'శ్రీరామరాజ్యం' సినిమా ఆ చిత్ర కథానాయిక నయనతారలో ఎంతో మార్పు తీసుకువచ్చినట్టు కనిపిస్తోంది. జన్మతః సంప్రదాయ క్రీస్టియన్ కుటుంబానికి చెందిన ఆమె ఇప్పుడు హిందూ దేవాలయాలను సందర్శిస్తోంది. తాజాగా నిన్న తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చిన ఆమె, కల్యాణోత్సవ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొంది.
ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో నయనతార మాట్లాడుతూ, తన జీవితంలో మొట్ట మొదటి సారిగా తిరుమల వచ్చాననీ, స్వామి వారి ఆశీస్సులు అందుకున్నాననీ చెప్పింది. బాలాజీ దర్శనం తనకెంతో సంతోషాన్నిచ్చిందని ఆమె తెలిపింది. ఆ సమయంలో ప్రభుదేవా ప్రేమ వ్యవహారం గురించి మీడియా ప్రస్తావించగా, ఆమె కాస్త అసహనాన్ని వ్యక్తం చేసింది. పవిత్రమైన తిరుమలలో ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం భావ్యం కాదేమో కదా? అంటూ మీడియా నుంచి తప్పించుకుంది. ఏమైనా, మానసికంగా నయనతారలో వచ్చిన మార్పు మాత్రం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది!
Post a Comment