంట్రస్ట్ పోయింది. ఈ విషయం అమ్మకు కూడా తెలీదు. ఆ అమ్మాయంటే నాకు ఎంతో రెస్పెక్ట్. ఎందుకంటే తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పి నాకు జ్ఞానోదనం చేసింది. ఈ రోజు మదర్స్ డే కారణంగా మీరు నా దగ్గరకొచ్చారు. కానీ నా వరకూ ‘మదర్స్ డే’ అంటే నేను పెద్దగా ఇంట్రస్ట్ చూపను. ఎందుకంటే అది ఫారన్ థాట్. ఒక్కరోజైనా అమ్మతో గడపాలని వారు ఈ రోజును క్రియేట్ చేసుకున్నారు. నా విషయానికొస్తే... నేనెప్పుడూ అమ్మతోనే ఉంటాను. కాబట్టి నాకు ప్రతి రోజూ మదర్స్‌డేనే. - జేడీ చక్రవర్తి  

courtesy sakshi

Share this article :