శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్న ఈ సంస్థ ఈ ఉగాది సందర్భంగా కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలను అందించనుంది.
ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 1998 నవంబర్ 21న ప్రారంభించబడి గత 25 సంవత్సరాలుగా తెలుగు సినీ కళాకారులకు అవార్డులు అందిస్తున్నాం. ఈ ఏడాది 25వ సిల్వర్ జూబ్లీ లోకి అడుగెడుతున్న సందర్భంగా ఉగాది రోజున చెన్నైలో పురస్కారాల్ని అందజేయనున్నాం. ఈ సందర్భంగా ఎంపిక చేసిన 25 మంది అవార్డు గ్రహీతలకు వెండి మెమోటోలు ప్రధానం చేయాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ గవర్నర్ E.S.L నరసింహ గారు, మండలి బుద్ధప్రసాద్, డా|| అలీ, పి.సుశీల గారు, నిర్మాత రవిశంకర్ (మైత్రి మూవీస్) లాంటి ప్రముఖులు హాజరవుతున్నారు. ఉగాది రోజున చెన్నయ్‌లోని మ్యూజిక్ అకాడమీలో ఈ వేడుక జరగనుంది అన్నారు.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. కళాసుధ 25వ వసంతోత్సవం సందర్భంగా అందిస్తున్న అవార్డులు ప్రత్యేకంగా నిలవనున్నాయి. 25వ సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాల కార్యక్రమం త్రివేణి సంగమం గా జరగనుంది. సినీ అవార్డులతో పాటు మహిళా రత్న పురస్కారాలు అందజేయనున్నాం. ఆస్కార్ అవార్డు పొంది మన తెలుగు వాళ్లకు గర్వకారణమైన చంద్రబోస్ కు సత్కారం, మరియు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ దర్శకులు రమేష్ ప్రసాద్ గారికి అందిస్తున్నాం. బాపు-రమణ అవార్డు ను హను రాఘవపూడి కు, బాపు బొమ్మ అవార్డును సీనియర్ నటి ఈశ్వరి రావు కి అందజేయనున్నాం అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. మన తెలుగు వాళ్ళు చెన్నయ్ లో కళాసుధ ఉగాది పురస్కారాల పేరుతో 25 సంవత్సరాలుగా ప్రతిభను గుర్తించి సన్మానాలు చేస్తుండటం మనకు చాలా మంచి విషయం. తెలుగు వారి సత్తా ప్రపంచానికి చాటి చెప్పిన RRR ఆస్కార్ అందుకోవటం చాలా సంతోషం, ఆస్కార్ వాళ్ళు నిర్మాతను గుర్తించకపోయినా RRR నిర్మాతకు మీరు గుర్తించి ఉత్తమ నిర్మాతగా అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, పర్వతనేని రాంబాబు, మురళి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
కళాసుధ ఉగాది పురస్కార గ్రహీతలు:
ఉత్తమ చిత్రం- బింబిసారా
ఉత్తమ నటుడు- కళ్యాణ్ రామ్
ఉత్తమ నిర్మాత- DVV దానయ్య
ఉత్తమ పాటల రచయిత- చంద్ర బోస్
ప్రత్యేక జ్యూరీ అవార్డు- కార్తికేయ 2
ఉత్తమ నటి- అనుపమ పరమేశ్వరన్
S.P. బాలసుబ్రహ్మణ్యం అవార్డు- దేవిశ్రీ ప్రసాద్
లతా మంగేష్కర్ అవార్డు- M.M. శ్రీలేఖ
V.S.R. స్వామి అవార్డు- వంశి పచ్చిపులుసు (సినిమాటోగ్రఫీ - మేజర్)
ఇంకా అనేక రంగాల్లో పని చేసిన వారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు.