దసరా బుల్లోడికి ఘన సన్మానం

తెలుగు సినీ పరిశ్రమకు మూలస్తంభాల్లాంటి వ్యక్తుల్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. పౌరాణికం, జానపదం, సాంఘికం.. ఇలా కథ ఏదైనా సరే తనదైన మార్కు నటనతో 75 ఏళ్లుగా అఖిలాంధ్ర పేక్షకుల నీరాజనాలు అందుకుంటూనే ఉన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని TSR కళాపీఠం ఆయన్ను ఘనంగా సన్మానించింది.

టాలీవుడ్ దసరాబుల్లోడు.. ఎవర్‌గ్రీన్‌ అందగాడు.. పద్మవిభూషణ్‌ ANR నట జీవితం పూర్తై 75 ఏళ్లైన సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శిల్పకళావేదికలో జరిగిన ఈ వేడుకకు.. మూడు తరాలకు చెందిన అతిరథులంతా హాజరయ్యారు. ANRకు శుభాకాంక్షలు చెప్తూ.. ఆయనతో తమ అనుబంధం గుర్తు చేసుకుంటూ.. వెనుకటి రోజులకు వెళ్లిపోయారు.

ఏఎన్నార్‌తో కలసి నటించిన నటీమణులు ఈ ప్రోగ్రామ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సహనటులు ఏఎన్నార్ సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని గుర్తుకు తెచ్చుకుని అభినందనలు తెలిపితే.. చిన్నవాళ్లు ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. నాటక రంగం నుంచి తెలుగు తెరకు పరిచయమైన ఏఎన్నార్‌.. 40వ దశకంలో సినీరంగంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ కొన్ని వందల సినిమాల్లో నటించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో.. అవార్డులు, రివార్డులకు అసలు లెక్కేలేదు. 

అందుకే.. అంతటి మేటి నటుడిని.... MP సుబ్బిరామిరెడ్డి తన కళాపీఠం తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. టాలీవుడ్ తారా తోరణమంతా తరలిరావడంతో ఎటు చూసినా సందడి కనిపించింది.

Post a Comment

Previous Post Next Post