తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన దర్శకుడు శేఖర్ కమ్ముల
75 ఏళ్ల భారత స్వతంత్య్ర వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ సినిమా థియేటర్లలో ఉదయం ఆట గాంధీ చిత్రాన్ని చూపిస్తున్నది. ఈ షో ను హైదారాబాద్ దేవి థియేటర్ లో విద్యార్థులతో కలిసి చూశారు దర్శకుడు శేఖర్ కమ్ముల. వందల మంది విద్యార్థులతో గాంధీ సినిమా చూడటం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందంటూ ఆయన స్పందించారు. భారత స్వతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇవాళ దేవి థియేటర్ లో గాంధీ మూవీని వందల మంది విద్యార్థులతో కలిసి చూశాను. ఇదొక మర్చిపోలేని అనుభవం. గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహంలో భాగంగా ఈ చిత్రంలో వచ్చే సన్నివేశాలకు దేశభక్తితో పిల్లలు స్పందిస్తున్న తీరు చూస్తుంటే గర్వంగా అనిపిస్తోంది. ఇలాంటి కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది. మీరూ గాంధీ సినిమాను చూడండి. అని శేఖర్ కమ్ముల ట్వీట్ చేశారు.