తన హాస్యాభినయంతో కొన్ని దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులకు చక్కిలి గింతలు పెట్టిన ప్రముఖ హాస్యనటుడు సుత్తి వేలు ఈ రోజు ఉదయం చెన్నయ్ లో గుండెపోటుతో మరణించారు. 62 సంవత్సరాల సుత్తి వేలు అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. హాస్యబ్రహ్మ జంద్యాల రూపొందించిన 'ముద్దమందారం' చిత్రం ద్వారా ఆయన సినీ రంగానికి పరిచయమయ్యారు. తర్వాత నటించిన 'నాలుగు స్తంభాలాట' చిత్రం ఆయనకు ఎంతో పేరు తెచ్చింది.
చిన్నప్పుడు ఆయన సన్నగా, బక్కపలచగా వుండేవారు. దాంతో సన్నిహితులు 'వేలు'లా ఉన్నాడంటూ పిలిచేవారు. అలాగే, 'నాలుగు స్తంభాలాట' సినిమాలో ఆయన పాత్ర పేరు సుత్తి. దాంతో ఈ రెండు పేర్లూ కలిపి తన పేరును సుత్తి వేలుగా మార్చుకున్నారాయన. సుమారు 250 చిత్రాలలో నటించిన వేలు, కేవలం హాస్య పాత్రలే కాకుండా కంట తడి పెట్టించే క్యారెక్టర్ వేషాలు కూడా వేశారు. ఆయనకు ముగ్గురు కూతుళ్ళు, ఓ కొడుకు వున్నారు. చెన్నయ్ లో ఈ రోజు సాయంకాలం ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయి.
Post a Comment